Saturday, October 9, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేళమించిపోతుంది మదిని చదువులోగా

గడువుదాటిపోతుంది  మనసుతెలియులోగా

ఇకనైనా గ్రహించు ఎదుటివారి అనురాగం

ఇపుడైనా అనుభూతించు అసలైన మైత్రీయోగం


1.ఎంతమంది నీకున్నారో ఆప్తులు స్నేహితులు 

ఎంతమందిలో ఉన్నానాకు నీవే పంచప్రాణాలు

వాడుకొని విసిరేసే బాపతైతె కాదు నేను

నిన్ను దప్ప ఎవ్వరినీ దరిదాపుకు రానీను


 2.ఆరిపోయేలోగా సవరించు స్నేహదీపం

మారిపోయేలోగా ఎరిగించు ఎదరూపం

గిచ్చిగిచ్చి చంపకు సరదాకై నా గుండెను

నీ సయ్యాటలలో బ్రతుకు సాంతం మండెను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇందిరా రమణా నీకిరు ఇంతుల పోరు ఎంతయా

పద్మావతి వల్లభా ఒక్కరైనా సరే నా అలవికాదయా

నీకు నీ  సతుల వల్ల యాతన చాలదనా

నాకు ఊఢనంటగట్టి వినోదింతువేలయా


1.సంసార సాగరం దుఃఖం నానుడి వినలేదా

ఏక మార్గ ద్వారం కాపురమని నీకేరుకేలేదా

మరణమొక్కటే త్రెంచగలదు  నా భవబంధం

నీ సన్నిధి మాత్రమే నాకు అనంతమైన ఆనందం


2.అరవయేళ్ళ జీవితం ఇంతటితో ఇక చాలు

క్షణమైనా మనలేను శరణు నీ పాదాలు

సుఖసంతోషాలు కొల్లగొడితె మానె స్వామి

విముక్తైన ప్రసాదించి నను కడ తేర్చవేమి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చదువు కొనలేక చదువుకొనలేక

బాల్యానికి అమూల్యమైన విద్య దక్కక

మురికి వాడల్లో దిక్కూ దెస తోచక

రేపటి నా పౌరుల ఆకటి కేక చీకటి రేక


1.చెత్తను ఏరుకొంటు తాలు విత్తనాలుగా 

గారడి చేసుకొంటు కూడలి చిత్తరువులుగా

కప్పులు కడుగుకొంటు బాలకార్మికులుగా

పేపర్ పంచుకొంటు చిరు ఆర్జనపరులుగా

పాలు పంచుకొంటు చేదోడు వాదోడుగా


2.కార్పొరేటు స్కూళ్ళవైపు ఆశగా ఒక చూపు

ఆపసోపాలతో సగటు మనిషి నిట్టూర్పు

ఉట్టికైన ఎగరలేక స్వర్గానికెగిరి ఎగిరి అలుపు

విద్య వైద్యం ఉచితమైతేనే జాతికి సముచిత గెలుపు

ప్రభుతకు ప్రగతి ప్రాథమ్యమైతేనే సముచిత గెలుపు