Wednesday, October 2, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కలుసుకుందాం కలలలోనా
ఊసులాడుకుందాం ఊహల్లోనా
కాపురముందాం కల్పనకైనా
ఉత్తుత్తి ప్రేయసీ నాకు నీవె ఊర్వసీ
తిరస్కరించలేవు నా అమర ప్రేమని

1.ఓపలేను ఎడబాటు-చేయలేను ఎదచాటు
బ్రతుకంతా ఆటుపోటు-నీవీయీ కాస్తచోటు
ఏకాకిగా మనలేను లోకానా
ఏరీతిగా గడిపేను శోకానా
ఓదార్చగా నీవు-నను చేర ఏల రావు

2.నిదురలేని రాత్రులను-కలలెలా వరించేను
కలవలేక ప్రతి క్షణము-నిన్నే కలవరించేను
నేస్తమా అందివ్వు స్నేహహస్తం
చితిచేరువరకూ నీవే నా సమస్తం
జ్ఞాపకాలు రేపేను-ఎనలేని విరహాలు

3.కదలదాయె కాలము-కవితలాయే జీవితము
మన కలయికలన్నీ మధురమైన స్వప్నాలు
తలపుల తలుపులే తీసిఉంచాను
వలపుల పరుపునే పరిచి ఉంచాను
తనువు తపన తీరాలు-తీపిగొలుపు కారాలు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:కళ్యాణి


మూలా నక్షత్ర సంజాతా శ్రీవిద్యా మాతా
మాలా సంయుక్తా పరవిద్యా పరదేవతా
లీలా విశేష విబుధ విశారదా శారదా
కైలాటము నీకిడెదను అమ్మా సదా సర్వదా

1.చదువుల తల్లివి చైతన్య వెల్లివి
అజ్ఞాన తిమిర గగన నిత్యనిండు జాబిల్లివి
శ్వేతపద్మాసనీ కచ్ఛపి వీణా ధారిణీ
సంగీత సాహితీ విజ్ఞాన రూపిణీ వాణీ

2.దండకమండల కరభూషిణి గీర్వాణీ
హంసవాహినీ మేధావిని రసనవాసిని
మంద్రస్వర నాద వాదినీ వినోదినీ
నీచరణము నెరనమ్మితి దీవించవె పారాయణి


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:నాటరాగం

సత్యవ్రత దీక్షాపరుడు-అపర హరిశ్చంద్రుడు
ధర్మాచరణలో రఘుపతి రాఘవ రాజా రాముడు
అహింసా పాలనలో గౌతమబుద్ధుడు
ఆయుధమే ధరించని అని అభినవ కృష్ణుడు
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు

1.నల్లజాతివారికి అండదండ అయినాడు
తెల్లవాడి గుండెల్లో సింహస్వప్న మైనాడు
పరమతసహనాన్ని పాటింపజేసినాడు
తరాలెన్ని మారినా తరగని చెరగని ముద్రవేసినాడు
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు

2.నభూతోన భవిష్యతి జాతిపితా బాపూజీ
సంకల్పసాధనలో ఎన్నడెరుగలేదు రాజీ
స్వరాజ్య లక్ష్యమే ఊపిరిగా సాగించెను ఉద్యమం
పరపాలన తుదముట్టించెను అస్త్రమై సత్యాగ్రహం
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు

3.ఆడంబరాలకు ఆమడదూరం కొల్లాయిధారణ
ఆభిజాత్యానికి తిరస్కారం గాంధీజీ ఆచరణ
నరజాతి చూడలేదు ఇటువంటి పుంగవుని
మూర్తీభవించిన అనుపమాన మానవతావాదిని
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:రేవతి

ఓంకార నాదాత్మిక శ్రీచక్ర పరివేష్టిత
మణిద్వీప సంశోభిత హ్రీంకార బీజాన్విత
మాతా శ్రీలలితా ప్రణతులుచేకొనవే పరదేవతా
శంకర వినుత సమ్మోహితా మునిజన సేవితా

1.పాశాంకుశ కరభూషిత అంగారిక చాపహస్త
పంచేంద్రిముల నిగ్రహించవే పద్మలోచని
సౌందర్యలహరీ త్రిమూర్తులూ నీ వలలో
త్రిభువన సుందరీ మనుజులెంత నీ మాయలో

2.సహస్ర నామ సంపూజితా చతుషష్టికళాహృతా
ముగురమ్మల మూలపుటమ్మవు నీవేగా
నిన్ను తెలియునిజ యోగులు నిఖిలజగతి కనరారు
నీదయా దృక్కులతో విశ్వమంత కడతేరు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మూసిఉంచితేనే గుప్పిటిగుట్టు
విప్పిచూపించితే ఎంతటి ఎబ్బెట్టు
అందీఅందనపుడె గుండెలకారాటము
నేలరాలు పళ్ళపట్ల ఉండదు ఉబలాటము
సౌందర్యము సాంప్రదాయము పరస్పరం శ్రేయోదాయకం
పరికిణి వోణీల తెలుగుదనం నయనానందకారకం

1.పాశ్చాత్య పోకడలు దేశీయత ముందు వెగటు
అనాఛ్ఛాద సోయగం మగటిమికే చేటు
ఉప్పువంటిదే వంటలో ఉత్సుకతను రేపడం
తగ్గినా పెరిగినా తప్పదు అబాసుపాలవడం
సౌందర్యము సాంప్రదాయము పరస్పరం శ్రేయోదాయకం
కట్టూబొట్టులతో  తెలుగుదనం నయనానందకారకం

2.జడ మెడ నడుము నడక అందాలకు నెలవులే
ఎదపై పయ్యెద మువ్వల పాదాలు సొగసుకు కొలతలే
దోబూచులాడే నాభీ ప్రకటన మగదృష్టికి సుడిగుండమేలే
క్రీగంటిచూపులు మునిపంటినవ్వులూ మంత్రదండాలే
సౌందర్యము సాంప్రదాయము పరస్పరం శ్రేయోదాయకం
చిరుబిడియపు తెలుగుదనం నయనానందకారకం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:అభేరి

బాలా త్రిపురసుందరీ భ్రామరీ
శ్రీకరీ శుభకరీ శాంకరీ అభయంకరీ
పుస్తకపాశాంకుశధరీ మస్తక వశీకరి
భైరవీ భార్గవీ శాంభవి శాకంబరీ
కరజోతలు నీకివే శర్వాణీ కర్వరీ
నా కైతలు గైకొనవే కన్యాకుమారీ

1.చండముండ సంహారీ మధుకైటభవైరీ
చాముండీ వైష్ణవీ హిండీ హైమవతీ
నగ నందిని నారాయణి కళ్యాణీ గౌరీ
మాతంగీ మాలినీ మాతా యోగీశ్వరీ
కరజోతలు నీకివే శర్వాణీ కర్వరీ
నా కైతలు గైకొనవే కన్యాకుమారీ

2. భవ్య భవతాపహారిణీ భువనేశ్వరీ
భవానీ భగవతీ మారీ మహేశ్వరీ
కాత్యాయని దాక్షాయణి పరమేశ్వరీ
జయంతీ జగజ్జనని జయజగదీశ్వరీ
కరజోతలు నీకివే శర్వాణీ కర్వరీ
నా కైతలు గైకొనవే కన్యాకుమారీ