Sunday, October 4, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


కునుకు దోచుకెళ్ళావే కువలయాక్షి

అబ్బా ఎదకొల్లగొట్టావే గుమ్మా మదిరాక్షి

ఆయుధాలెన్నె నీకు అన్నులమిన్న

వ్యూహాలూ చాలాచాలా వాల్గంటి బాల


1.నల్లనాగులాంటి జడ నాగాస్త్రము

మోమున వంకీలజుట్టు వాయువ్యాస్త్రము

చుబుకాన పుట్టుమచ్చ సమ్మోహనాస్త్రము

పెదవులఅరుణిమే పాశుపత అస్త్రము


2.శంఖమంటి కంఠమే వరుణాస్త్రము

బిగువగు ఎడదనీకు బ్రహ్మాస్త్రము

నడుము వంపేమో ఆగ్నేయాస్త్రము

నాభికింక తిరుగులేదు నారాయణాస్త్రము

Ok

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రేమ కుదిరితే కలయే సఫలం

ప్రేమ చెదిరితే మనసే వికలం

ప్రేమే మనిషికి దేవుడిచ్చిన వరం

ప్రేమించు ప్రేమను పంచు నిరంతరం


1.ప్రేమించడానికి ఒక సాకు అందం

ప్రేమ గ్రుడ్డిదన్నదే అనాది వాదం

కులమతాలు గుణగణాలు కావు ఆటంకం

ఆస్తులు అంతస్తులు ప్రేమముందు పిపీలికం


2.బంధాలన్నీ దిగదుడుపే ప్రేమముందు

విశ్వాసమొక్కటే పరస్పర ప్రేమకు మందు

సర్దుకుంటు మనగలిగితే బ్రతుకు నిత్యవిందు

విశ్వజనీనమైన ప్రేమ మానవత్వమే అందు

 రచన,స్వరకల్పన&గానం:డా రాఖీ


రాగం:శివరంజని


జ్ఞాపకాలే మధురంమధురం

తీపైతే కల వరం చేదైతే కలవరం

అలనాటి చిననాటి ఆ జీవనం

ఇరుకైనా సంబరం కొఱతైనా నిబ్బరం


1.ఎవరికైనా బాల్యం అమూల్యం

అనుభూతులైతే సర్వం అపూర్వం

ఆ ఆటపాటలు ఆ బడి పాఠాలు

చిన్నారి స్నేహాలు చిరకాల మోహాలు

ఉమ్మడిగా కొనాసాగే బంగారు కుటుంబాలు


2.పండగలు పబ్బాలు ఏటా జాతరలు

పెండ్లీ పేరంటాలు ఊరంతా సందళ్ళు

వారాంతపు సంతలో సరకుల కొనుగోళ్ళు

బంధుమిత్ర బృందాలతొ కళలొలికే లోగిళ్ళు

అనుబంధం ఆప్యాయత చెరగని ఆనవాళ్ళు


3.వేసవి సెలవులకు తాతగార్ల ఊళ్ళకి

సరదా గొడవలే బావలు మరదళ్ళకి

అమ్మమ్మలు కొసరిపెట్టు పెరుగు మీగడలు

ఆరుబయట పడకలు మోచేతులె తలగడలు

కన్నీళ్ళు చిప్పిల్లిగ పొలిమేరలొ వీడుకోళ్ళు




https://youtu.be/nxLdlc3XbUY?si=sxrgDBKKs_DsYlEL

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


ఏ జన్మలొ ఏ పాపము చేశానో

నీ పూజలొ ఏ లోపము చేశానో

చేసితివే నాకింతటి ఘోర అన్యాయము

గళమధురిమ నొసగక కడు ద్రోహము

భారతీ నీకిది తగునా తల్లీ 

నన్నిలా నొప్పించగ కల్పవల్లీ


1.ప్రాధేయ పడుదుచుందునెందరో గాయకశ్రేష్ఠులను

బ్రతిమాలుచుందును మధురగాయనీమణులను

కాదుపొమ్మన్నా కాళ్ళవెళ్ళ పడుకుంటూ

త్రోసిరాజన్నా సదా దేబిరించుకుంటూ

పరుల ఎడల చింతించగ ఏమి లాభము

తీయని గొంతీయని నీది కదా దోషము


2.సైంధవుడివంటి కఫమె నా గొంతుకు శాపము

ఊటగ ఊరేటి లాలాజలమే గానమునకు దైన్యము

సాధన సాగినా బ్రతుకంతా సరిపోదు

ఓషధి వాడినా స్వరమెంతకు సరికాదు

మాధుర్యమెట్లుతేనే నువువరమిస్తేనే

చచ్చిమళ్ళిపుడితేనే కంఠమొలుకు తేనే

https://youtu.be/TS-MI4_fT3Q?si=3tnKIN-dNERectcB

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :కానడ

నీ తలపుల లహరిలో తానమాడనీ
నీ మురళీరవములో మునిగితేలనీ
మోసితివట గోవర్ధన పర్వతం
భరించగా నీతరమా నాఎదభారం
మోహనకృష్ణా వంశీకృష్ణా రాధాకృష్ణా 

1.నా మనమే యమునాతీరం
నేను కనే స్వప్నమే బృందావనం
ఉఛ్వాసనిశ్వాస మలయసమీరం
సదానేను సిద్ధమే ఏల తాత్సారం
నీకృపతో ఏదైనా సులభసాధ్యం
మోహనకృష్ణా వంశీకృష్ణా రాధాకృష్ణా

2.నా స్వేదమే నీకు కస్తూరి పన్నీరు
నా అధరాలు నీకు వెన్నా జున్నులతీరు 
పయోధరాలు నీకు పాలకుండలు
హస్తయుగళమే నీగళమున పూలదండలు
రమించరా విరమించక యుగయుగాలు
మోహనకృష్ణా వంశీకృష్ణా రాధాకృష్ణా


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాగిపోతుందిలే ఈ సమయం

గడిచిపోతుంది ఈ సందర్భం

ఆగిపోతుందీ ఘోర సంపాతం

మానిపోతుందీ తీవ్ర సంఘాతం


1.దాటలేద గతమందు ఒడిదుడుకులు ఎన్నెన్నో

అధిగమించలేదా నాడూ గడ్డుసమస్యలేవేవో

ఉండిపోదు కాళరాత్రి ఉషోదయం తథ్యం

శిశిరమే సుస్థిరమా ఏతెంచు నవ వసంతం


2.రెప్పపాటె కాదా కడుగొప్పదైన జీవితం

అందరికీ అవసరమే అనుష్ఠాన వేదాంతం

కాల గతికి మనం అవ్వాలి సాక్షీభూతం

జగన్నాటకంలో మన నటనం పాత్రోచితం

 

https://youtu.be/d5wfundpzL8

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


ఎందరు ఏలారో భక్తి సామ్రాజ్యం

ఎందరు పొందారో నిత్యసాయుజ్యం

శ్రీహరీ నీ నామామృతమే గ్రోలి

నరహరీ నీ దివ్య పదముల వ్రాలి


1.కోరినదొసగే చింతామణివే

బలి కడ నువు చేయి సాచితివే

భవజలధి దాటించే సరంగువే

గుహుని సాయాన నది దాటితివే

 భాగ్యమెంతటిదో నీ భక్తులది

పుణ్యమెంతటిదొ జీవన్ముక్తులది


2.వసుధను మోసే వరాహమూర్తివే

అల వసుదేవుడే నిను తలనిడెనే

జగతినాక్రమించిన త్రివిక్రమ శక్తివే

మారుతి ఉరమున కొలువైతివే

 భాగ్యమెంతటిదో నీ భక్తులది

పుణ్యమెంతటిదొ జీవన్ముక్తులది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తేనెల నదిలో తానమాడుతున్నా

మంజులస్వనిలో పరవశించిపోతున్నా

ఆనందపు క్షణాలలో మేను మరచిపోతున్నా

నన్ను నేను చదువుకుంటూ సేదతీరుతున్నా

ఇంతకన్న ఏంకావాలి నేస్తం

స్నేహానికి నీవె సరియగు అర్థం


1.ఎడారిలో పిపాసికి సరస్సు మైత్రి

తపననెరిగి తీర్చేను దాహార్తి

బహుదూరపు బాటసారికి బాసట దోస్తీ

చితిని చేరేవరకూ పరస్పరం అనురక్తి

ఇంతకన్న ఏంకావాలి నేస్తం

స్నేహానికి నీవె సరియగు అర్థం


2.సజీవంగ కనిపించే అద్దం స్నేహితం

తీర్చిదిద్దుకోగలిగే అపురూప సాధనం

తప్పుదోవ తప్పించే దిక్సూచి సోపతి

ఆపతిలో తోడుండే నీడే సహవసతి

ఇంతకన్న ఏంకావాలి నేస్తం

స్నేహానికి నీవె సరియగు అర్థం