Saturday, December 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బ్రతుకు నీది భవిత నీది

ఆశ నీది శ్వాస నీది

ఆశయాల పాట నీది

ఒడిదుకుల బాట నీది

గమనం అప్రతిహతంగా

గమ్యం అనితర సాధ్యంగా


1.ఒకడిగా విస్ఫోటమై సమాజంగ మారడం

సమాజపు జాడనొదిలి నీ లోలోకి చేరడం

ఒంటరిగా …మౌనంగా…దైన్యంగా… శూన్యంగా

అవమానం… సన్మానం…  సమంగా…ఆనందంగా

గమనం విలాసంగా గమ్యం కైలాసమే విలాసంగా


2.ఆటంకాలు సంకటాలు సంకల్పానికి కంటకాలు

ఆవేశాలు విద్వేషాలు ఉద్దేశ్యాలకు విఘాతాలు

కప్పదాటుగా వెన్నపోటుగా చాటుమాటుగా వేటువేయగా

సహనంగా… సాధనగా…సులభంగా… సుసాధ్యమవగా

గమనం వినోదంగా గమ్యం ప్రతిపదం పరమపదంగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


తిరుమలేశ కేశవా నమో

వేంకట నారాయణా నమో

రమాధవా మాధవా నమో

కోనేటిరాయా గోవిందా ప్రభో

పాహిపాహి పద్మావతి ప్రియ విభో


1.విష్ణవే నమో మధుసూధనా

శ్రీధరా త్రివిక్రమా నమో వామనా 

హృషీకేశ పద్మనాభ నమో సంకర్షణా

దామోదర వాసుదేవ నమో ప్రద్యుమ్నా

కొండల రాయా గోవిందా ప్రభో

దేహిదేహి అలమేలు మంగా విభో


2.అనిరుద్ధా పురుషోత్తమ నమో అధోక్షజా

నారసింహ అచ్యుతా నమో హే జనార్ధనా

ఉపేంద్రాయ హరయే నమో నమో శ్రీ కృష్ణా

శరణాగత వత్సలా శ్రీనివాస నమో దీనావనా

కొంగుబంగార మీవె గోవిందా ప్రభో

పరి పాలయమాం స్వామీ  శ్రీ విభో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాటవమున్న పాట మీరు

పరిమళాలు గుప్పెడి పూదోటమీరు

వర్ధమాన కవులకు రాచబాట మీరు

ఏనాటికైనా మేము చేరాలనుకొనే ఎత్తైన చోటు మీరు

చేంబోలు సీతారామశాస్త్రిగారు సిరివెన్నెల అయింది మీ ఇంటిపేరు


1.మీదైన అరుదైన ముద్ర మీ సినీగీతాలది

రాజీ పడని హుందా చెడని చక్కని శైలిమీది

విషయమెంత వైవిధ్యవంతమైనా రాసారు హృద్యంగా

మీకలం మీ కవనం మీదయా గుణం అనితర సాధ్యంగా

ఏనాటికైనా మేము చేరాలనుకొనే ఎత్తైన చోటు మీరు

సిరివెన్నల సీతారామ శాస్త్రిగారు అంతలోనె మమ్మెలా వీడినారు


2.సమకాలీనులకు మీరే పరమాద్భుతంగ

 అందుకున్న పద్మశ్రీ బిరుదుకే వన్నెలు తేగ

సముచితమైన సుస్థిర స్థానం మీది సినీ జగత్తులో

తరతరాలు ఓలలాడేరు పిపాసులు మీ కవన మత్తులో

ఏనాటికైనా మేము చేరాలనుకొనే ఎత్తైన చోటు మీరు

సిరివెన్నల సీతారామ శాస్త్రిగారు ధన్యులు మీరీశునిలో ఐక్యమొందినారు౹