Friday, August 7, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:శివరంజని

నిలువు నామాలు నీకా
పంగనామాలు మాకా
అంగలార్చినా బెంగతీర్చవాయే
నంగనాచిలా సంగతెరిగినా ఆర్చవాయే
రంగరంగ  వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో

1.మా ఆర్తనాదాలే నీకు సుప్రభాతాలు
మా అశ్రుధారలతో  నిత్యాభిషేకాలు
మా దైన్య వీక్షణలే నీకు పుష్పార్చనలు
ఎనలేని వేదనలే మేమొసగే నివేదనలు
రంగరంగ  వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో

2.కొడిగట్టిన మాఆశలు నీకు నీరాజనాలు
మా తపనల తలపులే మంత్రపుష్పాలు
భవిష్యత్తు మృగ్యమైన మాబ్రతుకే కైంకర్యం
పునః పునః ప్రస్తావన నీకు పునః పూజనం
రంగరంగ  వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో

రాగం:తోడి

హరుడవే-గౌరీమనోహరుడవే
మనోహరహరుడవే-త్రిపురాసుర సంహరుడవే
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
శంభుడవే- సాంబసదా శివుడవే
నిజభక్తవ శంకరుడవే-రాజరాజేశ్వరి వరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

1.అనునిత్యం కన్నీటితొ నీ అభిషేకం
ఎలాసాధ్యమనేనా తీర్చవు మా శోకం
అనుక్షణం తప్పమునీ నామస్మరణం
ఇడుముల నిడుటకు అదేనా కారణం
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

2.త్రయంబకం యజామహే మహామంత్రము
మాకు వర్తించుటలో ఏలనీ కుతంత్రము
నమఃశివాయ పంచాక్షరి కైవల్యదాయకం
ఎంతవల్లించినా మాకౌనా నిరర్థకం
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ