Saturday, March 7, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జీవితం క్షణక్షణం ఒక యుద్ధం -యుద్ధం యుద్ధం యుద్ధం
తలపడుటకు కావాలి సంసిద్ధం-సిద్ధం  సిద్ధం సిద్ధం
గోటితో పోయేవాటికి గొడ్డల్ని వాడక తప్పని అగత్యం
మాటనే ఈటెలా విసరడమే బ్రతుకున అనునిత్యం
నెగ్గడమూ తల ఒగ్గడమూ తప్పవన్నదే పరమసత్యం

1.అమ్మకడుపు చించుకరావడమే ఆది పోరాటం
పరీక్షలెన్నో ఛేదించుకుంటూ గెలుపుకోసం సంస్ఫోటం
సంసారాన్ని దిద్దుకొనుటలో సదా సర్వదా సంగ్రామం
ముసలితనంలో అనాయాస మరణంకై  రోగాలతో రణం
అనితరసాధ్యము అని అనిన కలగలసిన అనుభవాల తోరణం

2.మనుగడ కోసం అడుగు అడుగనా సమాజంతో సమరం
అర్హత ఉండీ అందుకొనుటకై అవకాశాలతొ కలహం
టికెట్టు పెట్టీ సుఖపయనంకై బస్సులొ రైళ్ళో జగడం
ఓట్లను వేసీ సదుపాయాలకు ప్రభుతతోను సమితం
నీలోనీకు నీతోనీకు నిమిషంనిమిషం ఎదలో సంఘర్షణం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మధ్యమావతి

కౌసల్య పాడింది రామచంద్రునికీ లాలిపాట రామలాలి పాట
యశోద పాడింది బాలకృష్ణునికీ జోలపాట కాన్హా జోలపాట
ముక్కోటిదేవతలు మురిపెముగ పాడేరు నరసింహస్వామికి సేవపాట
 ఏకాంత సేవపాట పవళింపు సేవపాట
చిన్నారి నా కన్నా నా చిట్టి సుందర నిను నిదుర పుచ్చగ  పాడేను
రామలాలి పాట కాన్హా జోలపాట లాలిలాలి జోజో జోజో బజ్జో బేటా

1.గణపతికి పాడింది పార్వతమ్మ త్రిగుణాతీత లాలిపాట
కుమరయ్యకు పాడారు కృత్తికలంతా ప్రేమతొ లాలిపాట
అయ్యప్పకు పాడేరు స్వాములంతా హరివరాసన లాలిపాట
చిన్నారి నా కన్నా నా చిట్టి సుందర నిను నిదుర పుచ్చగ  పాడేను
రామలాలి పాట కాన్హా జోలపాట లాలిలాలి జోజో జోజో బజ్జో బేటా

2.జీజాబాయ్ పాడింది  వీరత్వమొలక శివాజీకి లాలిపాట
భువనేశ్వరి పాడింది ధీరత్వమొలక వివేకానందునికీ లాలిపాట
శారద పాడింది విశ్వశాంతి చిలుక రవీంద్రనాథునికీ లాలిపాట
చిన్నారి నా కన్నా నా చిట్టి సుందర నిను నిదుర పుచ్చగ  పాడేను
రామలాలి పాట కాన్హా జోలపాట లాలిలాలి జోజో జోజో బజ్జో బేటా