Thursday, April 30, 2020

రచన,స్వరకల్పన&గానం.డా.రాఖీ

రాగం:వలజి

విశ్వేశ్వరమ్ విశ్వాకారమ్
ప్రదోష కాల తాండవ ప్రియం నటేశ్వరమ్
వందే శంభుం భుజగేంద్ర భూషణం
వందే వైద్యనాథం సర్వ క్లేశ భీషణమ్

1.త్రినేత్రమ్ ప్రభుమ్ గుణత్రయాతీతమ్
త్రిభువనైక పూజితం కాలత్రయాన్వితమ్
త్రిశూలాయుధ ధరమ్ త్రిపురాసుర సంహారమ్
త్రియంబకేశ్వరమ్ భవం భక్తవశంకరమ్
వందే త్రివిక్రమ మిత్రమ్ పరమేశ్వరమ్
వందే అకారోకారమకార రూపమ్ ఓంకారేశ్వరం

2.పంచాననం పంచాయుధ ధరం
పంచాయతనాన్వితమ్ శివమ్
పంచభూతేశ్వరమ్ పంచప్రాణనాథమ్
పంచామృతాభిషేక సంతసమ్ ఈశ్వరమ్
వందే పంచబాణ ధర హరమ్
వందే పంచాక్షరీ మంత్ర వశంకరమ్ శుభకరమ్॥
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:చారుకేశి

కష్టాల్లో సాయపడే నేస్తము నీవే
ఇష్టాలను తీర్చే కల్పవృక్షము నీవే
వ్యాధుల పరిమార్చే వైద్యుడవీవే
భవజలధిని దాటించే నావికుడవే
సాయీ నిన్నే శరణంటినయ్యా
సాయీ నన్నే కరుణించవయ్యా

1.ఆకలినెరిగిన అమ్మవు నీవే
ఆశల నెరిగిన నాన్నవు నీవే
మార్గము చూపెడి గురడవు నీవే
మోక్షము నొసగెడి దైవము నీవే
సాయీ నిన్నే శరణంటినయ్యా
సాయీ నన్నే కరుణించవయ్యా

2.ఏకాగ్రత చేకూర్చే లక్ష్యము నీవే
చెక్కు చెదరనీ గుండె ధైర్యము నీవే
అచంచలమైన విశ్వాసము నీవే
అనంతానంతమైన విశ్వము నీవే
సాయీ నిన్నే శరణంటినయ్యా
సాయీ నన్నే కరుణించవయ్యా

Wednesday, April 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

(సినిమా కోసం వాడుకోవచ్చు-రచయిత అనుమతితో)

కాటుక మురిసిపోతున్నది
నీ కళ్ళతో జతపడి సార్థకమైనందుకు
తిలకం గర్వమొందుతున్నది
నీ నుదుటన మెరిసిపోతున్నందుకు

ముంగురుల భ్రమరాలే భ్రమిసిపోతున్నాయి
నీ వదన కమలాన్ని ముద్దాడినందుకు
చిరునవ్వుల మల్లియలే ముదమొందుతున్నాయి
నీ పెదవుల నలరించినందుకు

నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
అనుబంధం పెనవేసినందుకూ

1.పరవశించి పోతున్నది గానము
నువు గాత్ర మాధురిని అద్దుతున్నందుకూ
పలవరించుతున్నది ప్రౌఢ పికము
నీ పాటే మాదిరిగా దిద్దుతున్నందుకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నీ గీత మకరందం గ్రోలుతున్నందుకూ

2.తృప్తిపడుతున్నది భారతీయము
కట్టుబొట్టులో ప్రతీకవే నీవైనందుకూ
చాటిచెప్పుతున్నది మనదైన తెలుగుదనము
సాంప్రదాయ బద్ధమైన నీ నడతకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నూరేళ్ళూ ముడివడి ఉన్నందుకూ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంటే అంటావుగాని
ఆ కొంటె చూపులెందుకంటా
తిడితే తిట్టావుగానీ
ఆ చిలిపి నవ్వులెవరికంటా
ఆకంటా ఈకంటా నువు పడకుంట
నిన్ను దాపెట్టగ నా కెంతటిదో ఈ తంటా

1. కళ్ళేమో బెల్లాలు నోరూరే తాయిలాలు
ఎదకవి గొళ్ళాలు ఎర వేసిన గాలాలు
పోరే పెడుతున్నాయి మిగిలిన నీఅందాలు
కురులు కెంపుల చెంపలు ఊరించే పెదాలు
రెప్పవాల్చలేని తిప్పలు నాకెన్నో
చెప్పనలవి కాని గొప్పలు నీకెన్నో

2.కచ్చ తీర్చుకోనేల రెచ్చగొడుతు నన్ను
అలసిపోతుందే చూస్తూనె ఉంటె నా కన్ను
ఋజువన్నది లేకుండా చంపగలవె నువ్వు
కత్తికన్న పదునే పరువాలు చిలుకు నీ తనువు
ఛస్తే మాత్రమేమి నిన్నే పొందగా
బ్రతికొస్తా పదేపదే అందాలనందగా

Tuesday, April 28, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:బీంపలాస్

సాకారా నిరాకారా సైకతలింగేశ్వరా
అవ్యక్తా అభివ్యక్తా ఆత్మలింగేశ్వరా
శ్రీ రాఘవ హస్త ప్రతిష్ఠితా
ధర్మపురీ శ్రీరామలింగేశ్వరా
పాలయమాం పంచభూత లింగేశ్వరా
ప్రణమామ్యహం ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరా

1.పృథ్వీరూపలింగా కంచి ఏకామ్రేశ్వరా
జలరూపలింగా జంబుకేశ్వరా
తేజోరూపలింగా అరుణాచలేశ్వరా
వాయురూపలింగా శ్రీకాళహస్తీశ్వరా
ఆకాశరూపలింగ చిదంబరేశ్వరా
నమోస్తుతే వేములవాడ రాజేశ్వరా
రాజరాజేశ్వరా

2. శ్రీశైల మల్లికార్జునా సోమనాథేశ్వరా
ఉజ్జయినీ మహాకాలా ఓంకారేశ్వరా
భీమశంకరా పర్లీ వైద్యనాథేశ్వరా
రామేశ్వరా దారుకావన నాగేశ్వరా
త్రయంకేశ్వరా కాశీ విశ్వేశ్వరా
కేదారేశ్వరా ఎల్లోరా ఘృష్ణేశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిన్ను నీవు తెలుసుకొనుటె ఆత్మజ్ఞానము
మనిషి దైవమన్నదే పరమ సత్యము
జగద్గురువు ఆదిశంకర ప్రబోధము
తత్వమసి తత్వమే అద్వైతము
శంకర జయంతి నేడు సద్గురునికి వందనాలు
కంచి పరమాచార్యులకు సాష్టాంగ వందనాలు

1.కాలడిలో ఆర్యాంబ గర్భాన ఉదయించి
ఎనిదేళ్ళ ప్రాయంలో సన్యసించి
గోవింద భగవద్పాదుల గురువుగా పొంది
బ్రహ్మ సూత్రాలకు సరళ భాష్యాలు రచియించి
విఖ్యాతి నొందాడు శంకరుడు అద్వైత సిద్ధాతం ప్రవచించి

2.శృంగేరి పూరీ ద్వారకా జ్యోతిర్మఠాలు
నాల్గు చెరగులా స్థాపించాడు అద్వైత పీఠాలు
కనకధారా స్తవమును ఎనలేని దేవతా స్తోత్రాలను
జగతికి అందగా చేసాడు ఆదిశంకరాచార్యులు
అహం బ్రహ్మాస్మి తత్వాన్ని అవగత పరిచాడు

Saturday, April 25, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

(ప్రతి పంక్తిలో క్ష కార పదగీతి)

అక్షయ నిధులను అందించవె
ఆది/ధన/గజ/వర/ధైర్యలక్ష్మీ మాయమ్మా
అక్షయ తృతీయ నేడూ
లక్షణముగ నిన్నర్చించెద మోయమ్మా

1.బిక్షకులే లేనటుల ఈ ఇలలో
క్షుద్బాదలు తీర్చవె మాయమ్మా
నిక్షేపములౌ ధాన్య రాశుల మాకు
దయసేయవె ధాన్యలక్ష్మీ శరణమ్మా

2.నిరక్షరాస్యులను మాటే
ఈ క్షితిలో వినిపించనీకమ్మా
అక్షరమౌ విద్యాసంపద నొసగవె
విద్యాలక్ష్మీ వినతులు గొనవమ్మా

3.రక్షించవె ఆయురారోగ్యములిచ్చి
పరీక్షించక మమ్మిక ఓయమ్మా
వీక్షించవే కన్నుల వెన్నెల ఒలుక
సంతాన లక్ష్మీ మాయమ్మా

Friday, April 24, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

విజయాలను నెమరువేసుకొంటూ
గుణపాఠాలనే నేర్చుకుంటూ
అధిరోహించాలి ఉన్నత శిఖరాలనూ
అధిగమించి తీరాలి అవరోధాలనూ
జన్మదినం కావాలి స్ఫూర్తికారకం
జన్మదినం  ఎల్లరకూ ఆనందదాయకం
శుభాశీస్సులందుకో సుందరా
శుభాకాంక్షలివిగో హరీష్ భరద్వాజా

1.పిరికితనం నినుచూసి జడుసుకోవాలి
తడబాటే  స్థైర్యానికి తలవంచాలి
ఓరిమి నీవెంటే నీడగ సాగాలి
ఓటమి నీ దీక్షముందు ఓడిపోవాలి
జన్మదినం కావాలి స్ఫూర్తికారకం
జన్మదినం  ఎల్లరకూ ఆనందదాయకం
శుభాశీస్సులందుకో సుందరా
శుభాకాంక్షలివిగో హరీష్ భరద్వాజా

2.ఆరోగ్యం నిన్నెపుడు అంటిపెట్టుకోవాలి
ఆహ్లాదం హృదయంలో ఆవాసముండాలి
గణపతీ మారుతీ నిన్ను దీవించాలి
అమ్మానాన్న అన్నల ఆశీస్సులు పండాలి
జన్మదినం కావాలి స్ఫూర్తికారకం
జన్మదినం  ఎల్లరకూ ఆనందదాయకం
శుభాశీస్సులందుకో సుందరా
శుభాకాంక్షలివిగో హరీష్ భరద్వాజా


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కానడ

గడ్డకట్టి పోయాయి కన్నీళ్ళూ
బండబారి పోయింది నాగుండె
ఎటుచూసినా శోకసంద్రమే లోకంలో
జనమంతా అయోమయపు  వింత మైకంలో

1.గడిచెటోడికైనా ఇది గడ్డుకాలమే
పూటగడవనోడికి ఇక దినదిన గండమే
గతిలేక గతపు స్మృతులు నెమరేసుకోవడమే
ఉగ్గబట్టి విపత్కాలమీదుకుంటు సాగడమే

2.తీరిపోతె కష్టమెంత చిన్నదో కదా
మునకలేస్తున్నపుడిక బ్రతుకు విలువ తెలియదా
మించనీకు తరుణమింక మంచిగ మెలగగా
ప్రేమ దివ్వె వెలిగించు చీకటే తొలగగా
ఎన్నిజన్మముల పాపములైనా
ఎంచక తొలగించు వాడు
తెలిసీ తెలియక చేసిన దోషములు
మన్ననచేసి మాన్పెడి వాడు
ఎల్లలోకముల నడిపెడివాడు
చల్లని చూపుల వేంకటేశ్వరుడు
మహిమలు గుప్పించు మదనజనకుడు
సిరులను కురిపించు శ్రీనివాసుడు
గోవింద గోవింద హరినారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

1.అడిగేపనిలేదు అంతర్యామిని
కోరేదియు లేదు కొండలరాయుని
వేడాలని లేదు వేంకటా చలపతిని
మనసెరిగిన మా మంగాపతిని
మహిమలు గుప్పించు మదనజనకుడు
సిరులను కురిపించు శ్రీనివాసుడు
గోవింద గోవింద హరినారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

2.వ్యాధులకౌషధము వ్యాసవినుతుడే
నలతల లేపనము నారద నాంత్రుడే
రుగ్మతకు వైద్యుడు హరినారాయణుడె
రోగాలకెల్లనూ  ధన్వంతరి తానె
మహిమలు గుప్పించు మదనజనకుడు
సిరులను కురిపించు శ్రీనివాసుడు
గోవింద గోవింద హరినారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

Tuesday, April 21, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఖర్చేముంది సాటివారిని కాస్త ప్రేమిస్తే
కష్టమేపాటి తోటివారిని ప్రేమగా ఆదరిస్తే
మనిషిగా జీవించు మనుషులను అభిమానించు
మానవత్వాన్ని ఇంచుకైనా పెంచి పోషించు

1.కొంపలేం మునిగిపోవు కొంతైనా పంచివేస్తే
ఆస్తులేం కరిగిపోవు అన్నార్తులకు వితరణ చేస్తే
ఆకలే కద జీవజాతికి మహిలోన మహమ్మారి
వృత్తి ఉద్యోగాలన్నీ చేయుట భుక్తికే చచ్చీచెడీ

2.రోజువారీ కూలైనా రాజ్యమేలే రాజైనా
అతీతులెవ్వరులేరు  క్షుద్భాద ముందు
ఉపాధే లేనివేళలో ఏ భృతీ నోచనివారికి
ఉడతా భక్తిగా కీర్తి కోరైనా సరే విరాళాన్ని అందజేయి

Monday, April 20, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:తోడి

చూపులతో తొలి వందనం ఉగ్రనార సింహం
కరములతో మలి వందనం యోగ నారసింహం
సాష్టాంగ వందనమిదె లక్ష్మీనార సింహం
యాదగిరి లక్ష్మీ నారసింహం
మనసారా గొనుమిదె మా వందనం
ధర్మపురీ నారసింహం మా ధర్మపురీ నారసింహం

1.జనుల తపన నెరవేర్చెడి జ్వాలా నారసింహం
మునుల తపము మెచ్చెడి వరాహ నారసింహం
కనుల గాంచ వరములిచ్చు శాంతనారసింహం
ఇహపర సుఖములొసగు ధర్మపురీ నారసింహం
మా ధర్మపురీ నారసింహం

2.నారద ప్రహ్లాద వరద పవన నారసింహం
హిరణ్య కశిపు సంహరా మాలోల నారసింహం
సర్వరోగహర గండభేరుండ నారసింహం
శేషప్ప కవి సన్నుత ధర్మపురీ నారసింహం
మా ధర్మపురీ నారసింహం

Sunday, April 19, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తపములే చేయాలా నిన్ను రప్పించ
జపములే చేయాలా నిన్ను మెప్పించ
సాధ్యమే కాదు నాకు యాంత్రికుణ్ణి నేను
వాస్తవాలు నిగ్గదీయకు కాస్తనాస్తికుణ్ణి నేను
ఉనికి తెలుపుకోవయ్యా ఉమాశంకరా
పనికిరావేల ఉంటే ఫాలనేత్రుడా

1.అర్చనలూ అభిషేకాలు లంచాలా నీకు
హారతులు నైవేద్యాలు నజరానాలెందుకు
నువ్వు ప్రసన్నం కావాలంటే ప్రదోష దీక్ష చేయాలా
నువ్వు వరములీయాలంటే ముడుపులిచ్చుకోవాలా
బదులు పలుకవేమయ్యా బాలేందు శేఖరా
ఆదుకొనుగ రావయ్యా  అర్ధనారీశ్వరా

2.నీ గుళ్ళూ గోపురాలు నిశ్చయంగ దర్శించాలా
తీర్థాలూ యాత్రలన్ని మేము తిరిగి తీరాలా
కన్నతండ్రి పెట్టగలడా కరుణాకరా ఇలా ఆంక్షలు
ఆత్మలోన కనుగొంటే అవ్యక్తుడా ఏలా పరీక్షలు
చిత్రవధలు మాకేనా చిదానందుడా
ఘోరయాతనకు తుది లేదా నీలకంధరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చిన్ని చిన్ని చర్యలతో -ప్రయోజనాలెన్నెన్నో
చిరుచిరుచిరు చేష్టలతో -మనసూరటలెన్నెన్నో
గమనించు నేస్తమా - సూక్ష్మంలో మోక్షాన్ని
పాటించు మిత్రమా-బాంధవ్య సూత్రాన్ని

1.దయచేసి వాడాలి తరచుగా దయచేసి అన్న పదాన్ని
సరే అని అనగలిగావా-త్రుంచగలవు వాదాన్నీ వివాదాన్నీ
విచారాన్ని వ్యక్త పరిస్తే-అణచగలవు ఎదుటివారి ఆగ్రహాన్నీ
కృతజ్ఞతలు తెలిపావంటే-పంచగలవు పరస్పరం ఆనందాన్నీ

2.పలకరించినా చాలు-తీర్చేవు కన్నవారి కాస్త ఋణాన్ని
తాజాగా ఉంచగలిగితే-నిలిపేవు నిండైన స్నేహితాన్ని
కర్తవ్యం మీరకుంటే -గెలిచేవు యజమాని విశ్వాసాన్ని
మక్కువను వ్యాఖ్యానిస్తే-ఇచ్చేవు కవులకు ప్రోత్సాహాన్నీ
చప్పట్ల దుప్పట్లతో సత్కరించగలవు కళాకారులందర్నీ

Saturday, April 18, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సింధుభైరవి

నందబాలం యదునందబాలం
గోకుల గోపాలం ఆనందమూలం
వందే పరమానందమూలం

వసుదేవ సుతం యశోదా మోదితం
నవనీత హరం గోవర్ధన గిరిధరం
నమామి శిఖిపింఛ శోభితం

యమునా తీర విహారం బృందావన సంచారం
గోపికా ప్రియకరం రాధికా మనోహరం
పాలయమాం మురళీగాన విలోలం

ద్రౌపదీ మాన సంరక్షణం చక్రధరం
పాండవ హితకరం కిరీటి రథచోదకం
భజే గీతా జ్ఞాన సుబోధకం

Friday, April 17, 2020

రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ

రాగం:శివరంజని

స్ఫురించినంతనే రామా నీ రూపం
దివ్య సుందర విగ్రహం
స్మరించినంతనే రామా నీ నామం
మకరంద మాధురీ సమం
అమృత తుల్యం నీ అద్భుత చరితం
అనన్య సామాన్యం ఆదర్శ భరితం

1.తరించింది తాటకి నీ బాణం తాకి
అవతరించింది నాతి నీ పాదం సోకి
వరించింది జానకి విలువిరిచిన నీ శౌర్యానికి
కలవరించింది సాకేతపురి నీ పట్టాభిషేకానికి

2.విలువ హెచ్చింది నీ వల్ల రాజసానికి
జనం మెచ్చింది నువుపాటించ తండ్రిమాటకి
కళవచ్చింది పదునాలుగేళ్ళు దట్టమైన వనికి
కీర్తి తెచ్చింది నీ ధర్మనిరతి భారతావనికి

3.భక్తి కుదిరింది నదిదాటగ బోయవాడికి
బ్రతుకు ఆరింది నిన్నేమార్చ మాయలేడికి
మైత్రి కలిసింది నీకూ కిష్కింద వానరుడికి
ముక్తిదొరికింది రావణుడికి నీ తూపువాడికి

Thursday, April 16, 2020

బ్రతుకు నీ చేతిలో శివశంకరా
భవిత నీ చేతలో పరమేశ్వరా
ఆరిపోయే దీపాన్నీ అఖండంగ వెలిగిస్తావు
ఆకస్మికమైన క్షణంలో అంతరింపజేస్తావు
ఏమిటో నీ క్రీడ మంజునాథేశ్వరా
ఎందుకో సయ్యాట రాజరాజేశ్వరా

1.మార్కండేయులెంతమంది చిరంజీవులైనారు
శిరియాళులెంతమంది కృపాపాత్రులైనారు
బ్రహ్మరాతరాస్తాడేల -శివుడు చెరిపివేస్తాడేలా
అపవాదునీకేల కాలకాలుడా
అపకీర్తి నీకేల విశ్వనాథుడా

2.వైద్యనాథుడవే నీవు రోగాలు బాపలేవా
మృత్యుంజయుడవే అపమృత్యునాపలేవా
ఇదే నీ అభీష్టమా-ఇదే సుస్పష్టమా
కరుణించి కాపాడు చంద్రశేఖరా
శరణంటు వేడేము శంభోహరా

Monday, April 13, 2020

కలం రాయని రాతలెన్నో కన్నీళ్ళు రాస్తాయి
ఎవరు చూడని లోతులెన్నో ఎదలొ ఉంటాయి

జలతారు ముసుగులు మోమునంతా కప్పివేస్తాయి
చిరునవ్వు నివురును ఊదివేస్తే నిప్ప్క లుంటాయి

ఎండమావులు ఎదురువస్తూ అశనిస్తాయీ
తీరలేని తపనింకా పెంచివేస్తాయీ

 తొలగిపోనీ మబ్బులెన్నో శశినిమూస్తాయి
బ్రతుకు సాంతం గ్రహణమల్లే తలపునిస్తాయి

పంచప్రాణాల దేహము అలసిపోతుంది రాఖీ
పంచభూతములప్పుడే కబళించి వేస్తాయి

Saturday, April 11, 2020

ఉన్నదే ఇపుడున్నదే జీవితం
చేజారినదంతా గతం
కాలప్రవాహంలో కరిగెను స్వప్నం
ఎపుడే మలుపు తిరుగునో
జీవిత నాటకం

1.బండ్లు ఓడలైతే ఎంతటి అదృష్టం
ఓడలు బండ్లవడమే ఓ నగ్నసత్యం
జీర్ణించుకోగలేని పరిణామాలు
ఊహించగాలేని ఉత్పాతాలు
నిన్నటి నందనవనమే నేటి స్మశానం
కట్టెలమ్ముకొట్టాయే పూలదుకాణం

2.యథాతథంగా సాగాలి బ్రతుకు రథం
ఎత్తు పల్లాలెన్నున్నా ఉన్నది ఒకటే పథం
శీలలే ఊడినా ఆగదు ఈ పయనం
చక్రమే తొలగినా చేరకతప్పదు గమ్యం
ఆశించినప్పుడే మనషికి ఆశాభంగం
ఎదురీదక స్వీకరిస్తే ఎనలేని ఆనందం


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కత్తిమీద సామురా కలికితో స్నేహము
పులిమీద స్వారిరా పడతితో చెలిమి
ఎప్పడెలా పరిణమిస్తుందో
ఏ మలుపు తిరుగుతుందొ
అత్తిపత్తిలాగా ఎంచరా సోదరా
ఉత్తి తోలుతిత్తిగ భావించరా

1.అందమనే వెలుగు శిఖన-శలభమల్లె మాడిపోకు
తామర రేకుల మధ్యన-భ్రమరమోలె చిక్కుబడకు
మోహమనే పాశానికి నువు కట్టుబడకు
వలపుల మాయల వలలోన పట్టుబడకు

2.పట్టించుకోకున్నా ఆకట్టు కొంటారు
తపసుచేసుకుంటున్నా భంగపరుస్తుంటారు
చొరవగ ఉన్నారనీ సొల్లుకార్చుకోకురా
చనువునిచ్చారనీ చంకనెక్కబోకురా

Friday, April 10, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఎక్కడ కొలువుంచనూ ముక్కంటి దేవరా
ఏ తావున నిలుపనూ ఓ తిక్క శంకరా
తిరుగ మరిగినోడివి
ఒక పట్టే పట్టనోడివి
నిన్నెలా పట్టేయనూ ఎదకెలా కట్టేయనూ

1.గుండె నుండమనలేను
పాడుబడినదెప్పుడో
మనసున బస చేయమనను
మసిబారిందెన్నడో
నీళ్ళంటే నీకిష్టము గంగాధరా
నా కళ్ళలొ పుష్కలము మునిగితేలరా

2.ఇంటికింక పిలువలేను
ఇక్కట్లే ఆక్రమించుకొన్నాయి
ఒంటిలోన స్థలమీయ లేను
రోగాలే పీడించుతున్నాయి
అక్షరమే నీతత్వము సదాశివా
అక్షరముల బంధింతును నిను సదా శివా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నారు పోసిన నీవు-నీరు పోయగ లేవా
ఈత నెరుగని మమ్ము-ఏరు కడపగ లేవా
ఏడు కొండల సామి-బదులు పలుకవేమి
మము గన్న మాతండ్రి-దారి చూపవదేమి

1.ఎలుగెత్తి అరిచింది ఏనుగు ఆనాడు
ఆదర బాదరగా - ఆదుకొంటివిగాదా
దీనంగా వేడింది ద్రౌపది శరణంటూ
చీరలనందించి మానము కావగలేదా

2.నీకున్న పని ఏమి లోకాలేలే సామీ
మంచిని పెంచడము -చెడ్డను తుంచడమే
పడక వేసినావొ పడగ నీడలోన
కునుకే తీసినావో లిప్తపాటులోన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువ్వొక్కడివే దిక్కు
నీపైనే నమ్మిక మాకు
జగమేలే పరమాత్మా
నువ్వొక్కడివే రక్ష మాకు

1.నరజాతి నశించడాన్ని
కాచే ప్రభుడవు నీవే
ఘోరక(లి)రోనా ఆగడాన్ని
ఆపే యోధుడవల్లా నీవే

2.ముక్తకంఠంతో మేము
నిన్నర్థిస్తూనే ఉన్నాము
గుణపాఠం నేర్చుకున్నాము
పద్ధతులను పాటిస్తాము
రచన,స్వలకల్పన&గానం:డా.రాఖీ
రాగం:దేవగాంధారి

జననం మరణం సహజాతి సహజం
జన్మకారణం కానేల (అను)నిత్య రణం
జగమే మాయని ఎరిగినగాని
జనులేల జగడాల కడతేరనేల
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీశరణాగతి

1.సతతము మరువక  నెరనమ్మితి భారతీ
మనమున మననము దినమానము జేసితి
మనసేల వచ్చెనే ఇల నన్నొదలగ అనాధగ
అక్కునజేర్చవే చక్కని మాయమ్మ ననువేగ
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీ శరణాగతి

2.తుఛ్ఛమైన ఇఛ్ఛల తీర్చి మోసపుచ్చకే జగన్మామాత
నిత్యానందము నీ పదసన్నిధి దయసేయవె దాక్షాయణీ
ఆప్తుడగానా నీ కృపా ప్రాప్తికి లిప్తపాటైన వృధాపరచక
పరసౌఖ్యదాయిని నిజ శ్రేయకారిణి శృంగేరీ శారదాంబికా
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీ శరణాగతి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎడారిలో తడారిన గొంతును నేను
తుది మెదలు తెగిపోయిన వంతెన నేను
ఊహల స్వర్గానికి నిచ్చెనపై నేను
ఉద్ధరించువారికై ఎదిరిచూస్తున్నాను

1.భగీరథుడనయ్యాను గాత్రగంగ కోసం
గాధేయుడనయ్యాను బ్రహ్మత్వం కోసం
నత్తగుల్ల నయ్యాను స్వాతిచినుకు కోసం
బీడునేల నయ్యాను వానధార కోసం

2. చకోరినయ్యాను కార్తీక వెన్నెల కోసం
చాతకపక్షినైతి మృగశిర కార్తి కోసం
మయూరమైనాను ముసిరే మబ్బుకోసం
శిశిరమై మిగిలాను రాని ఆమని కోసం

Thursday, April 9, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా కవి తలలో తరగని స్నేహముంది
నా కవితలలో సాహితీ దాహముంది
నే పాడే గీతాల దాగిన అనురాగముంది
నే వేడే భారతీమాత వర యోగముంది

1.ఎనలేని సారస్వత మక్కువ ఉంది
మనలేని సంగీతపు ఆత్రుత ఉంది
రసహృదయుల అగణితమౌ అభిమానముంది
ననుగన్న తలిదండ్రుల మిక్కిలి దీవెన ఉంది

2.దైవమంటె అమితమైన భక్తి ఉంది
దేశమంటె ఎదలో అనురక్తి ఉంది
సమాజమంటె ఇష్టపడే బాధ్యత ఉంది
విశ్వజనీనమైన ప్రేమ అనుభూతి ఉంది

Wednesday, April 8, 2020


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:భీంపలాస్

చిత్తములో నీవున్నా ప్రాప్తమేల ఈ గతి
భావనలో కొలువున్నా భవిత కేల దుర్గతి
నిదురలోన కలగా నీవే
నిజములోనా కనులానీవే
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో

1.పలుకుతున్న ప్రతి పలుకూ పంచాక్షరిగా ఎంచా
ఎదురైన ప్రతి శిలనూ శివలింగమని తలిచా
కురిసేటి వర్షాన్నే భగీరథిగ భావించా
జీవరాశినంతటినీ నీవుగా ప్రేమించా
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో

2.ఉఛ్వాసే నమక స్తోత్రం నిశ్వాస నాకు చమకం
ఆత్మలింగానికి సతతం  రుధిర రుద్రాభిషేకం
నవనాడుల మ్రోగుతుంది నాప్రాణ రుద్రవీణ
గుండెయే తాండవమాడ బ్రతుకే శివా నీకర్పణ
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ కళ్ళే కలువరేకులు
ఆ కళ్ళే ఎదకు బాకులు
నీ కళ్ళే కదలనీక పాదాలకు మేకులై
ఆ కళ్ళే మెదలనీక గుళ్ళున్న తుపాకులై

1.నీ కళ్ళు నేర్పాయి తారలకు తళుకులెన్నో
నీకళ్ళు కూర్చాయి మెరుపులకు జిలుగులెన్నో
నీకళ్ళే అరువిచ్చాయి నిశీధికే నీలవర్ణము
నీకళ్ళే  స్మృతి తెచ్చాయి నెలలోని కృష్ణపక్షము

2.నీకళ్ళు చూసి చూసీ కృష్ణుడాయే నందబాలుడు
నీకళ్ళు గీసిగీసీ చకితుడాయే చతురాననుడు
నీ కళ్ళే  వరమిచ్చాయి వెన్నెలకు  ఆహ్లాదాన్నీ
నీ కళ్ళే దయతలచాయి కరిమబ్బుకు నల్లదనాన్నీ
దీపం పెట్టి వెతికినా ఆస్కారమెలేదు అందచందాలకి
ఆసాంతం పరిశీలించినా సంస్కారముండదా వ్యక్తికీ
ఉంటారు కొందరు ఊకదంపుడు వాళ్ళు
భజంత్రీలు కార్చేస్తారు ఎనలేని సొల్లు
విచ్చలవిడి తనమన్నదే అర్హతగా
విశృంఖల జీవితమే ఆలంబనగా

1.తలిదండ్రుల ప్రేమకైనా నోచనివాళ్ళు
అందరూ ఉండికూడ ఔతారిల అనాథలు
చిరునవ్వుల ముసగేసుకొని గొంతులే కోస్తారు
నమ్మించినట్టే ఉండి నట్టేట ముంచేస్తారు
పైశాచికత్వమన్నదే ఒక అర్హతగా
హింసించే ఆనందం కడువేడుకగా

2.మనోవైకల్యమే వారికో వైపరీత్యం
బ్రతుకున వైఫల్యమే అసహన కారణం
ఓర్వలేరు సంతోషించే సాటివాళ్ళను
జీర్ణించుకోలేరు తమకు బోధించేవాళ్ళను
అదను చూసి వలవేయడమే అర్హతగా
మోసగించి అవమానించే నెలతగా

ఆధిపత్యం లేనపుడే అన్యోన్య దాంపత్యం
ఏ దాపరికం లేనపుడే అపురూపమౌను కాపురం
మూడు ముళ్ళే బంధించాలా ముడిపడిన మనసులుంటే
ఏడడుగులు నడిపించాలా ఏడుజన్మలు తోడుంటే
ఒకరికి ఒకరై జతకడితేనే ప్రణయం
మనసుల మధ్యన వారధియే పరిణయం

1.ఎలా ఏర్పడిపోతాయో అపరిచితమౌ బంధాలు
ఎందుకు పెనవేస్తాయో ఎరుగలేము బాంధవ్యాలు
కళ్ళుమూసి తెరిచేలోగా చిక్కుబడి పోతాము
ఎంతగా విదిలించుకున్నా తప్పుకొని రాలేము
కార్యకారణ సంబంధం ఉండితీరుతుంది
ప్రతి చర్యకు ప్రతిచర్యై ప్రేమగా మారుతుంది

2.భారతీయ వ్యవస్థలో పవిత్రమే వివాహబంధం
హైందవ తత్వంలోనే అద్భుతమీ కళ్యాణ బంధం
ఒడిదుడుకులు ఎదురైనా సర్దుబాటు చేకొంటారు
పొరపొచ్చాలెన్నున్నా దాటవేసి పోతుంటారు
సంతానం లక్ష్యంగా బ్రతుకు బండి సాగుతుంది
కుటుంబమే ఐక్యంగా గండాలు దాటుతుంది

Tuesday, April 7, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నను స్పృశియించుమన్న వస్తువే లేదాయే
నను సృజియించమన్న ఆత్మే కనరాదాయే
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

1.రాసాడు వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు
నుతించె స్తోత్రాలు జగద్గురు శంకరాచార్యులు
త్యాగయ్యా అన్నమయ్య కృతులెన్నొ కూర్చారు
క్షేత్రయ్యా జయదేవులు రక్తినొలికించారు
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

2.మేఘాల కావ్యాల బంధించె కాళిదాసు
మనుచరిత్ర వచించె అల్లసాని పెద్దన
విజయవిలామొనరించె చేమకూర కవి
కరుణారసమొలికించె తెనాలి వికటకవి
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

3.ప్రకృతినంత పదముల నుడివె కృష్ణ శాస్త్రి
అభ్యుదయము నెత్తుకునే అలనాడే శ్రీశ్రీ
మనసును మధించాడు ఆచార్య ఆత్రేయ
అక్షర కన్నెల వెన్నెలనాడించినాడె తిలక్
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వాగధీశాయ నమో వాయుపుత్రాయ
అంజనానందనాయ వానర యోధాయ
వందే వారిజప్రియ శిష్యాగ్రేసరాయ
శరణు శరణు శంకరస్వరూపాయతే నమః

1.కేసరీసూనాయ కేయూరభూషణాయ
సాకేతసార్వభౌమ రామభద్ర సేవకాయ
జానకీ ప్రమోదకాయ లంకాదహనాయ
మహాబల దేహాయ  మారుతీ రాజాయ నమః

2.సంకట హారాయా సంజీవరాయా
సౌమిత్రి ప్రాణదాయా జితేంద్రియాయా
సింధూర దేహాయ చిరంజీవాయా
కొండగట్టువాసాయ కరోనా నాశకాయ నమః

(హనుమజ్జయంతి శుభాకాంక్షలతో)

Saturday, April 4, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా మత్తుచెడగొడుతూ నీఊపిరి సుప్రభాతం
రవిగ మెరిసెనునీ భృకుటి మధ్య సింధూరం
కురులు విదిలించగా కురిసిందిలే తుషారం
అపురూపమైనీరూపం తలపించె ఇంద్రచాపం
ప్రియమైన నా శ్రీమతి నీవే దైవమిచ్చిన బహుమతి
మనసైన నా ప్రియసఖి నీవే అనురాగానికి ఆకృతి

1.తులసికోట చుట్టూ తిరిగే గృహలక్ష్మి నీవే
రుచురుచుల ఆకలితీర్చే అన్నపూర్ణా దేవివే
ఇల్లుసర్ది సగబెట్టే  ఇంటి యజమానివి నీవే
పడకటింట కులుకులు చిలికే రతీదేవి నీవే
ప్రియమైన నా శ్రీమతి నీవే దైవమిచ్చిన బహుమతి
మనసైన నా ప్రియసఖి నీవే అనురాగానికి ఆకృతి

2.అలసిన నా బడలిక బాపే  పిల్లతెమ్మెర నీవే
అలజడి చెలరేగినవేళ ఊరడించు నేస్తానివే
అలకపాన్పు ఎక్కినంతనే అల సత్యభామవే
అలవోకగనను మురిపించే నిండైన ప్రేమవే
ప్రియమైన నా శ్రీమతి నీవే దైవమిచ్చిన బహుమతి
మనసైన నా ప్రియసఖి నీవే అనురాగానికి ఆకృతి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అల్లా అల్లా అల్లా -సద్బుద్ధినివ్వు మా కెల్లా
ప్రభువా జీసస్ క్రీస్తు-కలిగించు మాకు శ్రీరస్తు
శ్రీరామచంద్ర మూర్తి-తీర్చవయ్య మా ఆర్తి
జగమేలే  పరాశక్తి-ప్రసాదించవే-కరోనానుండి  విముక్తి

1.హితము కూర్చగ ప్రతి మతము
జనతకు ఎంతో సమ్మతము
మానవతను కోరే అభిమతమూ
ఈ సృష్టికంతటకీ మహితము
సాటి మనుషులతొ సఖ్యత గలిగి
సాగించేదే ఉత్తమ జీవితం
ప్రతి మత గ్రంథం బోధించేది
మనిషి మనిషిని ప్రేమించడం

2.మూడునాళ్ళ బ్రతుకులోనా
విద్వేషాలకు తావేల
పుట్టుక చావు అందరికొకటే
మంచిగ మెలగవు నీవేల
నెత్తురులోనా భేదమెక్కడిది
మతమును తెలిపెడి సూచికగా
గంగా జమున సంగమించవా
మేధనుమార్చకు పాచికగా

Friday, April 3, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

దీపం దైవానికి ప్రతిరూపం
దీపం లోకానికి గురు తుల్యం
దీపం ప్రగతికి ప్రతిబింబం
దీపం సుగతికి ఒక గమ్యం
జ్ఞాన దీపం వెలిగించు-అనురాగ దీప్తిని పంచు
ఆత్మజ్యోతిని ప్రభవిస్తూ-సమైక్య గీతిని వినిపించు

1.పట్టపగలైనా గాని -పగలు కమ్మె చీకటులై
వెన్నెలే కురిసినగాని- విద్వేషం చిమ్మె కరిమబ్బై
విచక్షణే తేజరిల్లితే  -విభేదం మోకరిల్లదా
మానవత్వ కాంతిలోనా-  విశ్వశాంతి వెల్లివిరియదా
జ్ఞాన దీపం వెలిగించు-అనురాగ దీప్తిని పంచు
ఆత్మజ్యోతిని ప్రభవిస్తూ-సమైక్య గీతిని వినిపించు

2.లౌకికత అన్నదే- ప్రపంచాన మన  ఘనత
అనాదిగా పరమత సహనం- మన దివ్య చరిత
నరజాతికి పరమ విరోధి -కరోనా మహమ్మారి
మట్టుబెట్టి చితిపేర్చేద్దాం  -ఒక్కతాటిపైన చేరి
జ్ఞాన దీపం వెలిగించు-అనురాగ దీప్తిని పంచు
ఆత్మజ్యోతిని ప్రభవిస్తూ-సమైక్య గీతిని వినిపించు

https://youtu.be/KojzywMe_L8


https://youtu.be/hA6YW6X6YzY

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సారంగ

సరయూ నది తీర సాకేతపుర నికేత సార్వభౌమా
గోదావరి తటవాస ధర్మపురీ నిజధామ శ్రీ రామా
శరణాగత వత్సలా కోదండరామా
శరణు శరణు దశకంఠ రావణ శమనా
 తక్షణమే కరోనాను కడతేర్చి మముకావర

1.పావనమౌ నీకోవెలకరుదెంచ లేనైతి
రమణీయము నీరూపము దర్శించ నోచనైతి
కమనీయమైన నీ కళ్యాణము కాంచనైతి
శరణాగత వత్సలా కళ్యాణ రామా
శరణు శరణు జానకీ వల్లభ రామా
 కరోనాను కడతేర్చి జగత్కళ్యాణమొనరించర

2.మానవీయ విలువలకూ నిదర్శనం నీవె రామ
మైత్రీభావనకూ తార్కాణం నీవే సుమా
ధర్మ సంస్థాపనకు సుభిక్ష రాజ్యపాలనకు ఆదర్శమా
శరణాగత వత్సలా పట్టాభి రామా
శరణు శరణు జగదానందకారక రామా
 కరోనాను కడతేర్చి నరులనుధ్ధరించరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:ఉదయ రవి చంద్రిక

నన్నల్లుకుంది నవ్వుల మల్లెల పరిమళమేదో
నను గిల్లుతోంది మధురిమలొలికే పికగళమేదో
వెన్నెలే తానుగ వచ్చి శార్వరిని వెలిగించిది
ఆహ్లాద ప్రభలే ప్రసరించి నేస్తమై నిలిచింది

1.మంచితనం నిండుగ ఉండగ
మంచుకొండ గుండెగమారె
పసితనం పరువం నిండగ
సెలయేరు పలుకుల పారే
పాటగా రవళించేను శ్రుతిలయల అనుబంధం
తేనెలే సృజియించేను  విరి తేటి బాంధవ్యం

2.శిల్పమే రూపుదిద్దును
ఉలికి శిలకు పొసగినంతనే
కావ్యమే అంకురించును
భావుకతలు చెలగినంతనే
కల కళగ వెలయగజేస్తే బ్రతుకే ఒక నందనం
కలయిక కలగా కరిగితె భవిత ప్రశ్నార్థకం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ
మీరు సల్లంగా కాచే తల్లులె గదమ్మా
మిమ్ములను మొక్కంది దినామే గడువదు
మిమ్ములను కొలువంది పానామె ఊకోదు
ఊకూకే గిట్లైతే మేమెట్ల సచ్చూడో
తాపకో మామ్మారిని మీరెట్ల మెచ్చుడో
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

1.ప్లేగు మశూచీ కలరా స్ఫోటకపు వ్యాధులు
క్షయ డెంగ్యూ చికున్ గన్యా వంటి రోగాలు
ఎన్నిటినినుండి గట్టెక్కించినారో మమ్ముల
కడుపులవెట్టుక సక్కగ సాకినారో మమ్ముల
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

2.యాపమండలె బతుకు దీపాలాయే నాడు
పసుపు పూసుకుంటే మందాయే ప్రతి రుగ్మతకు
మైలబడకుండా శుచిగా ఉంటిమి  జబ్బుపడినప్పుడు
పత్యం పాటించి నిత్యం మిము తలచామప్పుడు
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

Wednesday, April 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎవ్వరమూ కాము అనాథలం
మనుషులమంతా ఆత్మబంధువులం
మన మధ్యన బంధుత్వం మానవత్వం
అనంతవిశ్వంలో మన ఉనికే నిత్వత్వం
కలసికట్టుగా చిచ్చేపెడదాం కౄర కరోనాకు
నరుని ఘనతనే చాటిచెప్పుదాం ఈ జగత్తుకు

1.దిగంత అంతరాళంలో మన భూమొక పిపీలికం
ఖగోళ పాలపుంతల్లో ఎంతటిదీ మన స్థానం
రోదసి గ్రహరాసుల్లో పరమాణు పరిమాణం
నక్షత్ర మండలాల్లొ ఒక మూలగ మన వాసం
లక్షల వత్సరాల  మనుగడకే సవాలు
చావోరేవో అనాదిగా ఎన్నని నరజాతి యుద్ధాలు

2.కంటికి కనబడని  లక్షలాది విరోధి వైరస్లు
నిత్యం వెంటాడే వేలాది బాక్టీరియ ఫంగస్లు
పంచభూత విలయాలు ప్రతిఏటా విపత్తులు
వంచన మించిన సాటిమనిషి అనూహ్యమైన వెన్నపోట్లు
లక్షల వత్సరాల  మనుగడకే సవాలు
చావోరేవో అనాదిగా ఎన్నని నరజాతి యుద్ధాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఔదార్యం ఉండదు కొందరికి ఉంటెనేం ఎంతో  ధనం
అవకాశం దొరకదు ఇంకొందరికి వితరణకై ఏక్షణం
సాటివారి ఎడల స్పందించగ ఇదె తరుణం
మానవాళిపట్ల తీర్చుకొనగ మన ఋణం
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

1.వృద్ధిచెందాయి కరోనా పుణ్యమా అని వ్యక్తిగత శ్రద్ధలు
పెరుగసాగాయి కరోనా మూలాన పరిసర పరిశుభ్రతలు
ఇనుమడించాయి కుటుంబ సభ్యులతో అనుబంధాలు
పెంపొందుతున్నాయి దేశ ప్రజలలో జాతీయ భావనలు
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

2.అలవడింది నేతల పిలుపుతో గడపదాటని క్రమశిక్షణ
ఒంటబట్టింది చట్టానికి సహకారమందించే పౌరబాధ్యత
తెలియవచ్చింది విపత్తునధిగమించు మన ధీరోదాత్తత
అవగతమైనది సమాజశ్రేయస్సుకున్న ప్రాథమ్యత
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం