Wednesday, June 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కాస్తంత తోడొస్తావా-కలలోకి వెళుతున్నా

నీచేయినందిస్తావా-తలమునకలౌతున్నా

కవితలకు వీలౌతుంది-కవి తలకు మేలౌతుంది

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను


1.నీ చూపుల శరాలనే మారుస్తా అక్షరాలుగా

నీ పదాల గురుతులనే పేరుస్తా పదాలుగా

నీ మంజుల దరహాసాన్నే వాక్యాల్లో కుమ్మరిస్తా

నీ గాత్ర పరిమళాన్నే  గీతమంత పరిచేస్తా

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను


2.నీ స్పర్శలోని హాయిని రాగమందు రంగరిస్తా

నీ గుండె సవ్వడిని పాటకు తగు లయచేస్తా

కలిగే గిలిగింతలన్నీ గమకాలు పలికిస్తా

మిగిలే అనుభూతులన్నీ కృతిగా నేనాలపిస్తా

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మీటితే మ్రోగుతుంది నీ హృదయవీణ

రాగాలు పలుకేనది అది సంగీత ప్రవీణ

సవరించితే చాలు తెగిన తీగలన్నీ

వరించేను మధురిమలెన్నో ఎదుటి ఎదలన్నీ


1.ఆటగా భావించారో ఘాటుగా వేటేసారో

మోటుగా వాయించారో చేటుచేయనెంచారో

మూలబడిపోయింది నీ మానసవీణ

మూగవోయి మిన్నకుంది ఈ నవ్వుల నిక్వణ


2.శిథిలమైపోయింది మరమ్మత్తులే లేక 

శకలమై మిగిలింది బాధ్యతెవరు తీసుకోక

దుమ్మునంత దులిపేస్తే నవ్యంగా తోస్తుంది

శ్రుతిచేసి సంఘటిస్తే సవ్యంగా పలికేస్తుంది


PIC.courtesy:  Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముసుగేసుకోకు నీ మనసుకు

విసుగునే పులుమకు అందాలమోముకు

అద్దమైన ఎప్పుడు చూపని సౌందర్యం నీది

అనుభూతి చెంది ఉండని లావణ్యం నీది

పూర్వజన్మ పుణ్యమే నిను పొగిడే అవకాశం

ప్రస్తుతించ ధన్యమే అనుమతించ నా అదృష్టం


1.దబ్బపండు ఛాయలో నీ మేనిరంగు

అబ్బా అని అనిపించేలా అంగాంగ హంగు

మబ్బులను మరిపించేలా నీకురులు రేగు

పబ్బమల్లె నినుగనినంత ఉల్లమే ఉప్పొంగు


2.వెతికితేనె కనబడునంత నంగనాచి నడుము

మతిచెలింప చేసేంత దోబూచి నీ ఉదానము

చితి నుండి బ్రతికించేటి నీ నడకల సోయగము

కృతిని నాతొ పలికించేటి అపురూప రూపము


3.ఎక్కడ మొదలెట్టానో కవితంతా తికమక

ఎలా చెబుదామన్నా ప్రతీది పాత పోలిక

నయనాలు అధరాలు దరహాసము నాసిక 

చతికిల బడిపోయాను ఉపమానమె తోచక

 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడడుగులు నడవనీ

మూడుముడులు వేయనీ

మనస్సాక్షిగా అగ్నిసాక్షిగా

తాళిబొట్టుకట్టనీ తలంబ్రాలు పోయనీ

శుభలగ్నాన కళ్యాణ మండపాన

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


1.పరస్పరం ఇరువురం ఇష్టపడి

జరగనీ తాంబూలల మార్పిడి

ఊరూ వాడంతా మన పెండ్లి సందడి

నూతన అనుబంధాలే ముడివడి

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


2.ఆహ్వాన పత్రికలే ఎల్లరకూ పంచి

బంధు మిత్రులందరినీ మనవుకు పిలిచి

రంగరంగవైభవంగా విహహమునకేతెంచి

విందునారగించనీ అతిథులు మననాశీర్వదించి

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


3.కన్యాదానమునే మామనుండి స్వీకరించి

మంగళవాద్యాల మధ్య మంగళాష్టకాలు చదువ

సుముహూర్త సమయాన వేదమంత్రాలనడుమ

 జిలకర బెల్లాన్ని మనం తలలపై దాల్చనీ

నీలేత పాణిగ్రహణమేచేయనీ-నిను పరిణయమాడనీ