Tuesday, June 25, 2019


ఆషామాషీ కాదురా శంకరా శివశంకరా
మనిషిగ పుట్టి మహిలోమనుట సవాలురా
అల్లాటప్పా కాదురా ఈశ్వరా పరమేశ్వరా
నీతీనియతీ లేని చోట బ్రతుకే నరకంరా

1.గరళం తాగి ఘనతే చాటా వనుకోకెప్పుడు
సరళం కాదుర కల్తీ మింగి బాల్చీ తన్నకుండుడు
గంగను తలపై పెట్టుకుంటే  తపనంటేమిటొ తెలిసేనా
దప్పిక తీరక చుక్కనీటికై అలమటించడం ఎరుకౌనా
కైలాసాన్నే వీడరా భువికి విలాసం మార్చరా
పట్టుమని నువు పదినాళ్ళుంటే ఒట్టంటే ఒట్టేరా

2. పాములే నగలనుకొంటూ గొప్పలు చెప్పితే ఎట్టా
పసికూనలనే  కాటువేసే విషనాగులు మాచుట్టా
భూతనాథుడవు నీవంటే నమ్మేదది ఎట్టా ఎట్టెట్టా
వావివరుసలు మరచిన కామ పిశాచాలు మాచుట్టా
ఉంటేగింటే నీ మహిమలనే చూపరా ఇకనైనా
కాల్చివేసే కన్నే ఉంటే అమానుషం మసిచేయరా
మూగవు కావురా-మౌనము వీడరా
పలుకుల ఝరి నీలో ప్రవహింపజేయరా
మాటల తేనెల్లో మము ముంచివేయరా
బిడియము ఏలరా-తడబడనేలరా
తెలిసిన భాషలోనె తెగబడి భాషించరా
మనసులోని భావమంత సూటిగ సంధించరా

1.నిన్ను నీవు ఎన్నటికీ చులకన చేసుకోకు
పరులకన్న నీవెపుడూ అల్పుడవని అనుకోకు
అణగారి పోయింది నీలొ ఆత్మవిశ్వాసం
తట్టిలేప గలిగితే చేయగలవు సాహసం
న్యూనతాతత్వాన్ని నీనుండి తరిమికొట్టు
సంకల్పం గట్టిదైతే చేరగలవు తుదిమెట్టు
బేలవుకావురా ధీరుడవీవురా
మడమతిప్పకుండనీవు ముందుకె అడగేయరా

2.అలసటనే ఎరుగునా అల ఎన్నటికైనా
చెలియలికట్టనే అడ్డుగ కట్టినా
ప్రయత్నాన్ని విరమించక అంచనాలు మించదా
సునామిగా మారి గట్టు దాటక తా మానునా
ఆటంకం నీలోన పెంచాలి పట్టుదల
ఓటమి నీకెపుడూ నేర్పాలి మెళకువ
ఇటుకమీద ఇటుక పేర్చి కట్టాలి భవంతిని
ఓపికతో జట్టుకట్టి కొట్టాలి ఉట్టిని
మిరపకాయ బజ్జీ-పేరు చెప్పగానే తిన బుద్ది
ఘుమఘుమ వాసన-నీళ్ళూరగ రసన
బంగారు వన్నెతో అలరారు చుండగ
బండిని దాటిపోవ బ్రహ్మ కైన సాధ్యమా

1.శ్రేష్ఠమైన పచ్చిమిర్చి-రెండవకుండ చీల్చి
మధ్యలోన ఉప్పు వాము చింతపండు కూర్చి
చిక్కనైన శనగపిండిలొ ఒకే వైపు ముంచి
కాగిన నూనెలో కడాయిలోకి జార్చి
కాలీకాలకుండ జారమీద ఆరనిచ్చి
మరిగిన నూనెలో మరలా వేయించి
తరిగిన సన్ననైన ఉల్లిపాయల్ని చల్లి
 గరం మీద కొరికితింటె నా సామి రంగా
చస్తేనేం తిన్నాకా ఉన్న ఫళంగా

2.వేడితో ఒకవైపు కారంతో మరోవైపు
సుర్రుసుర్రుమన నాల్కె హుషలుగొట్ట తింటుంటే
ముక్కునుండి కళ్ళనుండి గంగధార కడుతుంటే
ఎన్ని తిన్నామో తెలియనంత మైమరచి
పెదవి నుండి పెద్దప్రేగు చివరి వరకు మండినా
ఆపమెపుడు తినడాన్ని తనివి తీరునంతదాక
తెలుగువారికెంతగానొ ప్రియమీ చిరుతిండి
ప్రతిరోజూ తిన్నాగాని మొహంమొత్తబోదండి
మిర్చిబజ్జి తినని జన్మ నిజంగానె దండగండి
పడవే నీవిక వానా
పడవే పల్లెలలోనా
పడవే మాకు ఆటవస్తువు కాగా
కాగితపు పడవే పిల్లకాల్వలో సాగా

1.జలజలరాలే చినుకుల్లోనా
బిలబిల పిల్లల పలుకుల్లోనా
వానావానా వల్లప్పా
చేతులుచాపే చెల్లెప్పా
గిరగిర తిరుగుతు గంతులు వేయ
తడితడి దుస్తుల నర్తన లాడ

2.వెలిసీవెలియని వర్షంలోనా
ఇసుక మేటల కుప్పల్లోనా
పాదము జొనిపి ఇసుకను కప్పి
పిచ్చుక గూళ్ళే ఒడుపుగ కట్టి
పుల్లలతోని ఎరలను కదిపి
ఆరుద్ర పురుగుల పెటెలొ పెట్టగ