Tuesday, May 12, 2020

అలనాటి రాణీ పద్మినివో
అల్లసాని వరూధినివో
రవివర్మ చిత్రాల భామినివో
రామప్పగుడిలోని నాగినివో

1.రంభను తలదన్ను మంజులవో
పలువిరుల రమణీయ మంజరివో
పరువాల నిధులున్న మంజూషవో
రవళించు మనోజ్ఞ మంజీరమువో

2.లలితకళలకు నెలవేనీవో
కళాకారులు కాంచు కలవో
కలహంస నడకల హొయలే నీవో
కలవరమొందగ నా ఎద లయవో

ఎప్పుడూ జగడమే నీకురులతో
తప్పవే తిప్పలు నీ ముంగురులతో
ముద్దాడబోగా అవి ముందే తయారు
సంధిచేసుకుంటేనే నా ముచ్చట తీరు

1.కవ్విస్తూ కయ్యానికి కాలుదువ్వు నీకళ్ళు
ఊరిస్తూ పోరుసలుపు నీ నునుపు చెక్కిళ్ళు
పెదాలతో సర్వదా యుద్ధాలే నాకు
చుబుకానికి లోకువే పుణికి పుచ్చుకున్నందుకు

2.చూపులే అస్త్రాలు నవ్వులే శస్త్రాలు
నన్ను లోబరచుకొనగ నీకెన్ని ఆయుధాలు
సరసాల్లో సమరాలు ఇరువురికీ విజయాలు
ఓడినా గెలిచినా ఒకే తీరు తీయని ఫలితాలు
అద్దానికి చెప్పనేల సుద్దులన్నీ
అధరాన దాచనేల ముద్దులన్నీ
ఎడబాటు బాటలో ఎన్నాళ్ళీ నిరీక్షణ
తడబాటు చాటున ప్రేమకే పరీక్షనా

1.ఋతువులెన్నొ వేచేను కోయిల ఆమనికై
మబ్బులకై తపించేను మయూరమే విరహిణియై
ప్రతీక్షించు చకోరమే ప్రసరించే కౌముదికై
ఎదిరిచూచు గోరింక చిలకమ్మతొ చేరికకై

2.రాధకెంత బాధనో మాధవుని రాకకై
మీరాకెంత తపననో గోవిందుని పొందుటకై
నది పరుగులు పెడుతుంది కడలి సంగమానికై
మది గుబులే తీరకుంది చెలీనీ కలయికకై