Tuesday, December 20, 2022

 

https://youtu.be/aD7a9UPeZjM?si=a7bXqvKvSysB7gnM

28) గోదాదేవి ఇరవై ఎనిమిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:కళ్యాణి


దయనే కురిసేటి కన్నులతోటి మము కన్నయ్యా

గోకులమంతా మురిసేటి వెన్నలాంటి మనసున్నయ్యా

నందకిషోరా నవనీతచోరా రేపల్లె అల్లరి నల్లనయ్యీ

గొల్లభామల ఉల్లములే కొల్లగొట్టిన కొంటె కిట్టయ్యా

నీ చెలులము నిను చనువుగా ముద్దుపేర్ల పిలిచేము

అలుగక చెలఁగక అడిగినవొసగి నెరవేర్చు మా నోము


1.పశువుల కాపరులము ఐనా నీకు కాముపరులము

అన్నెం పున్నెం ఎరుగని అన్నుల మిన్నలం గోపకన్నెలం

అమాయకపు భామలం మోహన కృష్ణా నీ మాయకు అధీనులం

త్రికరణ శుద్ధిగా ప్రభూ నిన్ను మాత్రమే నమ్ముకున్న దీనులం


2.నీ పదధూళితో పునీతమైంది మా గోకులమంతా

ఏ సంచిత కర్మతోనో గడిచింది బ్రతుకంతా నీ చెంత

ధన్యమాయే మాజన్మ నీవల్ల తొలగేను మా యే చింత

ప్రసాదించు స్వామి పురుషార్థాలను హే అనంతా


https://youtu.be/pJeoIwrJ8PI?si=Qe3P0C1fuGRMeyw3

 27) గోదాదేవి ఇరవై ఏడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:హిందోళం


వాంఛితార్థ దాయకా-యదుకుల దీపకా

మాధవా కేశవా గోవిందా మనసిజ జనకా

కరివరదా వరములీయి కనికరముతొ మాకికా

వ్రత ఫలమును అందీయవొ జాగు సేయకా


1.సామగ్రీయుటె కాదు స్వామి తీర్చాలి మా కోరిక

లోకులంత చకితులై చూడగ మానోము వేడుక

రవ్వల గాజులు మువ్వల పట్టీలు చెవికమ్మలు

కంకణాలు కేణీలు మాకొసగుము పసిడి నగలు


2.పట్టుచీరలేకట్టి నగలన్ని మా మేన దిగబెట్టి

పరమాన్నము వండి పెట్టి నీకు నైవేద్యమెట్టి

జుర్రాలి పాయసాన్ని కమ్మని నేయిని కలిపిపెట్టి

ప్రసాదించు ఈ రీతి నోముఫలము జగజ్జెట్టీ

 

https://youtu.be/x-s9SF70vbs?si=5FqyMjNvqoLoKzW3

26) గోదాదేవి ఇరవై ఆరవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:అమృత వర్షిణి


నిమిత్తమాత్రులమే మేము శ్యామసుందరా

నీ ప్రేమ పాత్రులమే ప్రభూ ప్రేమ మందిరా

కర్తా కర్మ క్రియా సర్వం నీవే ఆశ్రిత వరదా మాధవా

మనసా వాచా కర్మణా నిను నమ్మితిమి ఆపద్బాంధవా


1.వ్రతాచరణలో అర్చనకై వలయు సరంజామా

అమర్చవయ్యా తగువిధి నీ కరుణే మాకు ధీమా

శంఖము ఢంకా గంటలు తప్పెట తాళవాద్యాలు

మంగళ మాణిక్యాలు ధ్వజారోహణకై పతాకాలు


2.మంగళా శాసన పరులు ఆచార్య భూసురులు

నీ ధ్యానమగ్నులు నిత్యాగ్నిహోత్రులు యాజ్ఞికులు

నిష్ఠతో చేసేము కృష్ణా తిరుప్పావై వ్రతాచరణ రీతులు

సిద్ధింపజేయవయ్యా దయతో నీవు వ్రత ఫలశ్రుతులు