Tuesday, May 10, 2022


మీ మంచి మనసులకు చేజోతలు

మీ శ్రద్ధాసక్తులకు నా నమస్సులు

కురిపించినారు  అభినందనలతో మందారాలు

చిలికించినారు శుభకామనలతో

చందనగంధాలు

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు


1.విసుగు చెందకున్నారు నా వరుస కవితలకు

తూలనాడకున్నారు నా వికృత పాటలకు

గురుతు పెట్టుకొని మరీ పలకరించినారు

విశాల హృదయంతో దీవెనలందించినారు

నిన్నటి నా జన్మదినం సందర్భాన

నేటి మా వైవాహిక వార్షికోత్సవాన

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు


2.ఆత్మీయ బంధువులు నా ఆప్త మిత్రులు

సాహితి అభిమానులు ఏ కాస్తో పరిచితులు

వీరూ వారని లేరూ ఎందరో మహానుభావులు

పేరుపేరునా తెలుపున్నా కృతజ్ఞతాంజలులు

నిన్నటి నా జన్మదినం సందర్భాన

నేటి మా వైవాహిక వార్షికోత్సవాన

ఋణపడిపోతున్నా మీ ప్రేమామృత వాక్కులకు

విచలితమౌతున్నా మీ అభిమాన దృక్కులకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోపమెంత ఉన్నదో నామీద నీకు

అలక ఉన్నచోటే ప్రేమ తావు కాదనకు

చికాకెంత ఉన్నదో నా మీద నీకు

నీ చిత్తమంత నిండినాను ఆ మాట బూటకమనకు

చెలీ చెదరగొట్టనేల కలనిలా ఎద కలచివేసేలా

ప్రేయసీ అదరగొట్టనేల బెదిరీ బావురుమనేలా


1.పిపాసివై అలిసినప్పుడు శీతల పానీయమునైనా

తుఫానులో చిక్కినప్పుడు తీర దీప స్తంభమునైనా

బిగుసుకుంటుంది పాశం జారవిడిచిన కొద్దీ

తగ్గిపోతుంది దూరం  తప్పుకుంటున్న కొద్దీ

చెలీ చెదరగొట్టనేల కలనిలా ఎద కలచివేసేలా

ప్రేయసీ అదరగొట్టనేల బెదిరీ బావురుమనేలా


2.నా పాటలు పునాదిగా ప్రేమసౌధం నిర్మించా

నీ మాటలు ఆలంబనగా అనుభూతులు

మర్మించా

ఉభయత్రా నేనే ద్విపాత్రాభినయం చేసా

పదేపదే నిన్ను ఒడిదుడుకుల జడిలో ముంచేసా

మన్నించు నేస్తమా నా కవితకు నిను వస్తువు చేసా

చరమగీత మిదేలే భావుకతను ఇక్కడే పాతరవేసా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కంఠధ్వని కర్కశము-పలుకులేమొ పరుషము

లౌక్యమైతె శూన్యము-ముక్కుసూటి వైనము

ఎవరు చేయగలరిలలో-రాఖీ… నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


1.పదిమందిలొ ఇమిడేటి పద్దతి నెరుగవు

పదుగురితో ముదమారగ ప్రవర్తించనేరవు

పదపడి కదలడమే నీ పాట్లకు మూలము

చెల్లించగ రివాజే నీవే తగు మూల్యము

ఎవరు చేయగలరిలలో-రాఖీ ……..నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


2.నీకున్న కొద్దిమంది చెలిమి వారి సహనము

నీతోటి కొనసాగుట నీ మిత్రులకతి నరకము

నిష్ఠూరపు వాస్తవాలు నీవైనా ఓర్వగలవా

మనసారా పరుల ప్రతిభ ప్రశంసించ గలవా

ఎవరు చేయగలరిలలో-రాఖీ… …..నీతో నిజ స్నేహము 

ఎవరు మెచ్చగలరు నిన్ను-రాఖీ నీ బ్రతుకే కడు దైన్యము


3 కొడుకుగా సేవచేయనైతివి తల్లికి

భర్తగా సాయపడక పోతివి నీ ఆలికి

ఉన్నతి కలుగజేయవైతివి నీ సుతులకు

సన్నుతి వేడనైతివి దైవాన్ని సద్గతులకు

విఫలమైనావు వాసి పస లేని నస కవిగా

విగతజీవివైనావు ఒరులకు కొరగాని కొరవిగా


నీది అసమర్థుడి జీవయాత్ర

నీది విధివక్రించిన దీన పాత్ర

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి గీతా రాంకిషన్(రాఖీ)


ఒకటి ఒకటీ కూడితే అది రెండైతే కలన గణితం

మనసూ మనసూ కూడితే ఒకటైతే మన జీవితం

ఏనాడో అయినాము ఒకరికి ఒకరం అంకితం

ఈడు జోడుగ తోడునీడగ మన మనుగడ శాశ్వతం

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై 


1.నదులు రెండు సంగమించి సాగరమైన తీరుగా

మొక్కల నంటితె కొత్త వంగడం అంకురించినట్లుగా

కలలు రెండు పల్లవించి ఫలితమొకటైన రీతిగా

ఇరువురి నడగలు చేర్చే గమ్యం స్వర్గమైన చందంగా

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై 


2.ఇరు చరణాల మూలం పల్లవి మన సంసారంగా

మాట నీదిగా బాట నాదిగా సర్దుబాటయే కాపురంగా

చిరుచిరు అలకలు అరమరికలుగా ఆనందం సాకారంగా

ఊపిరి నీదిగ ఎదలయ నాదిగ  జతపడి జీవన శ్రీకారంగా

యుగయుగాలుగా చెరిసగమై రసజగమై అనురాగమై సహయోగమై సంయోగమై

 రచన,స్వరకల్పన&గానం:

డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


చల్లగ చూసే శ్రీశైల మల్లన్నా మా కొమురెల్లి మల్లన్నా మా వేలాల మల్లన్నా

పాద నమస్సులు మీకు నా పబ్బతులు పట్నాలు దయగనరోరన్న

ఎల్లకాలమిలా "నా పుట్టిన రోజున"

 చల్లని దీవెన్లు మీరు చల్లాలి నా మీన


1.తడిలేని గుండెతొ పుడితి పుడమినింక

గడియైన తిరమనక పడితి గవ్వల యెనక

గడిచి పోయే సామి నా బతుకంత ఎర్థంగా

పడిగాపులు పడుతున్నా నీదయకై ఆత్రంగా

ఆదుకో నన్నింక ఆ తిన్నని మాత్రంగ

చేదుకో సామి నీ వంక నను ప్రేమపాత్రంగ


2.కోపాలు తాపాలు నా లోపాలిస్తా తీస్కో

 ఫాల శేఖర నా పానాలైదునీవె భద్రంగ కాస్కో

పాపాలు శాపాలు ఏ జన్మలోనో చేసానెందుకో

నీ పాల ననుబడనీ వేడితి నా చేయినందుకో

లెక్కజేయి సామి  గ్రక్కున నన్ను ఎములాడ రాజన్న

అక్కున జేర్చుకొ మిక్కిలి దయగల్ల మా అక్కపెల్లి రాజన్న

 (అశుతోష్ రాణా నటుడు   హిందీ కవి షాయరీకి -స్వేఛ్ఛానువాద గీతం)


అనువాద రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:యమన్ కళ్యాణి


ఆదమరచి నిదురే పోలేనివేళ

ఎద భారం తీరేలా ఏడ్వలేని వేళ

మనసుకు తగు ఊరటే దొరకని వేళ

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకపరుస్తుంది


1.వడివడి గుండె దడే హెచ్చినపుడు

వత్తిడి చిత్తాన్ని కత్తిరించినప్పుడు

మనసు మనసులో లేదనిపించినపుడు

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకపరుస్తుంది


2.బ్రతుకు దుర్భరమయినపుడు

భవిత భయం గొలిపినపుడు

ఏకాకిగ నీలొ నీవు మదనే పడినప్పుడు

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకజేస్తుంది


3.వయసు మీరిపోతుంటే

తలపు తిరోగమిస్తుంటే

అసహనమే దహిస్తుంటే

బాల్యం మరీమరీ పలకరిస్తుంది

మూల్యం ఎనలేనిదని ఎరుకజేస్తుంది

 "మాతృ వందనం"


అమ్మా నీ మొదటి మాట 'నానా మంచిగ ఉన్నావా'

వెనువెంటనె నీ నోట 'కన్నా నువు తిన్నావా'

కడుపు చక్కి చూసేది నీవే కద మాయమ్మా

కమ్మగ చేసిపెట్టి కడుపు నింప నీకెంత తపనమ్మా


1.వయసు మీరి పోయినా విశ్రాంతి కోరుకోవు

ఇన్నేళ్ళు వచ్చినా నన్ను పసివాడిననే ఎంచేవు

డిల్లీకి రాజుగ నేనెదిగినా తల్లివి నీకు నేను బాలుడనే

నీ చల్లని దీవెనలే అమ్మా నా ఉన్నతి కెప్పుడు

మూలములే


2.ఏ చదువులు నేర్పలేవు నువు నేర్పిన సంస్కారం

పది మంది మెప్పుదలకు నీ పెంపకమే ఆస్కారం

నీ కడుపున పుట్టడం అమ్మా నా  జన్మకు పురస్కారం

నీ ఋణం తీరదెప్పటికీ ననుగన్న తల్లినీకు

పాదనమస్కారం