Tuesday, November 3, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీదీ నాదీ ఒకటే భావం

నీకూనాకూ ఎపుడూ స్నేహం

అనుభవాలు కూర్చాయి అనుబంధం

అనుభూతులు చల్లాయి మైత్రీగంధం


1.నింగీనేలా గాలీనీరూ మనకొకటే తీరు

వేసవి వేడి  జాబిలి వెన్నెలా మనపై సమంగ జారు

భరించారు ఒకేలా మీ అమ్మా మా అమ్మా ప్రసవ వేదన

 ఊపిరి శ్రుతిగా లబ్ డబ్ లయగా మనం బ్రతుకు పాట సాధన


2.మనసు నీదిగా మాటనాదిగా నా కవిత

గీతం నాదైనా నీ ఎదలోనిదే నా భావుకత

ఇనుమునైన నన్ను పసిడిగ మార్చే పరసువేది నీవు

 నిమిత్తమాత్ర పాత్ర నేనై నీవే ఆవాహనమైనావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఫేస్ బుక్కు కంటె నీ ఫేసిష్టం

వాట్సప్ కంటె నీ వలపిష్టం

ట్విట్టర్ కంటె నీ టెక్కిష్టం

టెలిగ్రాంకంటెనీ అనుగ్రహమిష్టం

సోషల్ మీడియాలొ మునిగతేలుతున్నా

అన్నీ నీకొరకే ప్రియతమా ఆత్రంగా వాడుతున్నా


1.గుడ్మాణింగ్ పిక్స్ కొరకు రాత్రంతా గూగులించి

నువు నిద్ర లేవక ముందే పోస్టుల్ని చల్లుతున్నా

మనుముందుగ నేనే  నిన్ను పలకరించాలని

మెసెంజర్కు వాట్సప్పుకు పరుగులు పెడుతున్నా

నువు తుమ్మినా దగ్గినా నీ ప్రతి స్టేటస్ కు

లైక్ లు కామెంట్లు మిస్సైపోకుండా కుమ్మరిస్తున్నా


2.తప్పులతడకల రాతల్నీ వంకర టింకర నీసెల్ఫీన్నీ

ఫ్రెండ్సందరికీ షేర్ చేస్తు వార్నీ షేర్చేయమంటున్నా

నీ కాకమ్మ కబుర్ల యూట్యూబ్ ఛానల్ ఫాలోయింగ్ కు

ప్రమోటర్ నేనై సబ్ సబ్ స్క్రై బ్ కోసం చాటింపు వేస్తున్నా

ఇన్నివిధాల నా యత్నాలన్నీ నిన్నింప్రెస్ చేయడానికే

నేను తీసుకున్న క్రెడిట్ డెబిట్ కార్డులన్ని నీకోసమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాభికాదు రసికుల మది రెచ్చగొట్టేది

అరవిరిసిన నవ్వులే  చిచ్చుపెట్టేది

నడుంకాదు సరసులనిల మాయచేసేది

అర్ధనిమీలిత నేత్రాలే వలవిసిరేది

పరచిన అందమెపుడు ఉత్తేజపరచదు

విప్పిన యే గుప్పిటి ఉత్సుకతే రేపదు


1.నునుసిగ్గుల లేలేత చెంపలు దింపేను ముగ్గులోకి

నగవులతో జతకట్టిన బుగ్గసొట్టలు లాగేను రగ్గులోకి

అచ్చికబుచ్చిక పలుకుల సమాయత్తమే రస రమ్యము

సురుచిర సుకుమార  శృంగార సంగరమే కడు భవ్యము


2.పయోధరాలదేముంది మధురాధరాలదే అలజడి

ముందువెనక తపనల తడితడి ఎద తనువుల సందడి

రసనలు రచించే వైవిధ్య కావ్యాలే చిరస్మరణీయము

హరివిల్లుగ చెఱకువిల్లు వన్నెలొలుకబోయ రమణీయము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సముద్రాలు ఏడన్నది ఎవరు?

కడలికి కడ ఉందన్నదెవరు?

ప్రతి నయనం ఒక అశ్రు సంద్రం

ప్రతి హృదయం వేదనా సాగరం

తీరంచేరని అలలే నెరవేరని కలలు

బడబానలం అంతరంగాన దాచుకున్న తరంగాలు


1.నిశీధిఅగాధాంబుధిలో ఎడతెగకుంది త్రోవ

జలధినధిగమించగ  పెదాలచిరునగవే నావ

మింగజూచే తిమింగలాలే నిరాశా నిస్పృహ

నింగికెగయు కెరటాలే ఆశా మధురోహ

తీరంచేరని అలలే నెరవేరని కలలు

బడబానలం అంతరంగాన దాచుకున్న తరంగాలు


2.ఎవరోమరి చేరేరు సుందరమౌ దీవులు

ఎవరికో లభించేను ముత్యాలు పగడాలు

బ్రతుకు జీవుడా అంటూ ఒడ్డున పడితేచాలు

గట్టెక్కితే చాలు నిత్యం ఎదురయ్యే గండాలు

తీరంచేరని అలలే నెరవేరని కలలు

బడబానలం అంతరంగాన దాచుకున్న తరంగాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పక్షపాతి భారతి ప్రియపతి - నీ ఎడల నిరుపమ లేమ

నాల్గుమతుల తులనం చేసి -సృజించాడు నినుఆ బ్రహ్మ

అందంమంత కుప్పగపోసి-అందజేసె సుందరినీకు

ఆనందాన్ని సేకరించి-ధారబోసె హాసిని నీకు


1.మేలైన మీనాలే  నీ నయనాలకు అచ్చెరువొందు

దొండపండ్లుగా  నీపెదవులగని రైతులే భ్రాంతి చెందు

నవ్వుల్లొ రాలుతుంది నాగమల్లి పూలజల్లు

చూపుల్లొ విరుస్తుంది అబ్బురాల హరివిల్లు


2.నిను తిరిగి చూడకుంటే మదికి అవకరమేదో

నిను చూసి చలించకుంటే ఆరోగ్య  లోపమేదో 

పడతులెవరైనా ఇలలో ప్రస్తుతించగలరే నిన్ను

ప్రవరాఖ్యుడైనా సరే పాదాక్రాంతుడవునే నమ్ము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:తిలాంగ్


విరమింపజేయి శివా నా జీవితాన్ని

తెఱనికవేసేయి ఈశ్వరా నాటకానికి

చరమగీతమే పాడవోయి నా బ్రతుకునకు

పరమ పదమందించవోయి ఈ నా జన్మకి


1.జన్మకు ఒకసార్థకతే శంకరా లేదాయే

బ్రతుకున కొక  సాఫల్యతే హరా కరువాయే 

ఆనందం ఆచూకే  ఏచోటా కానరాదాయే

మధురానుభూతులే ఏనాడైనా మరీచికలాయే


2.పాటుపడలేదేనాడూ పరమేశా పరులకోసము

బావుకున్నదంటు లేదాయే గౌరీశా నాకోసమూ

ఎందుకు పుట్టించావో నిటలాక్షా నీకెరుకేనా

వృధాగా సృజించబోకు నీలకంఠ  ఎవ్వరినైనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రేమించిందా రమణి రాధిక

కోపించిందా కలికి కాళిక

జీవితాలు వెలిగించే దివ్య దీపిక

మగవాడి మనుగడకు స్ఫూర్తిదాయక


1.మనసైన రాముడికి మలయవీచిక

దశకంఠ దనుజులకు అందని మరీచిక

జ్వాలనే శీతల పరిచే శీల సూచిక

తరతరాల తరింపజేసే ఆదర్శ సంచిక


2.కాలానికి కట్టుబడింది పంచభతృక

పరాభవం సైచింది నిండైన ఓపిక

పంతమే పూనింది యజ్ఞపుత్రిక

కురుక్షేత్ర రణానికి ప్రారంభ గీతిక


చిత్రాలు: Sri. Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పదాలకెంత ఉత్సుకత

నీ అందాలు ప్రస్తుతించ

పెదాలకెంత ఆతురత

నీ అధరామృతం ఆస్వాదించ

చెలీ నువులేక జగమంత శూన్యమే

చెలీ నువువినా బ్రతుకెంత దైన్యమే


1.శ్రీగంధకలప తోనే చెక్కాను కలము చెక్కణాల

కస్తూరి పరిమళాలే కలిపాను సిరా గుభాళింపగ

ఎదలోని అపురూప భావ సంచయం క్రోడీకరించా

సృష్టిలో నీకు నీవె సాటియనగ అపూర్వంగ ప్రవచించా

చెలీ నిను పొగడక కవనం శూన్యమే

చెలీ నిను పొందక జీవనం దైన్యమే


2.క్షీరసాగరం లోని పాలరుచి బాగాతెలుసు

రేపల్లె గొల్లవాడలో వెన్నకమ్మదనమూ ఎరుకే

తేనెపట్టులోని మధువుతీయదనం అనుభవమే

నీచుంబన రసమే పాలువెన్నతేనెల సంగమమే

చెలీ నీ కలయిక  రసరమ్యమే

చెలీ నీ ఎడబాటిక  విషతుల్యమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా తనువే మోహన మురళి

వెదురేల బెదురేల పలికించ రసరవళి

నా మనసే నవనీత కబళి

దోచనేల దాచనైతి గ్రహించ నా సరళి

కన్నెముద్దులు వెన్నముద్దలు నీకే నైవేద్యం

నీరాసకేళి ఎంతోహృద్యం అనుభవైకవేద్యం


1.నవరంద్రకాయమందు ఒలికించు నవరసాలు

అష్టాంగయోగముతో కదిలించు కుండలినీమూలాలు

సప్తచక్రాలతో సిద్ధింపజేయి అలౌకికానందాలు

షడ్రిపులను దునుమాడి తెరిపించు మోక్షద్వారాలు


2.పాంచభౌతిక దేహం నీ పరమే చేసితిని

పురుషార్థ చతుర్థ్యాల నిను నెరనమ్మితిని

గుణత్రయాలనే నీవాక్రమించ స్వామీ వేడితిని

ద్వైతభావరహితమై నీవూనేనేకమై రమించితిని