Saturday, August 15, 2020


కొండమీద వెదికాను-కోనలోన శోధించాను
గుడిలోను బడిలోను గాలించినాను
కనుగొంటినీ నీ ఆచూకిని-నా గుండెలో నీ ఉనికిని
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి

1.నా గళమే నీ ఆసనమై-నా కలమే నీ వాహనమై
నా భావం నీ సంభవమై- నా వర్ణం నీ రూపమై-
వరలుతున్నావే వరవీణా మృదుపాణీ
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి

2.నా ఊపిరి నీ అస్తిత్వం-నా తపనే నీ తత్వం
 నా నివేదనే రాగమై -నా సాధన నీ యోగమై
చెలఁగుతున్నావే సామప్రియా సరస్వతీ
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

బొమ్మ ఏకాంతం బొరుసే ఒంటరితనం
ద్వంద్వకోణాలున్నదే అద్వైతమనే నాణెం
సాహసమే ఒక్కమాటలో వేదాంతాన్ని నిర్వచించడం
కొదవేలేని తెగువే ఒక పాటలో యోగవాశిస్టం బోధించడం

1.కమలం దైవం భ్రమరం నేనై
పరిభ్రమించే పరిక్రియా విశేషంలో
తపించి రమించి తరించగా
త్వమేవాహమై ఉదయింతుగా

2.యోగ సాధనే తగు మార్గంకాగా
రుచులారు ఋతువులారు వైరులార్గుని జయించి
షడ్చచక్రాలనధిగమించి సహస్రారాన్ని ఛేదించగా
లయమై అక్షరమైన కైవల్యమందుగా

3.ఒక నేనను నేనే ఇల అన్నినేనులై
భావించే ఆత్మజ్ఞాన శోధనలో
కర్తా కర్మా క్రియా నేనైన తరుణాన
విశ్వం సహా సోహమై భాసింతుగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నేస్తమా నేస్తమా నీకిదే శుభరాత్రి
కొనసాగనీ కలకాలమిక మన మైత్రి
చికాకులే కాకులై అరచి గీపెట్టాయేమో
లోకులతో వేగలేకా అలసి పోయావేమో
ముంచుకొచ్చే నిద్రనే ఆదరించినావా
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా

1.కనుపాపలు ఊయలలూపగ
కనురెప్పలు నిను జోకొట్టగ
వేధించే వేదనలే వదిలించుకొంటూ
సాధించే వత్తిడులే తొలగించుకొంటూ
తీరని నీ ఆరాటాలు మానుకొనినావ
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా

2.పీడకలలు రాకూడదనీ
నిద్రాభంగం కలగకూడదని
ముక్కోటి దేవుళ్ళ వేడుకొంటూ
మధురస్మృతులు నెమరేసుకొంటూ
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా
ఆనందాల దీవులనే చేరుకొన్నావా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

పథకాలు వేయాలి
ప్రణాళికలు రచియించాలి
పతాక స్థాయిలో మనదేశం
పతకాలు సాధించాలి
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం

1.ప్రోత్సాహం కరువైన క్రీడాకారులు
ఉత్సాహం మరుపైన ప్రభుత్వతీరులు
నిబద్ధతే కొరవడిన శిక్షణా సంస్థలు
నిలకడలేని అర్హతలేని ప్రశిక్షకులు
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం

2.బాల్యం నుండే శ్రద్దాసక్తులు
తల్లిదండ్రుల తగు ఆపేక్షలు
గెలుపోటముల సమభావనలు
వెనకడుగేయక సాధనలు
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

(జడి)వాన జల్లు పడుతోంది
నా ఒళ్ళు జిల్లు జిల్లంటోంది
ఈదురుగాలి వీస్తోంది
ఎదఎదో ఆదరువు కోరుతోంది
నులివెచ్చని చెలికౌగిలిలో వేవేల స్వర్గాలు
బొందితో దివినే చేరగ సంగమాలె మార్గాలు

1.ఎంతమంది పొందగలరు-పొందులోని మకరందాలు
ఎవరెవరు దర్శించారో-మదనాంతర మందిరాలు
ప్రదక్షిణలు చేసేలోగా సొమ్మసిల్లురెందరో
గర్భగుడిని చేరేలోగా అలసిపోదురెందరో
జేగంటకొట్టాలి హారతి చేపట్టాలి
దైవమనుగ్రహించాకే ప్రసాదాన్ని గ్రోలాలి

2.ముడుపు కట్టిన ముద్దులే-సమర్పించుకోవాలి
గుసగుసగా సుద్దులతో -అభినుతించి తీరాలి
నివేదించ ఆత్రమేల పత్రమో పుష్పమో
వల్లించాలి స్తోత్రమో మహా మంత్రపుష్పమో
పవిత్రంగ నిర్వర్తించగ రతి ముగితి ఏకమే
తనువులే వివశమైతే తాదాత్మ్యమే,సాలోక్యమే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రపంచమే తలవంచదా
మనుజాళియే కీర్తించదా
భారతీయులది ఒకే మాటగా
భరతావనిదిక ప్రగతిబాటగా
మన ఉత్పత్తులు ఉన్నతమవగా
మన మేధావులు ఉత్తములవగా
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం

1.మాదకద్రవ్యం ఊసే ఎరగక
నిరుద్యోగమను మాటే లేకా
ఏదో ఒక పని పోషించేదిగ
అద్భుతాలనే సాధించేదిగ
మన యవశక్తే నిరంతరం తలంచగా
ఉత్పాదకతను అనవరతం పెంచగా
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం

2.ఆత్మహత్యల జోలే లేకా
రైతులు జగతికి ఆకలి తీర్చగ
సేద్యం ప్రభుత ప్రాథమ్యం కాగా
మన వస్తువులే జనులు వాడగా
జాతీయతనే సర్వులకు ఊపిరవ్వాలి
భారతదేశం నాదేనంటూ గర్వంగా నవ్వాలి
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం
నీ అందం ఎంతటిదో నా కన్నులనడుగు
నీ రూపం గొప్పదనం నా చూపులే తెలుపు
నా మనసుకొకటే తెలుసు నీ కున్న మంచితనం
నా అనుభవానికే ఎరుక నీలోని మానవత
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం

1.విచలితమై పోతావే అన్నార్తులనే గాంచి
నీ కళ్ళు చమరించేనే అనాథలను పరికించి
తినబోయే ఆహారాన్ని క్షుదార్తులకు పంచేస్తావు
మరులుగొన్న చీరలు సైతం అభాగినులకందిస్తావు
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం

2.ప్రతివారిని పలకరించే స్నేహగుణం నీకుంది
ఆశించక సాయం చేసే దయాహృదయమే నీది
నిను మెచ్చుకోవారు ఇల లోన లేనేలేరు
నను నచ్చినావంటే నాకన్న శ్రీలుడు లేడు
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం