Sunday, July 19, 2009

పూర్ణ చంద్ర బింబమా- దివ్య పారిజాతమా
ఏదైన గాని నీకు సాటిరాదులే సుమా

1. నాజూకు నడుము నీకు- సన్నజాజి కానుకా
ఇంపైన నాసిక నీది- సంపెంగ పోలికా
దొండపండు నీ పెదవితో- పోటీకై నిలిచేనా
దబ్బపండు నీమేని ఛాయతో- పందెం లో నెగ్గేనా

2. మీనాలే నీ నయనాలై- మిలమిలమిల మెరిసేనా
కెంపులన్ని నీ చెంపల్లో- తళుకులెన్నొ ఒలికేనా
చక్కనైన నీ పలువరుసల్లో- దానిమ్మలు దాగున్నాయా
గాలికి చెలరేగే కురులే- మేఘాలను తలపించేనా

3. ఊర్వశీ మేనకలు- దిగదుడుపే నీ ముందు
వరూధినీ వర్ణన సైతం- సరిపోదని నేనందు
జగన్మోహినైనా నీవే- భువన సుందరైనా నీవే
కనీ వినీ ఎన్నడెరుగనీ- సౌందర్య దేవత నీవే

4. నీ నవ్వులోనా -నందివర్దనాలు
నీ నడకలో కాళీయ మర్దనాలు
నీ చూపులేనా ప్రేమప్రవర్దనాలు
నీ తలపులే నాకానందవర్దనాలు
పాడినవారిని కాపాడుమాత
వేడినవారికి అభయ ప్రదాత
జ్ఞానదాయిని గాయత్రి మాత
అందుకోవమ్మ మా చేజోత

1. సావిత్రి సరస్వతి యుత నామత్రయి
ప్రాతరపరాహ్ణసంధ్యా కాలత్రయి
సత్వరజస్తమో గుణత్రయి
అకార ఉకార మకార మాత్రత్రయి

2. చతుర్వింశతి వర్ణ స్వరూపిణి
పంచ భూత సంజాత బ్రాహ్మిణి(ప్రథమ సప్త మాతృక )
అరిషడ్వర్గ నిశ్శేష సంహారిణి
సప్త వ్యసన సమూల నివారిణి

3. అష్టకష్ట విశిష్ట వినాశిని
నవగ్రహ దోష పీడా హారిణి
దశభుజి దశవిధ ఆయుధ ధారిణి

సచ్చిదానంద దాయిని మోక్ష ప్రదాయిని
మంచితనం రుచిమరిగితె మరువలేమురా
మానవత్వ విలువెరిగితె వదలలేమురా
దానగుణం అలవడితే చింతదూరమగునురా
ప్రేమైక జీవనమే సచ్చిదానందమురా

గెలుపు గుఱ్ఱమెక్కితే మడమతిప్పలేమురా
పనిలో తలమునకలైతె పరవశాలె సోదరా
నీడనిచ్చు గూడును కాపాడుకోవాలిరా
కన్నతల్లి ఋణము కాస్తైన తీర్చుకోవాలిర

ఎదుటివారి మనసునెరిగి మసలుకోవాలిర
నాణానికి అటువైపును లెక్కతీసుకోవాలిర
నీవు కోరుకునే ప్రతిది ఇతరులు ఆశించేరుర
వారిస్థానమందు నిలిచి నిన్నూహించుకోర

లోటుపాట్లు అగచాట్లు అన్నిట ఉంటాయిరా
పొరపాట్లు గ్రహపాట్లు ఎదురౌతుంటాయిరా
అధిగమించి సాగు నీవు ఆత్మవిశ్వాసముతొ
చేరగలవు ఒకనాటికి మహితాత్ముల మధ్యలో
ఎవరిదారి వారు చూసుకొంటారు
నట్టడవిలోనే నిన్నొదిలి వెళతారు
బేలగా దిక్కులు చూస్తున్నా
తాబేలులా అడుగులు వేస్తున్నా
తొలగిపోబోదు నీ దైన్యము
నువు చేరలేవు ఏ గమ్యము
1. లోకమే పాఠశాలగా లౌక్యాన్ని నేర్చుకో
అనుభవాల గుణపాఠాలతొ భవిత తీర్చి దిద్దుకో
అతిగా నువు ఆశిస్తే దొరికేది ఆశాభంగం
ప్రతి ఫలితం స్వీకరిస్తే బ్రతుకంతా ఆనందం
2. నీతోటి ఎప్పుడూ ఉండేది నీవు మాత్రమే
బంధువులు స్నేహితులు రంగస్థల పాత్రలే
తామరాకుపై నీటిబొట్టు కావాలి నీ నైజం
శాంతి సంతోషాలతో సాగాలీ జీవితం