Saturday, August 24, 2019

పన్నీటి వసంతం ఒక కంటిలో
కన్నీటి జలపాతం మరోకంటిలో
ఎన్నిసంచలనాలు నా ఒంటిలో
నందనవనాలూ స్మశానాలూ నా ఇంటిలో

1.జలతారు ముసుగుల్లో
దాగిఉన్న లొసుగులు ఎన్నో
దరహాస అధరాల వెనుక
మనసున ముసిరిన వెతలెన్నో
నోరు మాట్లాడుతుంది నొసలువెక్కిరించినా
తెగువ పోట్లాడుతుంది విధియే వక్రించినా

2.అన్ని పున్నమి రాత్రుల్లో
కారుమబ్బు కైనీడలెన్నో
గులాబీల రహదారుల్లో
గుచ్చుకునే వాడిముళ్ళెన్నో
వాస్తవాల గొంతునొక్కి మిథ్యరాజ్యమేలుతోంది
జీవించే హక్కుకొరకే బ్రతుకు ఈడ్వ బడుతోంది

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఐదున్నర అడుగులున్న ఆడపిల్లవే
నీ హంస నడక చూడగానే మనసు గుల్లనే
వంపుసొంపులెన్నొ ఉన్న  కొండవాగువే
నీ మేని హొయలు కనగ నా గుండె ఆగునే
ఊరించి నను చంపకు ఉత్తుత్తిగా
వెర్రోణ్ణి చేయకూ నను బొత్తిగా

1.కారుమేఘాలె నీకు కురులైనవి
తారలెన్నొ నీ జడలో మల్లెలైనవి
మెరుపులెన్నొ నీ మెడలో నగలైనవి
హరివిల్లే నీ పెదవుల నగవైనది
ప్రకృతే పరవశించి నీవశమైనది
పసిడికాంతి నీ ఒంటి తళుకైనది
ఊరించి నను చంపకు ఉత్తుత్తిగా
వెర్రోణ్ణి చేయకూ నను బొత్తిగా

2.వరూధినే నీతో సరితూగనన్నది
దమయంతే నీకు దాసోహమన్నది
ఊర్వశే పోటీకి విరమించుకొన్నది
మేనకే తప్పుకొని నీ వెనకే నన్నది
విశ్వసుందరిగ నీవేకగ్రీవమే
జగన్మోహినిగ నీకగ్రాసనమే
ఊరించి నను చంపకు ఉత్తుత్తిగా
వెర్రోణ్ణి చేయకూ నను బొత్తిగా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మధ్యమావతి

కాలరుద్రుడా వీరభద్రుడా
కన్ను తెరవరా ఇకనైనా
గరళకంఠుడా హే నటేశుడా
తాండవించరా ఇపుడైనా
ఘోరకలికి తెఱదించు
నేరవృత్తినే తెగటార్చు
పునఃసృష్టియే జరుగునట్లుగా
విశ్వ లయమునే గావించు
మానవత్వమును స్థాపించు

1.అత్యాచారము మా గ్రహచారం
అతివకు లేదిట అభయము
విలువలు మరచిన మా సమాజం
విశృంఖలతయే మా నైజం
కాల భైరవా భూతనాయకా
అవధరించరా ఇకనైనా
విరూపాక్షుడా విశ్వనాథుడా
నిదుర లేవరా ఇపుడైనా

2.అవినీతియే  మాకతి సామాన్యం
జనజాగృతియే ఇట కడు శూన్యం
మోసగించడం మా మనస్తత్వం
హింసించడం మా కానందకృత్యం
జ్వాలనేత్రుడా శూలహస్తుడా
ఆగ్రహించరా ఇకనైనా
వైద్య నాథుడా మృత్యుంజయుడా
అనుగ్రహించరా ఇపుడైనా