Friday, June 19, 2020

నీటికరువు అనుభవమే ఇలలోనా
కన్నీటికి కరువన్నది  కనలేదు కలలోనా
హృదయ కుహరమందు ఊట ఆగిపోదు
ప్రమేయమే లేకున్నా బ్రతుకున వెత ఒడవదు

1.రుధిరమేమొగాని అశ్రుధారె నరనరాన
ఆనందమె మరీచిక మనిషి జీవితాన
మనుగడకై పోరాటం బ్రతికినంతకాలం
శ్రమకు తగ్గ ఫలితం శూన్యమే ఆసాంతం

2.దుఃఖాలు పలువిధాలు కారణాలనేకం
నవ్వుల ముసుగేసుకుంది ఈ విషాద లోకం
మునకలేయడంలోనే సంతోషం చవిచూడు
చరమగీతినైనా మోహనంగ పాడు

గరళము మ్రింగితే ఘనతేమున్నది
కఫము నిండ గొంతు యాతనెరుగుదువామరి
పంచభూతనాథుడవైతె మాకేమున్నది
వాతపైత్యాలతో సతమతమై పోబడితిమి
కాశీవిశ్వేశ్వరా కాళహస్తీశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వర నమో రామలింగేశ్వరా

1.చావు భయం బ్రతుకు భయం మాకేల శంకరా
మృత్యుంజయ పాహిపాహి అభయంకరా
నిరతము నీనామజపము నీపైనే ధ్యానము
కనికరముతొ చేర్చుకోర నీ సన్నిధానము
కాశీవిశ్వేశ్వరా కాళహస్తీశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వర నమో రామలింగేశ్వరా

2.అనివార్యమె మరణము అన్నది సత్యము
అనాయాస మరణమీయి అదే నీ ప్రసాదము
చిత్రవధతొ చిరకాలము మాకొద్దీ జీవితము
మూడునాళ్ళ బ్రతుకైనా కడకీయి కైవల్యము
కాశీవిశ్వేశ్వరా కాళహస్తీశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వర నమో రామలింగేశ్వరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మానవతి

సప్తగిరులపై వెలిగే వేంకటరమణ
సప్త ఋషులు కీర్తించెడి శ్రీ చరణ
సప్తద్వారాల వైకుంఠమె నీ విలాసము
సప్తజన్మల దోషాలు హరించు నీ స్మరణము
స్వామీ నీకిదే మనసావాచా కర్మణా ప్రణామము

1.పద్మనాభ పురుషోత్తమ ఫణీంద్ర శయన
మాధవా రమాధవా మధుసూధనా
కేశవా సంకర్షణ హృషీకేశ వామనా
సహస్రనామాంకిత శ్రీనివాస పావనా
స్వామీ నీకిదే మనసావాచా కర్మణా ప్రణామము

2.జగన్నాథ జనార్ధనా జగదీశ వాసుదేవా
గోవిందా ముకుందా పుండరీక విఠలా
ఉపేంద్రా అచ్యుతా హరి నారసింహా
సహస్రనామాంకిత నారాయణ శ్రీధరా
స్వామీ నీకిదే మనసావాచా కర్మణా ప్రణామము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా అంతట నేనే- పలకరించాలా
నా మటుకు నేనే- పులకరించాలా
ఊసులెన్నొ చెప్పాలా- బాసలెన్నొ చేయాలా
ఎంతకాలమే చెలియా -One way traffic 
ఎందుకోసమే ప్రియా -నా దిల్ మే ధక్ ధక్

1.వెంటబడినా కొద్దీ -ఏం మిడిసిపడ్తున్నావే
అతిగా పట్టించుకొంటే -మితిమీరి పోతున్నావే
అందగత్తెవే నువ్వు - కాదని అనలేను
మంత్రగత్తెవే నీవు- నీ మాయలొపడినాను
దిక్కువేరె లేనేలేదు- నీవు మినహా
లక్కుగా మారిపోవే- లవ్ తో సహా

2.జగదేక సుందరికి- గర్వం సహజమే
అభిమాన ప్రేయసి టెక్కు- అంగీకారమే
నేనెలా మసలాలో -సెలవీయవే సఖీ
ఏరీతి మెప్పించాలో- చెప్పవే చంద్రముఖీ
వేరుదారి లేదు -దాసోహమనకుండా
ఎదిరించలేనే నీకు -నే లొంగిపోకుండా

OK
రచన,స్వకల్పన&గానం:డా.రాఖీ

నయానాలు తెలిపేను నవరసాల భావనలు
నేత్రాలు పలికేను కొంగ్రొత్త భాషలు
చక్షువులు లిఖించేను మది చదివే ప్రేమలేఖలు
కనుదోయి వెలయించేను కమనీయకావ్యాలు
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
అభినయ నృత్తానికి దృక్కులే ఉత్కృష్టం

1.అంబకాన సంభవించు అశ్రువర్షపాతం
అక్షులే కురిపించు శరశ్చచంద్రాతపం
ఈక్షణమే కలిగించు తీక్షణ శరాఘాతం
లోచనమే ప్రకటించును యోచనసారం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
 అభినివేశ సాధనమున అవలోకనముచితం

2.హృదయానికి లోకానికి పీతువు సేతువు
జ్ఞానదృష్టి కలుగుటలో అంతర్నేత్రమె హేతువు
కళ్ళలో విరిసేను చెలిని కాంచ హరివిల్లు
ఆహ్లాదవేళ విశ్వంకరాల దరహాస పరవళ్ళు
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
అనుభూతి ఆస్వాదనకై నేత్రం అర్ధనిమీలితం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువ్వంటె నాకెంతొ లవ్వంట
నువు సయ్యంటే నరాల్లొ జివ్వంట
విప్పిచెప్పినా ఇనుకోవె నీతో తంట
పెట్టేవు గుండెల్లొ హాయిగొల్పు మంట
రావె నారంగీ సింగారి మంగీ ఓ నవ్వుల సారంగీ
మోహనాంగీ కొంటెకోణంగీ ఒహో సంపంగి

1.నిద్దురలేస్తాయి సుద్దులే అవలిస్తు పొద్దుగుంకగానే
వద్దువద్దంటూనే పద్దులే రాస్తాయి ముద్దుముద్దుగానే
ముద్దమింగకున్నామానె  కడుపునిండేను ముద్దులతోనే
పట్టుపరుపులేకున్నగాని అలుపుతీరు నీ ఒడిలోనె
రావె నారంగీ సింగారి మంగీ ఓ నవ్వుల సారంగీ
మోహనాంగీ కొంటెకోణంగీ ఒహో సంపంగి

2.దుప్పట్లొ దూరితే చాలు మొదలౌను ముద్దుమురిపాలు
కౌగిట్లొ ఒదిగితే చాలు దొరికేను అన్నీ నాక సుకాలు
హద్దుపద్దులేకుండ గుద్దులాడజూస్తావె ముద్దరాల
ఎక్కితొక్కి ఎక్కిరించి మాయజేసి నెగ్గేవు సిగ్గురాల
రావె నారంగీ సింగారి మంగీ ఓ నవ్వుల సారంగీ
మోహనాంగీ కొంటెకోణంగీ ఒహో సంపంగి

OK