Wednesday, February 17, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందరూ మంచివారే

తప్పుచేయు అవకాశం రానంతవరకూ

అందరూ గొప్పవారే

మనసు ముసుగు జారనంత వరకూ

హద్దులు గిరిగీస్తుంది ఈ సభ్యసమాజం  

న్యాయమూర్తిగ వ్యవహరిస్తుంది

చుట్టూరా ఉన్న ప్రపంచం


1.దాసులే అంతా అహం మమకారాలకు

అతీతులెవ్వరు కానేకారు గుణత్రయాలకు

బుజ్జిగించి అపగలేరు పంచేంద్రియాలను

ఎదిరించలేరు ఎపుడూ అరిషడ్వర్గాలను

వేదాలు వల్లిస్తారు అందుబాటులేకనే

నీతుల్ని బోధిస్తారు అనువుకానిచోటనే


2.అధిగమించలేరు సప్తవ్యసనాలను

ఆశించక మానరు అష్టైశ్వర్యాలను

పోషించక వీడరు నవరసాలను

ప్రదర్శిస్తూనే ఉంటారు దశరూపకాలను

వెసులుబాటు నిస్తుంది ఆ కాస్త విచక్షణ

మొక్కుబడిగ పాటించే విలువలే రక్షణ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంచవన్నెల రామ చిలుక నీవు

ప్రపంచమే నీవైన శారిక నేను

వంచించకు నను నిలువెల్లా ముంచకు

ప్రేమించడమంటేనే నేరంగా ఎంచకు

నే తగనని భావించకు


1.నెమలిని కోరలేదు విలాసమే పరికించి

హంసను ఆశించలేదు వయ్యారమే కాంచి

అందమైన వెన్నిలేవు సుందర ప్రకృతిలోన

అనుబంధమేదొ మేలుకొంది మనమధ్యన

చెలీ మన మధ్యనా


2.ఇంద్ర ధనుసు నీకన్న కడు విణ్నానమే

ప్రత్యూష వర్ణాలు నయనానందకరమే

అందముంటె మాత్రమేమి నంజుకతింటామా

ఆనందమేదొ కలుగుతోంది జంటగ కలగంటినా

నిను జంటగ కలగంటినా