Thursday, November 7, 2019

"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స."

తెగులు తగులుకున్నది తెలుగు తల్లికి
తెల్లబోయిచూస్తున్నది కన్నవారి చేష్టలకి
పరభాషా వ్యామోహపు పైత్యములో
తెలుగుభాష చెప్పరాని దైన్యములో
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో

1.'అమ్మ'ను మమ్మీగా మార్చినపుడె తొలిగాయం
నాన్నను డాడీగా పిలిచినపుడె దయనీయం
అన్యపదము లాదరించు వైశాల్యము తెలుగుది
ఉన్నప్రథను విస్మరించు వైకల్యము తెలుగులది
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో

2.అందలాలనెక్కించి పట్టం కట్టబెడితె
ఎంతటి ధర్మమో ప్రజల మీద వాడ 'బడితె'
యథా రాజా తథా ప్రజా ఆనాటి మాట
ప్రజాశ్రేయమే కదా ప్రజాస్వామ్య ప్రగతి బాట
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శుభ పంతువరాళి

నిద్రలేని రాత్రులెన్నో నీకోసం ధారపోసా
నా మనః సాగరాన్ని ఎంతగానొ మథనం చేసా
కవనామృతభాండం కోసం అనవరతం పరితపించా
ఎంత సుధను పంచానో మోహినికే ఎరుక
నిర్లక్ష్యపు గరళాన్ని దిగమ్రింగుతు నే బ్రతికా

భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

1.కదిలించిన ప్రతివస్తువును కవితగా రాసేసా
భిన్నమైన అభిమానులకై పలువిధముల రచనలు చేసా
రంజింప జేయడమే లక్ష్యంగా నే తలపోసా
మానవతే పరమావధిగా గీతాలను నే కృతిచేసా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

2.సుందరమౌ చిత్రాలుగా నా పాటలనే మలిచా
శబ్దార్థ కౌశేయములతొ అలంకరింప జేసా
ప్రాసల పసిడి నగలతో నిన్ను తీరిచి దిద్దా
అక్షరమే దైవంగా అను నిత్యం నే కొలిచా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ