Monday, December 25, 2017


ఏడుకొండల మీద వెలిగి పోతున్న వేంకటేశ్వర స్వామి నీకు దండము
కొండగట్టు మీద కొలువు దీరి ఉన్న మాతండ్రి అంజన్న నీకు దండము
ఎములాడ రాజన్న భద్రాద్రి రామన్న దయగల్ల మాస్వామి దరంపూరి నర్సన్న నీకు దండము స్వామి నీకు దండము

1.విన్నమాటేగాని కన్నదెపుడూలేదు
మీరంత చేసిన మైమల గూర్చి
తీర్థాలుక్షేత్రాలు తిరుగుడేగాని తీరిన ముడుపుల చిట్టానే లేదు
మొక్కిన మొక్కులు లెక్కకు మిక్కిలి
ఎక్కిదిగిన గడపల కంతైతే లేదు

2.ఇచ్చేది చెప్పరు అడిగింది ఇవ్వరు
ఒంటికో ఇంటికో మంట బెడతరు
ఉన్నట్టు ఉంచరు ఊబిలోకి తోస్తరు
లబలబమనిమేము మొత్కోంగజూస్తరు
ఆటలాడందెమీకు పూట గడువదేమో
నటనలాపిమాకు నవ్వులందించరో
రచన&స్వరకల్పన:రాఖీ

ఎలా వ్యక్త పరుచాలో ఎరగనిదే ప్రేమా
ఎలా నిర్వచించాలో తెలియనిదే ప్రేమా

యుగయుగాలుగా ఎన్నో గాథలు విఫలమైనాయి ప్రేమనుదహరించలేక

తరతరాలుగా ఎన్నో రచనలు చతికిల పడినాయి
ప్రేమను వివరించ లేక

1.అమ్మ ప్రేగు పంచి ఇచ్చే అనురాగం ప్రేమ
నాన్న బ్రతుకు ధారబోసే వాత్సల్యం ప్రేమ
యువజంట మధ్య పుట్టే ప్రణయమే ప్రేమ
వార్ధక్యాన తోడుగ నిలిచే అనుబంధం ప్రేమ-బాంధవ్యం ప్రేమ

2.నేస్తాల నడుమన వెలిసే స్నేహమే ప్రేమ
అభిరుచుల ఎడల చూపే అభిమానం ప్రేమ
సోదరీసోదరులపైన కలిగియున్న మమతయే ప్రేమ
జీవరాశిపై మనిషికి ఉన్న కారుణ్యమే ప్రేమ-మానవత్వమే ప్రేమ

3.కనులుకనులతో కలుపుతు చేసే సైగల్లో ప్రేమ
నుదుటిపై పెదవులు రాసే కైతల్లొ ప్రేమ
చేతిలో చేయితొనొక్కే కరస్పర్శయే ప్రేమ
అలయ్  బలయ్ ఆలింగనమే అంతులేని ప్రేమ-ఆత్మగతమే ప్రేమ