Monday, August 9, 2021


నా తనువే వేణువు శృతిచేయరా మురళీధరా

నా మనసే స్థాణువు కరిగించరా కరుణాకరా

ఎన్నో జన్మలుగా వేచివేచిచూస్తున్నా 

రాగాలు మరచిపోయి రాటుదేలి నేనున్నా


1.వెన్నలాంటి నాహృదయమాయె పాషాణం

కొడిగట్టిపోతోంది నీ స్మరణలొ నా ప్రాణం

జాలిమాని మనకురా జాగుసేయబోకురా

మరుభూమిగ మారింది మరుల బృందావని

కన్నీరు మున్నీరాయే కన్నయ్య కోసమని


2.పశువును నా మతిజూడ  పాలించు గోపతి

వశపడకున్నది ఉడికించకు నను యదుపతి

శరణుజొచ్చినానురా శకటాసుర సంహారా

అక్కున జేర్చుకో  అమరేంద్ర వినుతా

గ్రక్కున బ్రోవర నను గజేంద్ర సన్నుతా


శిరోజాలకే  పోలిక  మేఘమాలిక

నక్షత్రమయ్యింది నీకు ముక్కుపుడక 

మీనాలు నయనాలై వదన సరోవరాన

నోరూరే చెర్రీలే నీ మధుర అధరాన

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు


1.సిగ్గులు నిగ్గుదేల కెంపులాయే నీ చెంపలు

సమీరాలు సయ్యాడగ చెలగే నీ ముంగురులు

ముద్దరాల ముద్దాడగ నా తపనలే పరితపించు

జవరాల నిను స్పృశించ నా తనువే పరవశించు

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు


2.ఏన్ని జన్మలెత్తినా  నీ కొరకే పుట్టాలి

తపస్సు చేసైనా తప్పక నీచేయిపట్టాలి

మూడుముళ్ళు వేసిమరీ నీ జత కట్టాలి

నీఅడుగు కందిపోకుండా అరచేతులు పెట్టాలి

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు