Saturday, July 13, 2019

జోహారు జోహారు జవానన్న నీకూ
వీరమరణమొందితివా దేశంకొరకూ
నీ జన్మ చరితార్థమేనాటికీ
భరతమాత ముద్దుబిడ్డ నువ్వే ముమ్మాటికీ
జై జవాన్ జయహో జవాన్- జైజవాన్ జయహో జవాన్

1.జన్మించి చితిలోగతించేరు అందరూ
చావుతోనె చెలిమిచేయ పుట్టినారు మీరూ
ఎదిరించుటకేనాడు బెదిరింది లేదు
పోరునుండి వెనకడుగే వేసిందిలేదు
విజయమో వీరస్వర్గమో వరించేరు
చావో రేవో దేనికైన మీరెప్పుడు తయారు
జై జవాన్ జయహో జవాన్- జైజవాన్ జయహో జవాన్


2.వీరమాత నినుగన్న తల్లి
దేశమాతకందించె నిన్ను ఆ కల్పవల్లి
యోధులై పోరుతారు ప్రాణమే ఫణంగా
అమరులై వెలుగుతారు అజరామరంగా
మీశౌర్యం మీ త్యాగం మీ తెగింపు ఫలితంగా
రెపరెపలాడుతోంది నింగిలో తిరంగా-మన భారత పతాక
జై జవాన్ జయహో జవాన్ -జైజవాన్ జయహో జవాన్
పాండురంగా పాండురంగా-భక్తాంతరంగా
పాండురంగా పాండురంగా-కరుణాంతరంగా
పండరి పురవాస హేపాండురంగ
చంద్రభాగనదీ తీర శ్రీపాండురంగ

1.నిలవమని ఇటుకవేయ-కదలక నిలుచున్నావు
తలిదండ్రుల సేవయే-మనిషికి తగునన్నావు
కన్నవారి కన్నమిన్న-మరిలేదని అన్నావు
భక్తుని ఆనతియే-శిరోధార్యమన్నావు
పాండురంగా పాండురంగా-నీ సన్నిధె స్వర్గంగా
పాండురంగా పాండురంగా-నీ స్మరణే ముక్తికి మార్గంగా

2.కొలువై ఉన్నావు-రుక్మిణీ సహితంగా
పండరిపురమేదక్షిణ -మథురానగరంగా
దోచుకోవయ్యా-వెన్నలాంటి మా ఎదలు
కాచుకోవయ్యా-గోవులె మా బుద్ధులు
పాండురంగా పాండురంగా-నీ నామమే అమృతంగా
పాండురంగా పాండురంగా-నీ గానమే మకరందంగా
మనసుకు మెదడుకు ముడిపడదెన్నడు
మమతా నియతీ జత పడవెప్పుడు
అవధులేలేనిది అనురాగము
పరిధిమించనీయదు అధికారము

1.తర్కాలు రచియిస్తుంది వాదనలు నిర్మిస్తుంది
గెలుపుకోసమే ఎపుడు మేధ కృషిసల్పుతుంది
లాభాలునష్టాలు బేరీజువేస్తుంది
ఆచితూచి అడుగేస్తూ జాగ్రత్తపడుతుంది

మూర్ఖంగ స్పందిస్తుంది మౌనంగ రోదిస్తుంది
తనదృష్టికోణంలోనే ప్రపంచాన్నిచూస్తుంది
అనుచితాలు ఉచితాలు పట్టించుకోదు హృదయం
బంధాల ఆరాటంలో తాను బలియౌతుంది

2.ఋజువులే కోరుతుంది  వాస్తవాల్నె నమ్ముతుంది
ఆచరణ సాధ్యాలనే అమలుపరచబూనుతుంది
ఎదరొదను ఏమాత్రం బుద్ధి లెఖ్ఖచేయదు
లక్ష్యాన్ని సాధించుటలో విలువలకూ విలువీయదు

కలలెన్నొ కంటుంది కల్పనలో బ్రతికేస్తుంది
అనిర్వచనీయమైన అనుభూతికి లోనౌతుంది
మేధస్సు బోధలను మది ఖాతరె చేయదు
మానవీయనైజాన్ని మాటవరుసకైన మరువదు
అయోధ్యలో పుట్టాడు  శ్రీ రఘురాముడు
మహు లో జన్మించాడు  అంబేద్కర్ భీముడు
మానవ జాతికే ఆదర్శం ఆ రాముడు
భారతభూమికే మార్గదర్శి ఈ భీముడు

రాజ్యాన్నే త్యజించాడు ఆ రాముడు
పదవి కాలదన్నాడు ఈ భీముడు
సకల ప్రాణికోటిని ఆదరించినాడు ఆరాముడు
నిమ్నజాతుల నుద్ధరించారించాడీ భీముడు

రామరాజ్యమంటే అపురూపం ఏనాడు
భారత రాజ్యాంగమె స్ఫూర్తి జగతికీనాడు
ప్రజారంజకంగా పాలించెను రాజ్యాన్ని రాముడు
ప్రజామోదకంగా తీర్చిదిద్దె రాజ్యాంగం అంబేద్కరుడు
అనుదినమూ ఉగాది వేళనే
మదిమదిలో వసంత హేలనే
మావితోటల్లో కోయిలల పాటలే
మేను మరచి పాడే  కూని రాగాలే

1.తీపి చేదు ఏదోఒకటి
నిరీక్షణకు సార్థకంగా
గెలుపు ఓటమేదైనా
పరీక్షలకు ఫలితంగా
అనుభూతుల ఆస్వాదనలో
షడ్రసోపేతంగా
నవరసాల కలబోతే
రమ్యమైన జీవితంగా

2.ఉషోదయం ఆమనిగా
మధ్యాహ్నం వేసవిగా
సాయంత్రం చిరుజల్లుగా
రేయంతా శరత్తుమత్తుగా
చెలిసావాసమే చలికాలంగా
విరహాలు రేగా శిశిరంగా
ఆరుకారులే అరుదెంచంగా
రోజంతా బ్రతుకే మధురంగా