Tuesday, June 11, 2019

విధాత సృజనలో రూపు దిద్దుకున్నాము
నీ వీణానాదములో మేధ పెంచుకొన్నాము
ఎందులకమ్మా మాలో ఈ వికృత తత్వాలు
అపశృతులేలమ్మా చెలరేగ పైశాచికత్వాలు
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి

1.మారదేమొ నుదుటిరాత మంచిగ రాయొచ్చు కదా
సత్కర్మలు చేయునట్లు నాడేసరి దిద్దొచ్చు కదా
తల్లివని నమ్మితిమి మా ఆలనచూడవే
కల్పవల్లివని వేడితిమి సన్మార్గము నడపవే
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి

2.యాచించకుండా బ్రతుకు సాగనీయవే
వంచించకుండా మాకు బుద్దిగరపవే
చదువు సంస్కారమిచ్చి మము తీర్చిదిద్దవే
అనుబంధం ఆత్మీయత మాఎదలో నాటవే
భారతీ నీకిదె ప్రణతి-మము సరిజేయగ వినతి
బీడు నేలలో మోడును నేను
తొలకరి జల్లుల పులకరమీవు
వల్లకాడులో బూడిదనేను
మృతినే తరిమే అమృతమీవు
నన్ను చిగురింప జేయవే
నాకు మరుజన్మ నీయవే

1.వసంతాలు  వాకిట్లో ఆటలాడె నాడు
ప్రభాతాలు  చీకట్లకు తావీయలేదపుడు
నరదృష్టే తాకిందో-నా విధి వక్రించిందో
పేకమేడలాగా కూలిపోయె జీవితం
శిథిమైన కోవెలలా మిగిలిపోయె నాగతం

2.అనురాగ చదరంగంలో పావునై పోయాను
చెలి ప్రేమ నాటకంలో అతిథి పాత్రనైనాను
ఎందుకు మురిపించిందో-ఎందుకు వంచించిందో
బిచ్చగాడినైనాను  బ్రతుకు ధారపోసి
పిచ్చివాడినైనాను  భవితను బలిచేసి