Sunday, July 28, 2019

ఎందుకు స్వామీ నీనుండి దూరంగ
నను విసిరివేసావు ఈ భువిని చేరంగ
తలపోసినావా నను నీకే భారంగ
అనాథనైతినే కరుణాంతరంగా

1.నువ్వూ నేనూ ఏకైకంగా
నీవే నాకూ ఒకలోకంగా
కాలము స్థలము కడు శూన్యంగా
ఆనందానికి విలాసంగా
గడిపితినయ్యా నీ సన్నిధిలో
తలచితి నిన్నే నా పెన్నధిగా
ఎందుకు స్వామీ నను వీడితివి
దేనికి స్వామీ నను మరచితివి

2.భవబంధాలను అంటగడితివి
సంసార జలధిలొ నను ముంచితివి
ఊపిరి ఆడక నే మునకలేస్తే
వింతగ నవ్వుతు వినోదిస్తివి
నా తప్పిదములు మన్నించవయ్యా
నా దోషములిక క్షమియించవయ్యా
 నీవేదప్ప ఇతరులనెరుగను
నిన్నే దప్ప పరులను వేడను
నీ మహిమ వినగ రిక్కించని వీనులవి ఏల
నీ మూర్తి కనగ చమరించని చక్షువులవి ఏల
నీ కీర్తి పాడగ గద్గదమవలేని గళమది ఏల
నీధ్యాసలొ రోమాంచితమవని చర్మమేల
పరమ శివా నీ వశమవని హృదయమేల
సాంబ శివా ధ్యానములో శవమవని తనువేల

1.జపతపములు చేసినా చిక్కుట దుర్లభము
యజ్ఞయాగ క్రతువులకూ దక్కదు నీ ఫలము
చిత్తశుద్ధిలేక నీ వ్రతములన్ని వ్యర్థము
ఆత్మతృప్తి కలుగని కర్మలే నిరర్థము
పరమ శివా నీ వశమవని హృదయమేల
సాంబ శివా ధ్యానములో శవమవని తనువేల

2.ఇఛ్ఛయే వీడక నీ తత్వము నెరుగుటెలా
త్యాగమే అలవడక నినుమెప్పించుటెలా
నీమాయను గ్రహియించక మత్తులోన మునిగెదము
నీ పరీక్షలే గెలువక నిన్ను శరణ మనియెదము
పరమ శివా నీ వశమవని హృదయమేల
సాంబ శివా ధ్యానములో శవమవని తనువేల