Monday, July 26, 2021

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మాయింటి వాకిటిలో తులసిమొక్క నీవు

మా కంటికి వెలుగునిచ్చు కాంతిలెక్క నీవు

సంసార సంద్రాన దారిచూపు వేగుచుక్కవు

నిత్యం దాంపత్యం పండించే ఆకువక్కవు

నాకోసమే దిగివచ్చిన నాపాలిటి దేవత

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో నా జీవన గీత


1.శిశిరానికి తావే లేదు వసంతమై నీవుండగా

దవనానిది తావే కాదు నీవే మల్లెపూదండగా

నీ నవ్వుల హాయిముందు వెన్నెలైనా దండగే

సందడిగా నువు తిరుగాడ ప్రతిరోజు పండగే

నాకోసమే దిగివచ్చిన నాపాలిటి దేవత

నీపుట్టినరోజున  శుభాకాంక్షలివిగో నా జీవన గీత


2.అసూయనే అవనికి నీవంటే నీకెంతటి ఓపిక

అరుంధతికి అబ్బురమేనంట  నీకంతటి ఒద్దిక

సావిత్రికి సైతం  సంబరమే  నీ తెగువ చూసాక

శ్రీ  లక్ష్మి స్థిరపడిందింట  నువుకాలుమోపాక

నాకోసమే దిగివచ్చిన నాపాలిటి దేవత

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో నా జీవన గీత


చంద్రకాంతి అందం చకోరిలా గ్రోలనా

మేఘమాల సౌందర్యం చిరుగాలినై స్పృశించనా

ఇంద్ర ధనుసు సొగసు గని కేరింతలేయనా

జలపాత  సోయగాన్ని చకితుడనై తిలకించనా

ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు

పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు


1.తరువుకున్న త్యాగగుణం ప్రశంసార్హమే

నదికి కలిగిన దాతృత్వం  అభినందనీయమే

పొడిచే తొలిపొద్దు అరుణిమ అభినుతించదగినదే

మలిసంజె వెలుగుల రంగులుపొంగే నింగిఎంచదగ్గదే

ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు

పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు


2.శిఖరాలు లోయలు పచ్చని పచ్చికబయళ్ళు

హిమానీనదాలు నురగలెత్తు సాగర కెరటాలు

మారే ఋతువుల విరిసే పలువన్నెల సుమశోభలు

రోదసిలో అబ్బురపరచే అనంత కోటి తారకలు

ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు

పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు