Wednesday, November 18, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓసాయీ శ్రీసాయీ-నీ రూపాలే మా మదిలో వెలిసాయి

ఓసాయీ మా సాయీ-నీ  కన్నుల వెన్నెలలో మా బ్రతుకులు తడిసాయి

ఓ సాయీ ఓ సాయీ-నీ వాదుకొంటావని మా మనసులు వేచి చూసాయి

ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి

సాయీ  సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ


1.సాయీ నీవున్న చోటల్లా హాయే హాయీ

హాయి ఉన్నచోటల్లా అది నీ కృపవల్లనేనోయీ

తెలవారునా కలతీరునా ఈ మా కష్టాల రేయీ

తినునంతలోనే జరిగింది ఏమో చేదాయెగా బ్రతుకు మిఠాయి

ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి

సాయీ  సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ


2.వక్రంగ మారే మా నుదుటిగీత మరి మరి మార్చి రాయీ

నవనీతమైన నీ హృదయమేల అయ్యింది బండరాయి

అర్థాంతరంగా ఐనా సరే మా నాటిక తెరదించవోయి

ఏ నాటికైనా మా నాటికైతే వైరులకైనా వలదింక వలదోయి

ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి

సాయీ  సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ

 (అంతర్జాతీయ మగమహారాజుల వేడుక జరుపుకుంటున్న సాటి పురుష పుంగవులందరికీ)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మన ప్రమేయమే లేనిది పుట్టుక

చేసుకోలేము నచ్చినట్టు ఎంపిక

తీర్చిదిద్దుకున్నప్పుడె బ్రతుకు సార్థకం

విచక్షణే శిక్షణైతె వికాసమే బహుమానం

శుభాకాంక్షలివేనీకు పుట్టిన రోజున

ఆచితూచి అడుగేస్తూ సాగు ప్రగతి పథాన


1.విద్య వినయము శీలము సంస్కారము

మనని మనం చెక్కుకొనగ భవిత భవ్య శిల్పము

కన్నవారి ఎడల కలిగితీరాలి మమతానురాగము

పరుల పట్ల చూపగలగాలి  సౌహార్ద్రతా భావము

శుభాకాంక్షలివేనీకు పుట్టిన రోజున

ఆచితూచి అడుగేస్తూ సాగు ప్రగతి పథాన


2.మానవీయ విలువలతో మనం మనగలగాలి

దానము పరోపకారము కాస్తైనా అలవడాలి

జీవకారుణ్యమే దయమీరగా కనబరచాలి

విశ్వజనీనమైన ప్రేమ జగమంతా పంచాలి

శుభాకాంక్షలివేనీకు పుట్టిన రోజున

ఆచితూచి అడుగేస్తూ సాగు ప్రగతి పథాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరణించే పనిలేదు భౌతికంగా

చావుని తలపోసినా అంతే నైతికంగా

జీవశ్చవాలుగా సాగేటి జీవితాలెన్నో

నరకమే మేలని భావించే బ్రతుకులెన్నో


1.చెప్పుకోలేని తీవ్ర మనోవేదన

తప్పుకోలేని బాధ్యతల యాతన

ఎప్పటికీ ఆరిపోని గుండెమంటలు

ఉప్పెనలా ముంచెత్తే అశ్రుధారలు


2.ఎంత ఈదినా ఒడవని జలధి

ఎంత వేచినా లేదాయె వెతలకు సమాధి

మృతి కొకపర్యాయమే జ్వలించే చితి

అనుక్షణం మరణంతో బ్రతుకంతా హారతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మూసిన కనుతెరవగ హామీ లేదు

ఈ రాతిరి తెలవారగ ఊహే లేదు

అందుకే అందుకో నేస్తమా ఈ శుభరాత్రి పలకరింత

చివరి పలుకు నీతోగనక మిత్రమా ఎద పులకరింత


1.శుభోదయంతొ మొదలైంది ఈ రోజు

కొత్తదనం లేకుంటే ప్రతిరోజో రివాజు

మంచిచెడుల వేసుకోవాలిపుడు బేరీజు

అంటుకుంటె దులపాలి చింతల బూజు

ఉన్నతికీ అధోగతికి నీకు నీవె తరాజు


2.పరిపక్వత చెందాలి నిన్నకు నేటికీ

ప్రగతిని సాధించాలి దీక్షగ ముమ్మాటికీ

గతపు రథం ఎక్కితే భవిత పథం చేరలేవు

నిశ్చింతగ గడిపితే ఇపుడే ఆనందతావు

కంటినిండ కునుకు పడితె కలలరేవు చేరేవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరెలా మరుమల్లెవై విరియకుంటే

తమరిలా చిరుజల్లులా తడపకుంటే

ప్రేరణ లేక నేను కవిగ శూన్యమే

స్ఫూర్తిని కానకుంటె కవిత మృగ్యమే


నను చంపివేయకే కనిపించక

నా కొంప దీయకే మురిపించక

దుంపతెంచబోకే కవ్వించక

నట్టేట ముంచబోకే దాటించక


1.నీ ఊహ మెదిలితే కలం కదులుతుంది

నీ భావన కలిగితే అది కవితౌతుంది

నీ తలపు రేగితే గీతమై వెలుస్తుంది

కలలోకి వస్తెచాలు కావ్యమే మొలుస్తుంది


2.క్రీగంట చూసినా ఒళ్ళుపులకరిస్తుంది

కాసింత నవ్వితివా ఎదలయ హెచ్చుతుంది

పట్టించుకుంటివా పట్టరానిరానందం

ప్రశంసించ బూనితివా  కవనసంద్రం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కస్తూరి పరిమళం ప్రియతమా నువ్వు

సిరిమల్లెల  ఘుమఘుమే నీ నవ్వు

కేసరి కమ్మదనమే నీ మానసం

జవ్వాజి సౌరభం నీ అనురాగం


1.యాలకులకున్న పసి నీ పలుకులు 

   మొగిలి పొదల వేదు నీ జిలుగులు 

   శ్రీచందన గంధాలు నీ పరువాలు

  పారిజాత నెత్తావులు ప్రణయాలు


2.మట్టివాసనే నీ సహజ సౌందర్యం

  మంచినెయ్యి గుభాళింపు నీతో నెయ్యం

 చంపకపుష్పాల వలపు నీ వలపు

 మరువపు నిగ్గారు నీతో పొందు పొందు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరవింద నీ వదనం నెఱి యందము

అరవిరిసిన అధరాల్లో మకరందము

ఓరకంటి చూపుల్లో కవ్వింతల వింతలే

దోరదోర బుగ్గల్లో సిగ్గుల పులకింతలే


1.నుదుటన మెరిసింది పావన సింధూరం

పాపిటి బిళ్ళతో ఇనుమడించె సౌందర్యం

మిసమిసలు ఎన్నెన్నో నీ పసిడి మేనులో

గుసగుసల జూకాలే మిడిసేను నీ వీనుల్లో


2.కృష్ణగంగయై దూకే నీ కురుల జలపాతం

అలవోకగ స్పృశించే చిలిపి మలయమారుతం

నీ హావభావాల్లో ఆనంద నందనం

నీ స్నేహ కవనాల్లో అనురాగ చందనం