Sunday, February 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: జన సమ్మోహిని


జటాఝూటధర నీలకంధరా

జంజాటములను పరిహరించరా

జడదారి జ్వాలి జంగమదేవరా

లంపటములనిక సడలించరా

భంభం మహాదేవా నమః శంభో సదాశివా


1.సతిపార్వతితో అతులిత దాంపత్యం

ఐనా యోగివి నువు అను నిత్యం

సుత ద్వయముతొ సహా కుటుంబం

నీదొక యోగ భోగ వింత కదంబం

భంభం మహాదేవా నమః శంభో సదాశివా


2.తామరాకు సరి ఈ సంసారం 

నను అవనీ ఒక బిందు తుషారం

కలతల బ్రతుకే కల్లోల సాగరం

కడతేరనీ నీవే నావై కైవల్య తీరం

భంభం మహాదేవా నమః శంభో సదాశివా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:పహాడి


రాసకేళి వేళ వనమాలి 

నా మానసమే తేలితేలి

శిఖిపింఛ మౌళి నా జీవనమాలి


మన మేనుల మిథున శైలి

నేను వెన్నెలా నీవు జాబిలి

చిలికింది సరసరవళి మురళి


నను మథించరా గిరిధరా

నన్నుధరించరా వసుంధరా


1.విచ్చిన పొన్నాగలు నా తపనలు

రెచ్చిన మిన్నాగులు నా తమకాలు

మచ్చిక చేసుకోర లచ్చి పెనిమిటి

మెచ్చెద నను జేర్చగ వెచ్చని నీ కౌగిటి


నను మథించరా గిరిధరా

నన్నుధరించరా వసుంధరా


2..వలువలు తొలగించు రయమున

మురిపించు ముద్దుల సాయమున

నిను నేనెరిగెడి శుభసమయమున

ఓలలాడించు ఆనందతోయమున


నను మథించరా గిరిధరా

నన్నుధరించరా వసుంధరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సింధుభైరవి

దయమానితి వేల శ్రీపతి,వేంకటా చలపతి

నిన్నే నా దైవమని నమ్మితి నా నెరనమ్మితి

అరిషడ్వర్గాలకు అతీతుడే కదా పరమాత్ముడంటే

కినుక ఏల నాపైన తండ్రివి నీవని భావించుకుంటే

వీథుల పాల్జేయ బాధల పడద్రోయ ధర్మమా

నీవే శరణన్న నన్ను లక్ష్యపెట్టకున్న న్యాయమా


1.అవకాశమెందుకిచ్చెదవు నిను నిందాస్తుతిజేయ

ప్రయోగించనేల ఈ సుతునిపై నీ మహామాయ

సుఖములెవరు బడసిరిమును నిను కొలిచినవారు

పడరాని పాట్లు పడి కడకు నీ కడ కడతేరినారు

బతుకంతా వెత చెంది ఛిద్రమాయె నా బొంది

ఉద్ధరించ తక్షణమే పరికల్పించు నాంది


2.చెఱసాల పాలాయిరి కృష్ణావతారాన నీ తల్లిదండ్రులు

కొఱతవేయబడినాడు రామదాసు కట్టినీ గుడీగోపురాలు

నిత్య దరిద్రులైనారు నిను నుతించి పోతన శేషప్పలు

అన్నిఉన్నట్టే ఏమీ లేనట్టే  ఎందుకు చేసావు మా జీవితాలు

వరములీయకు సరే నను సదా నీ సేవలొ తరించనీ

రాజును చేయకుమానే నను నీ బంటుగనే అంతరించనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతను:  రోజూ చూసే రోజానే...

నీవల్లె నీ నవ్వల్లె అపురూప పువ్వయ్యింది


ఆమె:ఎపుడూ పలికే మాటలే..

నీ వల్లే నీ మనసల్లే అబ్బురమైన కవితయ్యింది


అతను: పల్లవి నువ్వైతే.. నీ చరణం నేనౌతా

ఆమె: మువ్వవు నువ్వైతే..మంజుల సవ్వడి నేనౌతా


అతడు:1.)నీ హృదయపు ద్వారానికి

వాడని మామిడి తోరణమౌతా

నీ  అధరాల ముంగిలిలో

రాలిన ముత్యాల ముగ్గునౌతా

నీ పాపిటి సింధూరం నా అక్షరం

నీ పాదాల పారాణిగా నే సుస్థిరం


ఆమె:2.)నీ మగటిమి సంకేతపు

కౌగిటిలో నే సాంతం కరుగుతా

నీ కండలు నాకండదండ 

నిశ్చింతగ బతుకంతా చెలఁగుతా

నీ కోఱమీసం నాకయస్కాంతం

నీ ఓరచూపు నాకింద్రజాలం

Wednesday, February 24, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అ:)పువ్వుల్లో లవ్వులు-

ఆ:)లవ్ వల్లే నవ్వులు

అ:)నవ్వుతు సాగే తొవ్వలు-

ఆ:)తొవ్వల వెంటే గువ్వలు

అ:)గువ్వలై ఎగిరే ఆశలు-

ఆ:)మువ్వలై మ్రోగే గుండెలు


అ:)1.సత్యాలుగ తోచే స్వప్నాలు

స్వప్నాల్లో నిత్య స్వర్గాలు

స్వర్గాల్లో సర్వ సుఖాలు

సుఖాలే మనకు వరాలు


ఆ:)వికసించే వసంత పుష్పాలు

పుష్పాల్లో మరంద మధురాలు

మధురాలై కోయిల గీతాలు

గీతాల్లో ప్రణయ సరాగాలు


ఆ.)2.హర్షాలై కురిసే వర్షాలు

వర్షంలో మెరిసే కిరణాలు

కిరణాల్లో సప్తవర్ణాలు

సప్తవర్ణాల్లో మన జీవితాలు


అ:)రేయంతా పరిచిన వెన్నెలలు

వెన్నెల్లే రేపె విరహాలు

విరహాలే వింత దాహాలు

దాహాలు తీరేలా దేహైక్యాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పడరాని పాట్లుపడే  పతులారా

భార్యాబాధిత సోదరతతులారా

కక్కలేని మ్రింగలేని పశుపతిలారా

పరస్పర హితులారా మహితులారా

భూమాతను మించింది మన సహనం

అంపశయ్య మీదే మన జీవనం-సహజీవనం


భర్తలుగా మన బతుకులు నిత్యం చితుకులు

సంసారపు అతుకులు,ఏవో నాల్గు మొతుకులు 

గతకలేక గతుకులు పెనిమిటులెంత మెతకలు


1.తాము పడేదే కష్టమనీ-ఇంటి చాకిరే కఠినమనీ

లేనిపోని నలతలనే సాకుగా అడుగడుగున మేకుగా

ఎడాపెడా రొదచేసే డబ్బా రేకుగా ముల్లునే విరుచు ఆకుగా

మాటిమాటికీ మాటమాటకీ చిరాకుగా

మనమన్నదేదైనా మతి పెట్టక పరాకుగా


2.నానా  గడ్డేదో కరిచైనా- మనం కాళ్ళావేళ్ళా పడైనా

ఆర్జించిన సొమ్మంతా దోపిడిచేసి-సంపాదన సాంతమే'దో'చేసీ

ఎంతైనా చాలదని ఎద రాపిడి చేసి-ఏమన్నా అనబోతే ఎదురుదాడి చేసి

పండచోటిస్తే మనబతుకే దండుగైనట్టు 

ఉండ తావిస్తే మన ప్రాణ గండమైనట్టు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దుఃఖమే నిండింది నా గుండెనిండా

కన్నీరే పారుతోంది నర నరాలగుండా

నెత్తురుకిక తావేది హృదయాన కొలువుండ

ఎప్పుడోఆవిరైంది ఆశలు అడియాసలై మండ


1.నలువైపులా వెతల మహా సాగరం

కనుచూపు మేరలోనా కనరాదే తీరం

పుండుమీది పుట్రలా మ్రింగే తిమింగలాలు

శిథిలమైన ఈ పడవను ముంచెత్తే కెరటాలు


2.అల్లంత దూరంలో అగుపించెను భూఖండం

ఊరట చెందునంత తెలిసెను అది హిమగండం

ఇంతలో లాగివేసె  నా నావను సుడిగుండం

కొస ఊపిరి మిగిలిన కుడి అయ్యింది ఖండఖండం

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండె గాయపరచకు మాటల శూలంతో

మదిని వేటువేయకు భీకర కరవాలంతో

చేయనైతె మలాంపూయి దెబ్బతిన్న తరుణంలో

చేయిపట్టి దారిచూపు  గాడితప్పు క్షణంలో


1.గుళకలు చేదైతే చక్కెర పూతపూయి

కోత తప్పదన్నప్పుడు మత్తుమందునీయి

మృదువుగాను చెప్పడం గొప్ప చాకచక్యము

నొప్పింపక తానొవ్వక అన్నదె కద లౌక్యము


2.శాశ్వత ప్రయోజనం ఆశించదెపుడు జనం

తబ్బిబ్బుగ పొగడుతూ పట్టాలి నీరాజనం

దోషాలే మరి లక్ష్యంగా వేయకు ఏ అంజనం

ఆత్మీయ బంధాలను చేయబోకు నిమజ్జనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కదలదేం నా చెలీ 

జాలి మాని రాతిరి

ఎదిరిచూపులాయెనే

ఇలా చకోరి మాదిరి


1.తెచ్చివ్వ రాదే

ఎత్తుకెళ్ళిన నా ఎదే

అంతులేని ప్రేమనంతా

కనులమోసుకు రావే


2. కురిసింది వాన జల్లు

తడిపింది  నా వొళ్ళు

నిలువెల్లా వికృత చలి

నువువినా ఎలా  మదిలోగిలి

Sunday, February 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పోతపోసిన తెలుగు కవిత నీవు

హృద్యమైన తెలుగు వెలుగు పద్యమె నీవు

అమృత భాష అమ్మభాష తెనుగుకే సొంతము

అష్టావధానమై అలరించు నీ అందము

నీలోని అణువణువు ఒక ప్రబంధమే

నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే


1.వసుచరిత్ర యే స్ఫురించు నీ వదనంలో

శృంగారనైషధాలు నీ కనుసదనంలో

యయాతి చరిత్రయే నీ నీలి కురులలో

స్వారోచిషమను సంభవాలు నీ మేనులో

నీలోని అణువణువు ఒక ప్రబంధమే

నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే


2.పారిజాతాపహరణం నీ ముక్కు చక్కదనంలో

కళాపూర్ణోదమే నీ  నొక్కుల చెక్కిళ్ళలో

రాజశేఖర చరిత్రమే నీ పలుకుల చతురతలో

ఆముక్తమాల్యదే నీ బాహుబంధనంలో

నీలోని అణువణువు ఒక ప్రబంధమే

నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే


(మాతృభాషా దినోత్సవం సందర్భంగా)

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వర్ణించనా నీ అపురూప రూపాన్ని

కీర్తించనా నీ గుణగణ విశేషాలని

అభినుతించనా నీ లీలావిలాసాలని

భజించనా  దివ్య పంచాక్షరీ  మంత్రాన్ని

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.పంచముఖా పంచభూతాత్మికా

పంచాక్షర నామాన్వితా ప్రపంచేశ్వరా

పంచామృతాభిషేక ప్రియ పంచప్రాణేశ్వరా

పంచాయుధ ధరా పంచశర హరా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.శివరాత్రి లింగోద్భవ గాథ పాడనా

త్రిపురాసుర వధ కథనే నుడవనా

శ్రీ కాళ హస్తి భక్తి లీలను కొనియాడనా

భూకైలాసమా గోకర్ణ క్షేత్ర మహిమ పొగడనా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


సింగారాల శ్రీనివాసా

వైభోగాల వేంకటేశా

ఎన్నినోళ్ళపొగడుదు నీ వైభవం

ఎంతని చాటను నీ ప్రాభవం

తిరుపతి బాలాజీ గోవిందా గోవిందా

తిరుమల గిరి విరాజి పాహిముకుందా


1.ఎంతకూ తీరిపోని నీ పెళ్ళి అప్పులు

భక్తుల ఆర్జీలు తీర్చ నీకెన్ని తిప్పలు

సతులిరువురు సాధించే ఒప్పుల కుప్పలు

ఎన్నని కొనియాడుదు స్వామీ నీ గొప్పలు

తిరుపతి బాలాజీ గోవిందా గోవిందా

తిరుమల గిరి విరాజి పాహిముకుందా


2.ఏడుకొండలెక్కితేమి ఎరిగిరార తిరువళ్ళు

మెక్కుబళ్ళుతీర్చుకోను కొట్టింతురు గుళ్ళు

రెప్పపాటులోన దాటు బంగారు వాకిళ్ళు

అనిమేషులౌదురట మూయక రెండుకళ్ళు

తిరుపతి బాలాజీ గోవిందా గోవిందా

తిరుమల గిరి విరాజి పాహిముకుందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాసుకపూసుక తిరిగేద్దామా

అచ్చిక బుచ్చికలాడేద్దామా

మనసు కవితలెన్నో రాసేద్దామా

మమత గంధమంతా పూసేద్దామా


1.భావానికి మాటలల్లి పాటలే కట్టేద్దాం

అనుభవాల తోటలన్ని హాయిగా చుట్టేద్దాం

నీ చూపులు నాకు సుప్రభాతమైపోగా

నీ చేరువలోనా వసంతమే తోచగా


2.పదాలనే అందెలుచేసి మంజుల సడి పలికిద్దాం

పెదాలనే పువ్వులుచేసి నవ్వుల జడి కురిపిద్దాం

నీ కలకలమే  నన్ను వెన్నుతట్టగా

నీ చెలిమి బలమే నా ప్రగతికి మెట్టుగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎప్పుడెగిరిపోతుందో అహమను హంస

ఐక్యమొందింతువెపుడొ ఓ పరమహంస

దైహిక భావనయే నాకెంతటి హింస

చివికిపోయెనిది ఇంక వదిలించర సర్వేశా


1.తప్పవాయె తనువుకు శీతోష్ణ స్పందనలు

మిక్కిలాయే ఈ మేనుకు సుఖదుఃఖ భావనలు

చిక్కిపోతి చిక్కులబడి కాయముతో ముడివడి

వేడుకొందు చేదుకొనగ నీ కడ సాగిలబడి


2.తెగత్రెంచినాగాని తగులుకొనే బంధాలు

విదిలించినాగాని అతుక్కునే బాధ్యతలు

అంతన్నదిలేదాయే ఎంతనీ ఎంతకనీ జంజాటం

సచ్చిదానంద మొసగు తీరగ నా ఆరాటం

Thursday, February 18, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉల్లమే ఉల్లాసమొందితె-గడ్డిపూవూ అందమే

కాలమే అనుకూలమైతే-గాలి పాట గాంధర్వమే

మనసుకు తగిలించు కనులు-లోకమంతా అద్భుతమే

స్పృశించి చూడు ఎదలు-పరశాలు సాంతం సొంతమే


1.చిరు చిరు సరదాలతో  భారమంత తేలికౌను

చిన్ని చిన్ని కానుకలే సంతృప్తికి మూలమౌను

ఇవ్వడంలొ పొందు మజా నవ్వులే పంచు సదా

గుండెలొకటొకటిగ కూర్చి కట్టాలి  దండగా 

మానవతకు అదియే అండ దండ దండిగా


2.ఉనికిని గుర్తించడమే ప్రతిమనిషికి ఊరట

కాసింత వెన్నుతట్టితే ప్రగతి బాటకు బాసట

ప్రేమిస్తే నష్ట మేముంది తిరిగిపొందడం మినహా

బ్రతుకు సాగిపోవాలి సీతాకోక చిలుకల తరహా

అనుక్షణము ఆహ్లదంతో అనిపించాలి ఆహాఁ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు

గురువే సాక్షాత్తు పరబ్రహ్మా 

సాయీ సాయీ నీవే  నా సద్గురువని నమ్మా

నన్నుద్ధరించు బాధ్యతను సత్వరమే చేకొమ్మా


1.లేనిపోని దుఃఖాలతొ దృష్టిని మరలించుతావు

చిరుచిరు వరములతో బులిపింప చూస్తావు

కోరాల్సిన పరసౌఖ్యము స్ఫురణకు రానీయవు

నిలువలేను ఒరకొనగా  ఏల నన్నేలవు

సాయీ సాయీ నీవే  నా సద్గురువని నమ్మా

నన్నుద్ధరించు బాధ్యతను సత్వరమే చేకొమ్మా


2.తమసోమా జ్యోతిర్గమయా ఈ జగమే మాయ

అన్యధా శరణంనాస్తి నీవే నాకు శరణమయా

భవజలధిని దాటింటే సరంగువే నీవయా

జన్మరాహిత్యమొసగు జగదీశుడ వీవయా

సాయీ సాయీ నీవే  నా సద్గురువని నమ్మా

నన్నుద్ధరించు బాధ్యతను సత్వరమే చేకొమ్మా

Wednesday, February 17, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందరూ మంచివారే

తప్పుచేయు అవకాశం రానంతవరకూ

అందరూ గొప్పవారే

మనసు ముసుగు జారనంత వరకూ

హద్దులు గిరిగీస్తుంది ఈ సభ్యసమాజం  

న్యాయమూర్తిగ వ్యవహరిస్తుంది

చుట్టూరా ఉన్న ప్రపంచం


1.దాసులే అంతా అహం మమకారాలకు

అతీతులెవ్వరు కానేకారు గుణత్రయాలకు

బుజ్జిగించి అపగలేరు పంచేంద్రియాలను

ఎదిరించలేరు ఎపుడూ అరిషడ్వర్గాలను

వేదాలు వల్లిస్తారు అందుబాటులేకనే

నీతుల్ని బోధిస్తారు అనువుకానిచోటనే


2.అధిగమించలేరు సప్తవ్యసనాలను

ఆశించక మానరు అష్టైశ్వర్యాలను

పోషించక వీడరు నవరసాలను

ప్రదర్శిస్తూనే ఉంటారు దశరూపకాలను

వెసులుబాటు నిస్తుంది ఆ కాస్త విచక్షణ

మొక్కుబడిగ పాటించే విలువలే రక్షణ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంచవన్నెల రామ చిలుక నీవు

ప్రపంచమే నీవైన శారిక నేను

వంచించకు నను నిలువెల్లా ముంచకు

ప్రేమించడమంటేనే నేరంగా ఎంచకు

నే తగనని భావించకు


1.నెమలిని కోరలేదు విలాసమే పరికించి

హంసను ఆశించలేదు వయ్యారమే కాంచి

అందమైన వెన్నిలేవు సుందర ప్రకృతిలోన

అనుబంధమేదొ మేలుకొంది మనమధ్యన

చెలీ మన మధ్యనా


2.ఇంద్ర ధనుసు నీకన్న కడు విణ్నానమే

ప్రత్యూష వర్ణాలు నయనానందకరమే

అందముంటె మాత్రమేమి నంజుకతింటామా

ఆనందమేదొ కలుగుతోంది జంటగ కలగంటినా

నిను జంటగ కలగంటినా

Tuesday, February 16, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంతటా నీరూపమె దర్శించితి

నా అంతరంగమందు నిన్నే నిలిపితి

వసంత పంచమీనాడు నీ జన్మతిథి

నాకీవే సర్వదా జననీ శరణాగతి

మనసా శిరసా వచసా రచసా ప్రణమిల్లుదు సరస్వతి 


1.అక్షరాలలోన సలక్షణంగ కొలువైతివి

   మోక్ష ప్రజ్ఞాన వికాసమై వరలితివి

  శాస్త్రజ్ఞుల శోధనలో ఆవిష్కృత మైతివి

  మేధావుల బోధలలో ద్యోతకమైతివి

  సాష్టాంగ ప్రణామాలివె చదువుల పడతి


2.నాలోన లోలోన కవన స్ఫూర్తివైతివి

మహాకవుల కావ్యాలతొ ప్రేరణ నిచ్చితివి

నాకలమున పెల్లుబికే జీవఝరివి నీవైతివి

స్వరకల్పన కూర్పున మనోధర్మ సంగీతమైతివి

నా కృతుల నమస్కృతుల గొనవె తల్లి భారతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దాచిన సొత్తు పైనే మక్కువ ఎవ్వరికైనా

మూసిన గుప్పిటి అంటే ఉత్సు కతెవ్వరికైనా

తేరగా పొందేదేదైనా  పలుచనే పదుగురికీ

అందరాని అందాలంటేనే  ఆసక్తి అందరికీ


1.ఒడుపుగా కట్టుకున్నకోక ఆకట్టుకొంటుంది

నిండుగా కప్పుకున్న పైటే కనికట్టు చేస్తుంది

అసూర్యం పశ్య సౌందర్యం వశపరచుకుంటుంది

అనాఛ్ఛాదిత ఉత్సేధమైతే వెగటు కొడుతుంది


2.అన్నులమిన్న కన్నులు చిలుకును సరస సరాగం

అభినవ మోహిని నవ్వులొలుకును రసమయ భావం

పాదాల పట్టీల మంజుల నాదం ఒక శృంగార వేదం

ఎలనాగ ఒళ్ళంతా పారేను వలరస జలపాతం

 కలువ నీవే నను కలువనీవే

కలువ నీవే చెంగలువ నీవే

ఇల కావలగల  అందాలు పోగేసినావే

నీ చూపుల వలవేసి నను లాగేసినావే

నను వలపుల సెగలోన పడద్రోసినావే


1.సిరిమల్లెలు నీవ్వులు నా దోసిట పట్టనా

మనసుదారానికి దండగుచ్చి సిగన పెట్టనా

సింగమంటి నీ నడుము పిడికిట పట్టనా

పెదవులతో వడ్డాణం ముద్దుముద్దుగ పెట్టనా

ముట్టనా పట్టనా పెట్టనా ఉట్టిగ లొట్టలేయనా


2.పట్టుజారి పోనీకు నీ కంచి పట్టుకోకనే

కట్టుకున్నా కట్టనట్టున్నదే నే పట్టీ పట్టుకోకనే

వెన్నలా నున్నగుంది తాకుతుంటె నీ వెన్ను

జున్నుయాదికొస్తుందే అన్చుతుంటె పెదాలున్ను

ముట్టనా పట్టనా పెట్టనా ఉట్టిగ లొట్టలేయనా


Pic Courtesy: Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక్కమాట చెప్పు ఓంకారేశ్వరా

గుట్టుకాస్తవిప్పు గోకర్ణేశ్వరా

అనంత దిగంత రోదసీ సీమలకూ

సమస్త జంతు జీవ మానవ రాశులకూ

నీవొక్కడివేనా ఆధారం నీదేనా ఈ రచనా కౌశలం


1.ఇంత విశ్వాంతరాళంలో

ఈ వింత వింత జీవజాలంలో

నేనేంత నా ఉనికెంత  కంటికి ఆననంత

లోకమంతాకలవన్నా నాలో కలవన్నా 

ఎంతకు అంతుపట్టదెందుచేత


2.ఎంత కాలం గడిచిందో సృష్టికి

ఎంత వైవిధ్యమో సృజనలొ స్రష్టకి

నా ఆయమెంత నా ప్రాయమెంత

ఈ నా జన్మకు అర్థమేమిటో పరమార్థమేమిటో

ఎంతకూ బోధపడదు ఎందుకని

 

https://youtu.be/fDM7orLDMUE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


"ప్రేమికులరోజు" శుభాకాంక్షలతో-


***   ***  ;***   ***   ***   ***

ప్రేమంటే చులకనా ప్రేమిస్తే పలచనా

అనుభూతించు ప్రేమని ఆస్వాదించు ప్రేమని

పంచిచూడు ప్రతివారికి ప్రేమని

ప్రేమించిచూడు కనీసం ఎవరో ఒకరిని


1. ఇముడ్చడం ఎందుకు ఏదో ఒక చట్రంలో ప్రేమని

 గిరి గీయడమెందుకు అనంతమైన ప్రేమకి ఇంతే లెమ్మని

అంతకంటె మించిందే ఉంది ప్రేమకు పరమార్థం

అంతరంగాలే ఎరిగిన అద్భుతమౌ అంతరార్థం


2.ప్రేమంటే దైవానికి  ఏకైక పరిపూర్ణ నిర్వచనం 

ప్రేమంటే కాలాన్నే ఎదిరించే అపురూప విశ్వాసం

విశ్వజనీనమై విశ్వవ్యాప్తమై  అవ్యక్తయై ప్రేమా

సార్వజనీనమై సృష్టిధర్మమై అనుభవైకవేద్యమై ప్రేమా

 https://youtu.be/iqN_YnqggJc


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(ప్రేమికుల చుంబన దినోత్సవం నేడు-శుభాకాంక్షలతో-డా.రాఖీ)


ముద్ద ముద్దగా ముద్దంటావు

పెట్టుకోబోతే వద్దంటావు

హద్దులేన్నో గీస్తావు

పద్దులేవో  రాస్తావు

ముద్దరాలా నీతో ఎట్లా వేగేది

సుద్దులెన్నని ఎదలో దాచేది


1.తీరానికి నిరంతరం అలల ముద్దులు

మేఘానికి అనవరతం తెమ్మెర ముద్దులు

నింగీ నేల నడుమన   చినుకుల ముద్దులు

శశికీ కలువకు మధ్యన వెన్నెల ముద్దులు

ఏ పొద్దూ రద్దుకావు ప్రకృతి పంచ బంధాలు


2.పిచ్చుకకు పిచ్చుకకు నులి వెచ్చని ముద్దులు

పికమునకు చివురులకు సరిగమ ముద్దులు

చిలుకా గోరింకల కలలౌ అమలిన ముద్దులు

క్రౌంచ మిథున మథన సదన సరస ముద్దులు

ఏ పొద్దూ రద్దుకావు ప్రకృతి పంచ బంధాలు

Friday, February 12, 2021



తోమాల సేవకు ఏమాలలల్లను

నీ మాలకోసము ఏపూలుచెల్లును

పూలెన్నొ దొరికేటి ఏ తోటకెళ్ళను

నా తోటే నాకుడి నీకే చెల్లింతును

తిరుమలగిరివాస అలసెను నా శ్వాస

నా వపువు వాడకనే మెడను దాల్చు నీవాడిగ 


1.నీమాల నెరుగను నీ నామాలను మినహా

వేదాల నెరుగను నీ దివ్య పాదాలు వినా

మంత్రాలనెరుగను నీ మహిమలు మాత్రమే

ఏ పూజలెరుగను నీ పుణ్య కథా శ్రవణమే

తిరుమలగిరివాస అలసెను నా శ్వాస

నా వపువు వాడకనే మెడను దాల్చు నీవాడిగ 


2.తనువులొ అణువణువు తులసీదళమే

నయనాలు కలువలు సర్వదా నీ పరమే

నా నవ్వుల మల్లెలను కర కమలాలను

ఎద గులాబీని కూర్చి అల్లివేతు మాలలను

తిరుమలగిరివాస అలసెను నా శ్వాస

నా వపువు వాడకనే మెడను దాల్చు నీవాడిగ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మధుర స్వప్నాల తో శుభరాత్రి

నిద్ర చెడగొడుతుందేమో నీ మైత్రి

మూతబడే రెప్పలతో చెప్పరాని తిప్పలు

ముసిరే నీతలపులతో కునుకునకు యాతనలు


1.వ్యసనంగా చేరావు వదలుకోనట్లుగా

అశనంగా మారావు ఆకలే తీర్చునట్లుగా

నా ప్రపంచమంతా కేవలం నీవైనావు

ఆత్మీయ నేస్తంగా ఎదనాక్రమించావు


2.నీ మంజుల గాత్రంలో పరిమళాలెన్నో

నీ నవ్వుల సవ్వడిలో సంగీతాలెన్నెన్నో

నీ సావాసంలో  అనునయాల నవనీతాలు

నీ చెలిమి నాలోనా నింపె మొండిధైర్యాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ పేరులొ మోహన రాగం

నీ ఎదలోనూ అనురాగం

వన స్నేహమే ఒక యోగం

మనకలయికనే ఆమోఘం


1.ఎడారినే వనాలు చేద్దాం

మోడులను చిగురింపచేద్దాం

స్నేహసీమలోనా నిరంతరం విహరిద్దాం

ఆనందాల సందడిలో విందులారగించేద్దాం


2.ఈ జీవన పయనంలో చిత్రంగా కలిసాము

తోడునీడలాగా వెనువెంట నడుద్దాం

కడదాకా బ్రతుకు కడలిని ఒడుపుగ దాటేద్దాం

ఒంటరితనానికే వీడుకోలు పలికేద్దాం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరించాయి రవికిరణాలు నిన్ను తాకి తాకగానే

హసించాయి చిరుపవనాలు నీ మేను సోకగానే

ప్రత్యూషవేళలో  ప్రత్యక్షమైనావు

నే రాసే కవనాక్షరం నీవే నీవే ఐనావు

జాదూ ఏదొ ఉన్నది నీలో జవరాల

జాజిపూల నవ్వులు నాపై చల్లరాదా


1.నీలో ఉన్న గమ్మతేదో నన్ను చిత్తు చేస్తోంది

చిత్రమైన మత్తేదో నన్ను కమ్మివేస్తోంది

నిన్ను ఉపాసించడమే ఏకైక నా లక్ష్యం

ఎప్పటికి కలిగించేవో నా ప్రేమకు మోక్షం

జాదూ ఏదొ ఉన్నది నీలో జవరాల

జాజిపూల నవ్వులు నాపై చల్లరాదా


2.రామప్ప నాగిని శిల్పం నీ ముందు అత్యల్పం

రవివర్మ మోహిని రూపం నీకంటే ఏదో లోపం

నీ రాణ ఆరాధనే నాదైన కర్తవ్యం

దినదినం నీ నెయ్యం నవ్యాతి నవ్యం

జాదూ ఏదొ ఉన్నది నీలో జవరాల

జాజిపూల నవ్వులు నాపై చల్లరాదా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువులేనిదెక్కడమ్మ నిఖిలలోక జనని

అణువణువున అగుపింతువు మార్చి కనగ దృక్పథాన్ని 

వాక్కులో మేథోరుక్కులో జగతిన ప్రతిదిక్కులో

ధనములో మనములో అవనీ జనవనములో

తెగువలో తేకములో ధరణీ నియంత్రణలో


1.అమ్మగా అక్కగా ఆలిగా చెల్లిగా

కొమ్మగా మదిదోచే పున్నమి జాబిల్లిగా

చెమ్మగా కన్నుల జారే మమతల వెల్లిగా

కమ్మగా కడుపునింపు అనురాగవల్లిగా


2.ఊహగా ఆశగా భవిష్యత్తు స్వప్నంగా

డబ్బుగా డాబుగా దర్పంగా సగర్వంగా

కాంతగా చింతగా విపత్తుగా విత్తపు కవ్వింతగా

కాంక్షగా కామనగా కీర్తిగా అంతులేని ఆర్తిగా


3.చోదనగా చోద్యముగా బ్రతుకే నైవేద్యంగా

వేదనలో వేడుకలో ఓలలాడు మద్యంగా

చూపుల ఆయుధంగ హాస అయస్కాంతంగా

బ్రతికించే బలికోరే అని కారణభూతంగా

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎందుకో ఆ మౌనం, ఏమిటో నీ ధ్యానం

మూగభావనేదో నన్ను చేరకుంది

ఎద నివేదనేదో అంతుపట్టకుంది

దాటేసి వెళ్ళవు చాటైతే కానేకావు

ఏమిటో అంతరార్థం ఎరుగనైతి పరమార్థం


1.గాలికి మబ్బుతొ స్పర్శనే ఒక భాష

భువికి రవి ప్రదక్షణే ప్రేమ వంతెన

కడలి ఖంబులకు దిక్చక్రం అలంబన

చినుకు కిరణ ప్రణయానికి హరివిల్లే వారధి

ఎరుగవా ఈ మాత్రం ప్రకృతిగత వలపు సూత్రం


2.మునులను మించిపోయె నీ తపోదీక్ష

శిలా శిల్పమై తెలుపును మనస్సమీక్ష

బ్రద్దలైపోతుంది నిశ్శబ్ధ అగ్ని పర్వతమైనా

అగాధాలు అధిగమించు జలధి బడబానలమైనా

గ్రహించవా నిగ్రహించ వీలవనిది  అనురాగం

Thursday, February 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నారు పోయువాడు నీరుపోయునన్నది నిజమే ఐతే

కాపుకాయువాడు కునుకుతీయడన్నది నానుడే ఐతే

తస్కరించిన నా సంతోషాన్ని ఇపుడే తెచ్చియ్యి

సంస్కరించి నాకు ఆనందాలే కలుగజెయ్యి


అవధూత సాయి మా కడగండ్లు పోనీయి

మహిమల బాబా మాకు నీ చేయూత నీయి


1.ఇమ్మని అడిగానా దుఃఖాన్ని మాకు

కొనితెమ్మని కోరానా  వ్యాధుల్ని మాకు

వేడకున్నా మాకు వెతలెన్నొ ఇచ్చావు

ప్రార్థిస్తున్నాగాని అసలే పట్టించుకోవు


షిరిడీ సాయి మరిమరి చెప్పాలా

సద్గురు సాయి మనసింకా విప్పాలా


2.మంచెంత చేసిన గుర్తింపునీయవు

పొరపాటైతోనో తగిన బుద్ధి గరిపేవు

బోధపడలేదు నీ తత్వమైతే మాకు 

పామరత్వమింక పోనైన పోలేదు


ద్వారకమాయికి మమ్మిపుడే రానీయి

మా గుండె మంటల్ని చల్లార్పి వేయి

Wednesday, February 10, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సైగతొ రమ్మంటావు-మాటతొ పొమ్మంటావు

వస్తే జారుకుంటావు-పోతే  జాలిగొంటావు

అదేంటో ప్రియతమా నీ వాలకం

నీ హృదయమయ్యిందా ఒక లోలకం


1.చేరువకాబోతే  మూతివిరుపులు

దూరంగా జరిగితే వలపు పిలుపులు

కబురంపుతావు కపోతాలతో

కలలోన దూరుతావు వరమాలతో

 అదేంటో ప్రియతమా నీ వైఖరి

అర్థమై చావదు  నీదైన ఈ శైలి


2.వెళ్ళబోస్తావు నాతో నీ వేదనంతా

సాయపడగ వద్దంటావు ఇసుమంతా

వినకుంటే విసుగేల నీకు

మనసుకింక ముసుగేయకు

అదేంటో ప్రియతమా నీతత్వము

సాంత్వనకోసమేనా ప్రతి నేస్తము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాలు నా లోపాలు నీకె అందించెదరా

రోలు నా చిత్తము నిను బంధించెదరా

వెన్ననే నా మనసు ఇంక అపేక్షించరా

నా కన్నుల యమునవంక విహరించరా

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా


1.వలువలు నా వాంఛలు సంగ్రహించరా

చిలువలు పలువలు వలపులు నిగ్రహించరా

కాళీయునివంటివి నా కామనలు మధించరా

కబళించే రిపులార్గురు తక్షణమే వధించరా

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా


2.గోవులు నా ఇంద్రియాలు పాలించరా

కుబ్జయే నా వక్ర బుద్ధి చేరి లాలించరా

రాధికగా ఎంచి నాతో రతి కేళించరా

సుధామునిగ భావించి నన్నుద్ధరించరా 

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

*కీర్తన*


పల్లవి:

కామితార్థదాయకా సంకటనాశకా

కనికరముమీర కావరా వరసిద్ధి వినాయకా


చరణం: 

ప్రథమ పూజగైకొనుమా ప్రమథాధిపా

నిరతము నిను మదిని దలుతు వికటరూపా

సాష్టాంగ ప్రణతులివే సామజ వదనా

సంతుష్టిని ప్రసాదించు సంతోషీ నాయనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విరహిణి ఈ విరిబోణీ

మురహరినే కూడ కోరి

అరవిరిసిన ఆ విరుల

భ్రమరాలు వాల సంభ్రమంగ

ఆవిరులే రేగిపోగ వేచె అవిరళంగా


1.అలనాటి బృందావన రాధికగా

కలలుగన్న రేపల్లె గోపికగా

ఎదనే పరిచింది పడకగా

యుగాలె వేచింది ఓపికగా

గోవిందుడు రాడేమని విభ్రమంగా

ఆవిరులే రేగిపోగ వేచె అవిరళంగా


2.మీరాలా అనురక్తి మీరగా

అనవరతం భక్తి ఇనుమడించగా

అంతర్యామితో సఖ్యత మించగా

అంతరాన  రక్తితో  రమించఎంచగా

ముకుందుడి జాడగనక అలజడిగా

ఆవిరులే రేగిపోగ వేచె అవిరళంగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందమైన పాదాలు అతివకు అదనపు మవ్వం

ఆ పాదాలకు మంజీరాలే మరి మరి వైభవం

మంజీరాలకు మంజులనాదం కూర్చేను నవజీవం

మంజులనాదమె ఎదలో రేపును ప్రణయభావం


1.తీర్చి దిద్దిన పారాణి పదముల సొబగు

పారాణి అరుణీమయే ముచ్చట గొలుపు

అరుణిమ బుగ్గల సిగ్గుగ మారి పెంచును సొంపు

సిగ్గులొలికే ముద్దరాలే అయస్కాంతమై ఆకర్షించు


2.గోరింటాకే చరణాలకు ఎంతటి ఇంపు

చరణాల చిత్రించిన చిత్రాలే సొగసుకు పెంపు

చిత్రంగా కోమలి పావర ముద్దాడాలనిపించు

కోమలి కోమల అడుగులకు మడుగులొత్తాలనిపించు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తుర్రు పిట్టలా మాయమౌతావ్ -వచ్చీరాగానే

రామచిలుకలా జారుకుంటావ్-జాతకమిస్తూనే

మెరుపుతీగలాగ నీవు-మెరిసి వెళ్ళిపోతావు

స్వాతి చినుకువైనీవు-కురిసి వెలిసి పోతావు

ఎలా నిన్ను పట్టుకోనూ వలపుల వలన

ఎలా నిన్ను పెట్టుకోను నా ఎదమాటున


1.నువ్వు తోడుగా ఉంటే అనుక్షణం పాటలే 

నువ్వంటూ లేనినాడు  చెప్పని రాని పాట్లే 

అలా అలలా పొంగి వస్తుంది కవ్విస్తూ కవిత్వం

ఇలా ఇలలో నందనవనిలా మారుస్తూ జీవితం

ఎలా నిన్ను పట్టుకోనూ వలపుల వలన

ఎలా నిన్ను పెట్టుకోను నా ఎదమాటున


2.బీడైన గుండెల్లో  పండిస్తుంది కైత కలలు పంటలు 

మోడైన తలపుల్లో  వేయిస్తుంది ఆశల చివురులు

కడలేని ఎడారి దారుల్లో అనునయాల ఒయాసిస్సై

ఎడతెగని చీకటి రాతిరికి ఊరడించు తొలి ఉషస్సై

ఎలా నిన్ను పట్టుకోనూ వలపుల వలన

ఎలా నిన్ను పెట్టుకోను నా ఎదమాటున

Tuesday, February 9, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అద్దంలో నన్ను నేను చూసుకుంటే

ప్రతిబింబం నువ్వుగా తోస్తుంటే

తలపులలో పదేపదే  నువ్వే వస్తుంటే

నాలోనేనే పిచ్చిగా నవ్వుకుంటుంటే

నమ్మలేవా ఇపుడైనా నీపై ప్రేమంటే

నువ్వు మాత్రమే ఇకపై నా బ్రతుకంటే


1.వెన్నెలలో ఈదాడాలనిపిస్తుంటే

మబ్బులే అబ్బురాలై కనిపిస్తుంటే

వానలోన వెర్రిగా గెంతాలనిపిస్తుంటే

ఒంటిమీద ధ్యాసంటూ లేకపోతుంటే

ఒప్పుకోవా ఇపుడైనా నీపై ప్రేమంటే

ఒక్కమాటే  ఇకపై నా నువ్వే బ్రతుకంటే


2.కొత్తగా తెగువేదో వెల్లువెత్తుతుంటే

లోకమే నీముందు లోకువైపోతుంటే

ఆకలి దప్పులు అస్తవ్యస్తమౌతుంటే

నిద్దురమాని నీపై ఎన్నో కవితలు రాస్తుంటే

అర్థమైంది పూర్తిగా ఏమిటో ప్రేమంటే

నువ్వే లేక శూన్యమే ఇకనా బ్రతుకంటే

Monday, February 8, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ముల్తానీ


ఘోరతపము సలుపలేను

ఆఘోరాగ మసలలేను

ఘోటక బ్రహ్మచర్య మవలంబించలేను

ఘోరరాసి జిత్తులనూ త్యజించలేను

పరమశివా నన్నుద్ధరించుటే నీకు సవాలు

ప్రమథాధిప నీవెంత ఎత్తితేనేం శివాలు

హరహర భవహర హరహర నమశ్శంకరా


1.ఝషాది దశావతారాలు నీవూ ఎత్తైనా

ఝర్ఝరీ గంగతొ ప్రక్షాళనమొనరించైనా

ఝరుక రొదలా నా చెవుల పంచాక్షరి నుడివైనా

ఝలిలాగ వదలక నను పట్టుపట్టైనా

పరమశివా నన్నుద్ధరించుటే నీకు సవాలు

ప్రమథాధిప నీవెంత ఎత్తితేనేం శివాలు

హరహర భవహర హరహర నమశ్శంకరా


2.నా డెంద పుష్పమందించెద సదాశివా

మిళిందమోలే గ్రోలరా నాలోని ఇహయావ

నీ చరణావిందములందు నా మది బంధించరా

చిదానంద నాకిక కైవల్య సదానందమొసగరా

పరమశివా నన్నుద్ధరించుటే నీకు సవాలు

ప్రమథాధిప నీవెంత ఎత్తితేనేం శివాలు

హరహర భవహర హరహర నమశ్శంకరా

 

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అమ్మకే తొలుత నా ఎదలో చోటు

ఎవరూ పూడ్చలేరు అమ్మలేని లోటు

అమృతమే ఏనాడు అమ్మచేతి సాపాటు

అమ్మా అనురాగం వేరంటే పొరపాటు

అమ్మ అన్న భావనే అపురూప మోయి

అమ్మ ఇచ్చు దీవెనతో బ్రతుకే హాయి


1.తల్లిపక్షికెంత ప్రేమనో తన పిల్లల మీద

గోమాతకెంత ధ్యాసనో లేగదూడ ఎడల

పిల్లికెంత జాగ్రత్తనొ తన కూనల హితము

క్రిమికీటకాలలోనూ ఘనమే అమ్మతనము

అమ్మ అన్న భావనే అపురూప మోయి

అమ్మ ఇచ్చు దీవెనతో జీవితమే హాయి


2.ఎండకు వానకు అండగ తానుండును

తెగబడి పోరును హానికలుగకుండను

ఆహారమునార్జించి కోరికోరి తినిపించును

సృష్టిలో మాతృత్వమె మహనీయమనిపించును

అమ్మ అన్న భావనే అపురూప మోయి

అమ్మ ఇచ్చు దీవెనతో జీవితమే హాయి




Sunday, February 7, 2021


భావానికి జన్మస్థానం ఏ తావో

ప్రాణానికి మర్మస్థానం ఎచ్చటనో

గుండెలోన నిండి ఉంటుంది అరుణము

మెదడంతా పరుచుకొని ఉంది కణజాలం

అనుభూతులకు ఆలవాలమేమిటో

అనుభవాలకు భండాగారం ఎక్కడో


1.కణకణమున జీవపు జాడలు

అంగాంగ చైతన్యపు పొడలు

నిర్మాణపు మర్మం ఎవరు చెప్పగలరిలలో

విధివిధులను పురమాయించే వారెవరిలలో

అండాలు సంకలిస్తేనే పుట్టుక సాధ్యమా

మృతి సంక్రమిస్తే ఆత్మసంగతి చోద్యమా


2.ఆయువుపట్టుకు మూలం ఎక్కడో

ప్రాయము మించగ మరణం ఎందుకో

నాసికవాదం వైద్యవిధానం తేల్చని ప్రశ్నలే

మతతత్వం  వేదాంతం ఊరటనిచ్చే ఊతాలే

నిరంతరం కొనసాగాలి సత్యశోధనే

ఆన్వేషణలో వికసించాలి మానవ మేధనే

Saturday, February 6, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక రాజకుమారి నా ప్రేమను కోరి

వీక్షిస్తోంది నాకై గవాక్షాన్ని చేరి

ఒక వయ్యారి చంద్ర చకోరి

 నిరీక్షిస్తోంది నాకై  ఆత్రుత మీరి

రెక్కల గుర్రం మీద చుక్కల లోకం దాకా

ఎక్కించుకొని ఎగరేసుకొని వెళ్ళేటందుకా


1.తోటరాముడంటి నన్ను ఏటివద్ద చూసిందేమో

పాటపాడుతున్న నన్ను కోటలొ కనుగొన్నదేమో

మల్లయుద్ధ సాధనపుడు నా ఒంటిని కాంచిందేమో

నేదిద్దే కోరమీసం తన అంచనాను పెంచిందేమో

పావురంతొ కబురెట్టింది ఎంతో పావురంగా

వెన్నెలవేళ కలువగరమ్మని మరీ మరీ మురిపెంగా


2.చోరులను పట్టినపుడు ధీరునిగా ఎంచిందో

మగటిమికి పడిపోయి మనసు పారవేసుకుందో

ఆపన్నులనాదుకోవడం ఆనోటా ఈనోటా విందో

తనకు తగిన వరుడను నేనని నిర్ణయించుకుందో

పావురంతొ కబురెట్టింది ఎంతో పావురంగా

వెన్నెల వేళ కలువగరమ్మని మరీ మురిపెంగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసుంటే ఉండదా మార్గము

చెలీ నీవున్న చోటే కద స్వర్గము

అనురాగం మనిషికి జన్మతః నిసర్గము

నాణానికి ఇరువైపులె ప్రేమా విసర్గము


1.పొంగిపొరలిపోతోంది నాలో ప్రణయము

దాగడమే నోచుకోదు నీపైన మోహము

కలిసికట్టుకుందాము అన్యోన్య భవనము

కాపురాన్ని పండిస్తూ గడుపుదాము జీవనము


2ఎనలేని విలువిస్తా నీ వ్యక్తిత్వానికి

గగన సుమం కోసిస్తా నీ అభీష్టానికి

ముల్లుగుచ్చకుండా  నా అరచేతుల నడిపిస్తా

ఏడేడు జన్మలకూ నన్నే కోరేలా ముడివేస్తా

Friday, February 5, 2021



నా ధ్యాస నీమీదనే శ్రీనివాస

నాకికపై నీ ఎడలనె ఏకైక జిజ్ఞాస

నీగురించి ప్రజ్ఞానమే నా ఉఛ్వాస

ఐహికగత అజ్ఞానమే నా నిశ్వాస

నా ధ్యానము చెదరనీకు ప్రభో తిరుమలరాయ

ఆత్మ జ్ఞానమొసగు స్వామి నమో అచ్యుతాయ


1.పరమపదము కన్న మిన్న మరియేది వరము

నీ శ్రీపదము చెంత నున్న కలుగునా కలవరము

అనవరతం వ్రతముగా స్మరించనీ తిరునామం

అనుక్షణం దీక్షగా జపించనీ అష్టాక్షరి మంత్రం

నా ధ్యానము చెదరనీకు ప్రభో తిరుమలరాయ

ఆత్మ జ్ఞానమొసగు స్వామి నమో అచ్యుతాయ


2.తొలుత నీ సన్నిధిలో ఆత్మ పరమాత్మలం 

పరీక్షించదలచి నన్ను పడద్రోస్తివి ఈ ఇలాతలం

చెరిపివేయి మనదూరం చేర్చు స్వామి భవతీరం

సర్వస్యశరణాగతినీవే అభయకరం నీ శ్రీకరం

నా ధ్యానము చెదరనీకు ప్రభో తిరుమలరాయ

ఆత్మ జ్ఞానమొసగు స్వామి నమో అచ్యుతాయ

 రచన,స్వరకల్పన  &గానం:డా.రాఖీ


మనకు లేక వెలితితొ వెత ఒక ఎత్తు

ఎదుటివారికుంటే తెలియని బాధెందుకో కించిత్తు

అసూయకు ఆజ్యం పోస్తే మనుగడకే విపత్తు

ఈర్ష్యకంటూ చోటిస్తే భవితా బ్రతుకూ చిత్తు చిత్తు


1.సుయోధనుడి అసూయ ఫలితం కురుపాండవ సంగ్రామం

అర్జునుడి అసూయవల్ల ఏకలవ్యు అంగుళి మాయం

సత్యభామ అసూయతోనే కృష్ణ తులాభారం

అనర్థమౌ అసూయతో వ్యక్తిత్వానికి కళంకం


2.మాత్సర్యం వల్ల మనసుకంటుకుంటుంది మసి

దృక్పథాన్ని మార్చుకుంటే ఇనుమడించు పట్టుదల కసి

సకారాత్మకత మనుషులకెప్పుడు చక్కని మార్గదర్శి

తెలియకనే సదరువ్యక్తులను ఆరాధించడమే  వెరసి

Thursday, February 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హృదయంలో ఆర్ద్రత

మనసులో ప్రశాంతత

కర్మ ఎడల నిబద్ధత

ఫలితమంటే నిరాసక్తత

ఇదికదా జీవన విధానం

ఇదే సదానంద సంధానం


1.అనుభవాలు జీవితాన భాగాలై

జ్ఞాపకాలేవైనా అధర దరహాసాలై

సహానుభూతులే మానవతా వేదాలై

అనురాగం రవళించే సమైక్యతా నాదాలై

ఇదికదా జీవన విధానం

ఇదే సదానంద సంధానం


2.పాత్రకేమాత్రం అంటని పాదరసమై

 తామరపత్రాన తారాడే నీటిబిందువై

అత్తిపత్తిలాగా తాకనీక తప్పుకుంటూ

ఉల్లిపొరల బంధాలన్నీ విప్పుకుంటూ

ఇదికదా జీవన విధానం

ఇదే సదానంద సంధానం

 

సప్తగిరీశా అష్టైశ్వర్య వికాస

నవరసపోష దశవిధ వేషా

సహస్రనామ విశేషా జగదీశా

భక్తజనాకర్ష శ్రీరమణ నమోస్తు సంకర్షణ


1.అతిపవిత్రము ఇల తిరుమల క్షేత్రము

ధన్యమే మనుజజన్మ నీ దర్శన మాత్రము

దయకురిపించును నీ అర్ధనిమీలిత నేత్రము

నీ తిరునామమే పరమొసగెడి మంత్రము


2.ఆకాశ గంగ పావన కపిలతీర్థము

నిండామునుగంగ భవ పాపనాశనము

అలమేలుమంగాపట్టణ భవ్య వీక్షణము

పరిణమించు జీవితాన మోక్ష కారణము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రియాతి ప్రియమైన స్వప్నలోక సామ్రాజ్ఞికి

ఈ గీతమే ఊతమైంది నీకు రాయు ప్రేమలేఖకి

సరస హృదయ సుమకోమల భావాల నగకి

లలిత లలిత అలతి అలతి పదాలనే అతికి

నా ఎదనే అందించా నీ పాదాల ముందుంచా

సమాదరించవే అవధరించవే నను ధరించవే


1.అల్లసానివారి జిగిబిగి అల్లికను అరువు తెచ్చుకున్నాను

శ్రీనాథసార్వభౌము శృంగార రసాన్ని పుణికిపుచ్చుకున్నాను

పోతనార్యు కవన ద్రాక్షాపాకాన్ని నే గ్రోలియున్నాను

కృష్ణశాస్త్రి అనన్య  లావణ్య శైలిని ఆకళింపుగొన్నాను

నభూతో నభవిష్యతిగ ఈ ప్రణయ గీతి రాస్తున్నాను


2.హంసరాయభారమై ఆలరారును ఈ గీతము

కపోతప్రాప్త సంకేతమై నిను చేరును నా చిత్తము

కిసలయ రుచి మరిగిన పిక కూజితమీ గేయము

మేఘసందేశమై ధర వరలును సఖీ ఈ ఉత్తరము

సంపూర్తిగ కడు ఆర్తిగ నీలో లయించ నామానసము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలం సాగడం లేదు నువు వరించక

పదం పొసగడం లేదు సవరించక

నా స్ఫూర్తివి ఆర్తివి నువ్వే అది నువ్వే

 కవితకు స్ఫురణ  ప్రేరణ  నువ్వే అదినువ్వే

కనిపించవేమే కనికరించవేమే 

వివరమెరిగినాగానీ వరమీయవేమే


1.నన్ను పలకరించి ఎన్నాళ్ళైందో

మనసు పులకరించి ఎన్నేళ్ళైందో

 నీకలా ఏమాత్రం  అనిపించదా

ఎదసవ్వడి కాస్తైనా వినిపించదా

దేవతవే నీవంటే శిలలాగ మారాలా

గుండెనే అర్పిస్తే బండలాగ మార్చాలా

కనిపించవేమే కనికరించవేమే 

వివరమెరిగినాగానీ వరమీయవేమే


2.మాటలతో మభ్యపెట్టీ  నెగ్గగలరు మా'తలంతా

మౌనంతో ఉగ్గబెట్టీ గెలువగలరూ నెలతలంతా

క్రిందైనా మీదైనా చెలీ  మీదేగా మాపై పైచేయి

ముందైనా వెనుకైనామీరే పడగొట్టే గడుగ్గాయి

కాళ్ళబేరాలే మీతో మాకు పరిపాటి

యోధానుయోధులైనా రాలేరు మీకు పోటి

కనిపించవేమే కనికరించవేమే 

వివరమెరిగినాగానీ వరమీయవేమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతను:  వేచివేచి చూసే ఘడియ నిజమయ్యే దెన్నడో

ఆమె:      ఎదిరిచూసి అలసిన మనసుకు ఊరట మరి ఎప్పుడో

అతను:  ఎడబాటులోనా పెరిగేను ప్రేమా

ఆమె:      విరహాల లోనా కాగేము కామా

అతను:  కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున

ఆమె:      సమయమా కదలకుమా ప్రియుని కూడియున్న  తరుణాన


1.అతను:  ప్రతీక్షయే తీక్షణమైతే ప్రతీక్షణం అది ఒక శిక్ష

ఆమె:           నిరీక్షణకు మోక్షం లేక అనుక్షణమో అగ్నిపరీక్ష

అతను:       లక్ష్యపెట్టి ననుచేర పక్షిలాగ ఎగిరొచ్చి ఎదవాలు

ఆమె:           నీ దక్షత చూపించి  వశపరుచుకొ నా పరువాలు

అతను:       కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున

ఆమె:           సమయమా కదలకుమా ప్రియునికూడియున్న తరుణాన


2.అతను:    అర్థమే కాలేదు అందుబాటైనంత వరకు

ఆమె:             వ్యర్థమై పోనీయకు దాచిన  విలువైన నిక్కు

అతను:         దారితప్పి పోమాకే మనసా రమించక

ఆమె:             స్వర్గాన్ని చేరేదాకా శ్రమిద్దాం విరమించక

అతను:         కాలమా పరుగిడవే చెలిచెంత లేనివేళలందున

ఆమె:             సమయమా కదలకుమా ప్రియునికూడియున్న తరుణాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గురువారం గురువారం 

గురుదేవ దత్తుని ప్రియవారం

షిరిడీ సాయి దర్శనవారం

సిరులను కూర్చెడి లక్ష్మీవారం

గురురాఘవేంద్ర స్మరవారం

మనమంతా సద్గురు పరంపర పరివారం

మనసా శిరసా వచసా గురువులకిదె నమస్కారం


1.అత్రివర పుత్రుడిగా శ్రీపాద శ్రీవల్లభ మూర్తిగా

ధర గురు నరసింహ సరస్వతిగా

సాయిబాబాగా పత్రిలొ పర్తిలొ పుట్టిన అవధూతగా

గజానన మహరాజ్గా అరుణాచల రమణునిగా

అందరం గురువుల నెరిగిన వారం మనం వారి పరివారం 

మనసా శిరసా వచసా గురువులకిదె నమస్కారం


2.మంత్రాలయ దైవంగా కంచి పరమాచార్యునిగా

మెహర్బాబాగా గురునానక్ గురుగోవింద సింగ్ గా

గౌతమబుధ్ధునిగా మహావీరునిగా మహావతార్ బాబాగా

జన్మగురువులు అమ్మానాన్నలు ఉపదేశ విద్యాబోధకులుగా

తీర్చుకోలేము వారి ఋణం ఎవరం మనంవారి పరివారం

మనసా శిరసా వచసా గురువులకిదె నమస్కారం

Wednesday, February 3, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈ ఒంటి కంటి కొంటె చూపులేంటో

నీ పంటినొక్కు వెంటాడగ వలపు పిలుపులేంటో

జడుడైనా మడివీడి నీ జంటగా మారడా

మునియైనా తపముని మాని తుంటరైపోడా

కేశిని కలశస్తని తాటంకిని నితంబిని 

నెరజాణా తరళేక్షణా సరస శృంగార వీణా 


1.వాలు చూపులు ఓర చూపులు దాటేసినావే

వేలి చుట్టులు కాలి గీతలు మించిపోయావే

నర్మగర్భ ఆహ్వానాలు మాయమాయెనే

సంకేత పదబంధాలు పాతవింతలాయెనే

విప్పేయకే చప్పున ఇప్పుడే విస్మయగుప్పిటి 

ఊరించగ ఉడికించగ రాజేయవే తపనల కుంపటి


2.ఏటివంక నువ్వు రావడం నీటివంకతో

గోడ మాటు మాట కలపడం గోరువంకతో

కోవెల గంటల గణగణలో రహస్య భాషలో

కోనేటి కలువలడగడం కలువగ మిషతో

అపురూపమౌ అరుదైన ఆ విలక్షణ లక్షణాలు

అనుభూతులై ఆహ్లదమొలుకగ నిరీక్షణ క్షణాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏది కమలమో పద్మముఖీ భ్రమరానికి విభ్రమమే

ఏది ఝషమో మీనాక్షీ జాలరికీ  సంశయమే

కెంపులు వెలవెలబోయాయి నీ చెంపల సోంపు చూసి

దానిమ్మలు ఖంగుతిన్నాయి నీ దంతాల ఇంపు గాంచి

నీలవేణీ నీవంటి నాయకిలేదు ఏ కావ్యాన

ఇగురుబోణి నినుబోలిన ఇంతేలేదు లోకాన


1.పూవనమే నీ తనువు యవ్వనమే నీ ధనువు

పావనమే నీతో మనువు జీవనమే దివితావు

 అనన్యమౌను సంగమం ధన్యమౌను నీతో జన్మము

నీలవేణీ నీవంటి నాయకిలేదు ఏ కావ్యాన

ఇగురుబోణి నినుబోలిన ఇంతేలేదు లోకాన


2.ఊహలకే పరిమితము నీవేనా అభిమతము

మరిచానే నా గతము నువ్వే ఇకనా జీవితము

బ్రతుకే నీకు అంకితము నీతో భవితే కాంచనము

నీలవేణీ నీవంటి నాయకిలేదు ఏ కావ్యాన

ఇగురుబోణి నినుబోలిన ఇంతేలేదు లోకాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాఫీగ రోజుసాగాలంటే

కాఫీలు చాయలు తాగాలంతే

సూఫీ కవితలు తెలియదంటే

మాఫీ చేసేదంటూ లేనేలేదైతే

ఉత్తేజమేదో అలలెత్తుతుంది కాఫీ ఆస్వాదిస్తే

చైతన్యమేదో శివమెత్తుతుంది తేనీరు సేవిస్తే


1.సురాపానమే మానేవాళ్ళు 

అసురులు కాఫీ ఎరిగుంటే

సుధారసమునే గ్రోలకపోదురు

దివిజులు చాయను త్రాగుంటే

మైకమేదో కమ్ముతుంది కాఫీని చప్పరిస్తే

మత్తన్నదే ముంచెత్తుతుంది టీని సిప్ చేస్తే


2.తత్వాలెన్నో చెప్పేస్తారు

కాఫీని నమ్మెడి కాఫిర్లంతా

గజళ్ళనెన్నో గుప్పిస్తారు

చాయను కోరెడి షాయర్లంతా

కబుర్లకే వేదికలౌతూ కాఫీషాప్ లు

చిట్ చాట్ స్నేహపు బంధాలౌతూ టీకొట్టులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేతన జీవులు చేతన శూన్యులు

ఆ యాతన జీవులు వాస్తవ మాన్యులు

దేశానికి ఊతమై వరలే ధన్యులు

సగం జీతాన్ని జాతికి పంచే వదాన్యులు

జయహో ఆ పన్నుల వెన్నుదన్నులారా

జోహార్ బడుగు జనుల పెద్దన్నలారా


1.ధరలేమో ధరను వీడి గగనసుమాలై

నిత్యావసర వస్తువులే నింగిలొ తారలై

గుట్టుగా నెట్టుకొచ్చే కుటుంబరావులు బాహుబలులై

అప్పుకు గొప్పకు మధ్యన నలిగే అప్పుల అప్పారావులై


2.బెట్టుగ ఉట్టికి ఎగరలేక స్వర్గానికి నిచ్చెనలు

చీటికి మాటికి చీటీ పాటలె గండాలకు వంతెనలు

ఇంటినిండా విలాసాలుగా నెలసరి వాయిదాలు

మధ్యతరగతి మారాజులకు రోజూ మహా ప్రస్థానాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కూచిపూడి నర్తనమే భామా నీ కలాపం

కథాకళీ నృత్యమే పడతీ నీ తల్పవిలాపం

పేరిణీ శివతాండవే ప్రమదా నీ సంవిధానం

భరతనాట్యమే రమణీ గృహిణిగ నీ విన్యాసం


1.కస్సుబుస్సు లాడితె కలికీ ఒడిస్సీ లాస్యం

చరణాల త్వరణమె నారీ మణిపురీ విలాసం

నయనాల పంజళే నాతీ  కథక్ నృత్తము

మోహనాంగి వయ్యారాలే మోహినియాట్టం


2.పండుగ వచ్చింటే పాటలగంధీ భాంగ్రా నృత్యం

పెండ్లీపెరంటాలలో నెలతా నీనడకల  నట్టువాంగం

మొండిపట్టు సాధించే క్రమం ముదితా యక్షగానం

వండివార్చే సాధనలో వనితా అనునిత్యం గర్భానృత్యం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవంటే  ఈశ్వరా నాకెంతో ఈర్ష్యరా

నెలవంక గల శంకరా మా బ్రతుకేల వంకరా

ఇరువురు సతులతో ఇద్దరు సుతులతో

నీవైతే చల్లంగ మనరా మాకేల ఈయవా దీవెనరా

హరునివైతే నీకో ధర్మమా నరులమైతే అది మాఖర్మమా


1.తల త్రెంచుతావు మరల మొలిపించుతావు

దహియించుతావు పిదప కనిపెంచుతావు

గుంజుకుంటివైతివే మము రంజిల జేయవే

బ్రతుకులకగ్గి పెడితివే ఎదలికనైనా చల్లార్పవే

హరునివైతే నీకో ధర్మమా నరులమైతే అది మాఖర్మమా


2.బిచ్చమెచ్చి తెచ్చినా ఆకలైతె మాన్పుతావు

మంచులోనె ముంచినా  వెచ్చగ బజ్జుంచుతావు

 ఒక ముద్దైనా నోటికింక అందకుండ జేసావే

మా నిద్దురనూ  కంటలేక పారద్రోలి వేసావే

హరునివైతే నీకో ధర్మమా నరులమైతే అది మాఖర్మమా౹

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అపచారమే భవా నీ ఉనికిని ప్రశ్నిస్తే

కడుపాపమే హరా నిను నిరసిస్తే

దయ్యాలకు మాత్రం పీడించే శక్తులా

భూతాలకు సైతం వేధించే యుక్తులా

పరమాత్మవు నువులేక ప్రేతాత్మలుండునా

జగత్పితవు నీముందు పిశాచాలు మనునా


1.పూజించిన వేళలో వరములైతె ఈయవు

దూషించినంతనే శాపమేల ఇచ్చెదవు

గతజన్మల కర్మలంటు కథలెందుకు చెప్పెదవు

జగత్కర్తవీవే కద మా తప్పని నుడివెదవు

నీ నాటకాలలో బలిపశువులు మేమా

నీకేళీవిలాసాల మేమాట బొమ్మలమా


2.దుష్టుమూక తాండవించ నీవొక జడుడివా

కష్టాలలొ మముద్రోయగ నీవూ దేవుడివా

దయ్యాలను శరణంటే కాస్తైనా కనికరించు

భూతాలను బతిమాలితె జాలైనా చూపించు

నిన్నే కదాశివా భూతనాథుడంటారు వృధాగా

నిన్నే సదాశివ వైద్యనాథుడంటారు అపప్రథగా