Sunday, July 21, 2019

తలకునీళ్ళోసుకున్న నీలవేణి
నా తలపులలో దూరుట ఎందుకని
కురులార బెట్టుకున్న తరుణీమణి
మరులురేప మాయజేయుటేలయని
ఎన్నివన్నెలున్నాయో నీకడ అన్నులమిన్నా
నీవెన్ని వలలు పన్నావో నీపై వలపులు గొన్నా

1.వాలుజడే కోడే త్రాచులా వయ్యారమొలుకుతుంది
మల్లెచెండే వెన్నెలమంటలా పరువాన్ని కాల్చుతుంది
అలకలో విసిరిన నీ కీల్జడ ఎంతో రుసరుసలాడుతుంది
శిరమున తురుముకున్న చూడామణి మిసమిసలాడుతుంది
ఎన్నివన్నెలున్నాయో నీకడ అన్నులమిన్నా
నీవెన్ని వలలు పన్నావో నీపై వలపులు గొన్నా

2.ముడిచిన నీ కొప్పుముడి మది చిత్తడిరేపుతోంది
చుట్టిన చేమంతి దండ ఎద తపనలు పెంచుతోంది
నుదుటిపైన ముంగురులు సింగారాలు పోతున్నయ్
పాపిట బిళ్ళ తాను సయ్యాటలాడుతోంది
ఎన్నివన్నెలున్నాయో నీకడ అన్నులమిన్నా
నీవెన్ని వలలు పన్నావో నీపై వలపులు గొన్నా




సాహిత్యం సంగీతం మేలుకలయికే గీతం
ఆత్మా పరమాత్మలాగా ఐక్యమైన బంధం
అనుభూతి అనుభవాల సారం
ఎంతగ్రోలినా తనిదీరని అమృతకాసారం

1.ఆలాపనగా అంకురిస్తుంది భావన
ఆస్వాదనలో చిగురిస్తుంది  తపన
కలమూ గళమూ పాలుపంచుకునేదీ పోటీ
నిర్ణయించ తరమా ఏదో మేటీ
అనుభూతి అనుభవాల సారం
ఎంతగ్రోలినా తనిదీరని అమృతకాసారం

2.అక్షరాలు మెదులుతాయి లయనే శ్వాసగా
పదాలు కదులుతాయి లక్ష్యందిశగా
పల్లవి అనుపల్లవి జోడుగుర్రాలుగా
చరణాలే చక్రాలై గీతరథం  ప్రగతి పథంగా
అనుభూతి అనుభవాల సారం
ఎంతగ్రోలినా తనిదీరని అమృతకాసారం

చిన్నపాటి వెన్ను చఱుపులే బలవర్ధకాలు
ఊహించని మెచ్చుకోళ్ళే ఉత్ప్రేరకాలు
ఖర్చువెచ్చమే లేని అపురూప కానుకలు
మనస్ఫూర్తి స్పందనలే ఎనలేని బహుమానాలు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు

1.ఇల్లాలి సేవలెన్నో గుర్తిస్తె పరవశాలు
వంటకాలు రుచిచూసి కీర్తిస్తే పదివేలు
కట్టుబొట్టు అందాలు చీరకట్టు చందాలు
ప్రశంసిస్తె రోజంతా స్వర్గ సౌఖ్యాలు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు

2.విద్యార్థి కృషి గమనించి గుప్పించు అభిందనలు
పరీక్షా ఫలితాల్లో జరుగుతాయి అద్భుతాలు
ఓటమి గెలుపుల్లో వెన్నంటి ఉంటె చాలు
మాయమై పోతాయి అన్ని ఆత్మహత్యలు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు

3.కవులూ కళాకారుల మనసులే సున్నితాలు
కరతాళధ్వనులే వారికి ఘనమైన సత్కారాలు
కండువా కప్పినా అదియే  కాశ్మీరుషాలు కవులకు
కవితను కొనియాడితే జ్ఞానపీఠే వారి చెవులకు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు
నువ్వే నాప్రాణం నువ్వే నా గానం
ప్రతిక్షణం నువ్వే నా జీవనం
నువ్వే నా మౌనం నువ్వే నా ధ్యానం
నువ్వేగా చెలీ నాదైనలోకం

1.ఊపిరి నిలిపే ఆక్సీజన్ నువ్వే
ఉద్వేగం నింపే చైతన్యం నువ్వే
ఊహలు గొలిపే మాధుర్యం నువ్వే
ఉల్లాసం పెంచే ప్రేరణ నువ్వే నువ్వే

2.కలనూ వదలని కవనం నువ్వే
నా తొలిచూపు ప్రణయం నువ్వే
జన్మలు వీడని బంధం నువ్వే
జగమే ఎరుగని సత్యం నువ్వే