Thursday, April 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాధ బాధనెరిగితిని

ఆ బాధనే నే మరిగితిని

శ్యామసుందరుని సన్నధికఱుగని

నందనందనుని కౌగిట కరుగని

బ్రతుకే శూన్యమనీ కడు దైన్యమని


1.అందింతును నాడెందము నవనీతముగా

నివేదింతును నా సర్వము  కృష్ణార్పణముగా

నా పెదవులనే మురళిగ వాయించుమనెద

నా మేని మెరుపులు పింఛముగా తలదాల్చమనెద

ప్రార్థించెదన నే పదదాసిగ అర్థించెద నే ఆశగ


2.బాలకృష్ణుని పాలుచేసెద నాక్షీరభాండాలను

మోహనకృష్ణుని పడక చేసెద నా దేహభాగాలను

రతికేళి సలుపగ సతతము నా మతిలోను

సద్గతులేవొ చేరెద సత్యము శివము సుందర స్థితిలోను

ధ్యానించెద లయమై తన్మయమై ఆనంద నిలయమై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పనికి పోక పోతె నేమో పస్తులాయే

పనికి పోవు తెగువజేస్తే కరోనా కాటాయే

దినదిన గడం నూరేళ్ళ బ్రతుకాయే

పొరపాటు ఎవరిదైనా ప్రాణానికి వేటాయే

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు


1.మాస్క్ తో మూస్కున్నా ముక్కూమూతిని

సానిటైజర్ తో పదేపదే కడుక్కున్నా  చేతిని

రోగాల పాలవడమే బయటి తిళ్ళన్ని తిని

కరోనాకు బలియవడమె తిరుగుళ్ళు తిరిగితిరిగి

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు


2. క్లబ్బులు పబ్బులు వదిలించవ డబ్బులు

పెండిండ్లు సినీహాళ్ళు అంటించగ జబ్బులు

ఎలక్షన్లు మీటింగులు పెట్టగ పెడబొబ్బలు

పండుగలు పబ్బాలు ఆరోగ్యానికే దెబ్బలు

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు


3.ప్రభుత్వాలు చేతులెత్తె తోచినంత చేసి

ప్రజలేమో విధిలేక బ్రతుకు తెరువు మానేసి

ఆస్పత్రులు ఎంతగవీలైతే అంతా దోచేసి

మందులు టీకాలకు బ్లాక్మార్కెట్ రాజేసీ

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు

 

https://youtu.be/evUHLQslWDw?si=Oo3Zm_g0VaTeQ5PF

#EarthDay2021  శుభాకాంక్షలతో


రచన,స్వరకల్పన&గానం:రాఖీ


చల్లని తల్లి మన పుడమి

జీవులకే కల్పవల్లి మన భూమి

విశ్వంలో జలరాశి కలిగినదై

ప్రాణవాయు ఉనికికి ఆలవాలమై

కారణభూతమైంది మానవ మనుగడకు

ఆరాధ్య యోగ్యమైంది యుగయుగాలకు


1.వరాహస్వామి కావ ఇల్లాలుగ మారింది

సీతమ్మ తల్లికే తను జనని అయ్యింది

సూర్యమండలానికే తలమానిక మైనది

నరసంచారమున్న ఏకైక గ్రహమిది

కారణభూతమైంది మానవ మనుగడకు

ఆరాధ్య యోగ్యమైంది యుగయుగాలకు


2.వృక్షజాతి వ్రేళ్ళూనగ ఆధారభూతమైంది

పంటలనందించే మనిషికలల పంటైంది

ప్రకృతినంత సమతుల్యత నొనరింపజేస్తుంది

పర్యావరణం పాడైతే నొచ్చుకుంటుంది

కారణభూతమైంది మానవ మనుగడకు

ఆరాధ్య యోగ్యమైంది యుగయుగాలకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


మొఱనాలించరా, పరిపాలించరా

చెఱవిడిపించరా, దరి చేర్పించరా

రఘుపతి ఎదగల మా మారుతి

గొనుమిదె ప్రణతి వినుమిదె వినతి

నువు తలుచుకుంటే కానిదియేది

నువు కరుణజూడగ బ్రతుకే పెన్నిధి


1.బ్రహ్మ రూపుడవు శివాంశయేనీవు

విష్ణుతేజమును దాల్చినవాడవు

వేదవేదాంగ పారంగతుడవు

సంగీత శాస్త్రాన ఘనకోవిదుడవు

నువు తలుచుకుంటే కానిదియేది

నువు కరుణజూడగ బ్రతుకే పెన్నిధి


2.జితేంద్రియుడవు దివ్యదేహుడవు

మహాబలుడవు దనుజాంతకుడవు

రోమరోమమున రామ ధ్యానమే

భక్తుల ఎడ నీకు కడు వాత్సల్యమే

సంజీవరాయా నీ దయతొ స్వాస్థ్యము

చిరంజీవా చిదానందా నీవే నీవే శరణము

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


"జనులకు శుభకామనలు-రాముని శుభ దీవెనలు"


ధర్మానికి నిలువెత్తు రూపంగా

వెలిసాడు శ్రీరాముడు హైందవ దీపంగా

సహనానికి సరికొత్త భాష్యంగా

అవతరించె సీతమ్మ ఉత్తమ సాధ్విగా

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభ దీవెనలు


1.పితృవాక్య పరిపాలన కర్తవ్యమన్నాడు

సార్వభౌమత్వాన్ని తృణంగా గణించాడు

వనవాసమైనా శిరోధార్యమన్నాడు

 ఆలితో అడుగులేసి మాటచాటుకున్నాడు

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభదీవెనలు


2.సౌమిత్రి తోడుగ పర్ణశాల వసించాడు

మాయలేడి యని ఎరిగీ సీతకోర్కె వహించాడు

వైదేహి ఎడబాటులో  పరితాపం చెందాడు

జానకి జాడకొరకు హనుమను పంపాడు

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభదీవెనలు


3.లక్ష్మణున్ని బ్రతికించగ సంజీవని తెచ్చె హనుమ

అక్కున జేర్చెను మారుతిని రాముని ప్రేమ

దశకంఠుని దునుమాడెను రామబాణ గరిమ

ప్రకటితమాయే పట్టాభి రాముని ప్రజారాజ్య పటిమ

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభదీవెనలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:వసంత


పరమ దయాళా పరమ శివా

సరగున నను పరిపాలించవా

నా ఉరమున ప్రియముగ కేళించవా

నీ కుమరునిగా నను లాలించవా

శంభో మహాదేవ గంగాధరా

సాంబమూర్తీ సాగిలపడెదర 


1.నీవే ఇచ్చిన ఈ జన్మము

నీవే మలచిన నా జీవితం

నీకొఱకే…హరా… నా దేహము ప్రాణము

ఉఛ్వాస నిశ్వాసలందున నీ స్మరణము

శంభో మహాదేవ గంగాధరా 

తీరగ నా ఆర్తి కావర వేగిర


2.ఐశ్వర్యమాశించ ఆరోగ్యమీయర

ఆస్తులుకోరను స్వస్థత కూర్చర

పదవుల నడగను నీ పదముల దయసేయ

యశమును కొసరను నువు వశమవగ

శంభో మహాదేవ గంగాధరా

కైవల్యమీయర కైలాసపురహరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


రాబోయే రోజులైతె అతిదారుణం

కరోనా మరణాలిక సాధారణం

మనుషుల పెడ చెవిన పెట్టు దుర్గుణం

నరజాతికి పాడుతుంది చరమగీతం


1.జబ్బు అంటుకోకుండుటె అదృష్టం

వైద్యసేవలందబోవు నన్నదే సుస్పష్టం

పరిమితమౌ ఆస్పత్రులు మనపాలిటి దురదృష్టం

ఆక్సీజన్ గాలికైన నోచుకోక ఎంతటి కష్టం


2.ఉధృతంగ చేస్తోంది కరోనా కరాళనృత్యం

నేనైతే అతీతుణ్ణి అన్నదే మన పైత్యం

అజాగ్రత్త మనుజల స్వీయమైన అకృత్యం

ఏ ఒక్కరు పాటించక  నరకమే ఇక నిత్యం


3.తను మినహా పరుల చావు మామూలై

వ్యాధివల్ల బాధవల్ల బతుక్కన్న చావే మేలై

శ్మశానాల్లొ శవాలదిబ్బలు అనాథలై

కడతేరక కళేబరాలు రాబందుల పాలై


4.టీకామందె ఇప్పటికొకటే ఉపశమనం 

మాస్క్ లు ముక్కు మూయ కడు శ్రేయం

ఒక్క క్షణం ఒక్క తప్పిదం చావుకు మూల్యం

సానిటైజర్ వాడుక భౌతిక దూరమిక అనివార్యం