Saturday, March 20, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కడ నీకు నొప్పైనా

కలుక్కుమంటుంది నా గుండె

ఏ మాత్రం నీకు బాధైనా

నలిగిపోతుంది నా మెదడె

ప్రియా నీవూ నేనూ వేరువేరా

ఏనాడో నేను నీవుగా పూర్తిగా మారా


1.గరికమీదనీవు నడవగా నొచ్చే

నీపాదాలకా, అదినా ఎదకుగుచ్చే

బొడ్డుమల్లె నీపైన రాలిపడ్డ నొప్పే

ఇంకా మానలేదు నా నెత్తిబొప్పే

ప్రియా నీవూ నేనూ వేరువేరా

ఏనాడో నేను నీవుగా పూర్తిగా మారా


2.సీతాకోకచిలుక నీ పెదాల వాలి

చేసినగాయాలు నాకెపుడు మాయాలి

సూర్యరశ్మి పడినంత నీ మేను కమిలే

రగిలెనా కన్నుల్లో కన్నీటి మంటలే

ప్రియా నీవూ నేనూ వేరువేరా

ఏనాడో నేను నీవుగా పూర్తిగా మారా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విశ్వసించెద మిమ్ము అశ్వినీ దేవతలారా

నా మనోవాక్కాయకర్మల ద్వారా

నమస్కరించెద తథాస్తు దేవతలారా

ఆయురారోగ్యములందించే విధాతలారా


1.రవిఛాయా పుత్రులై ఆవిర్భవించినారు

ఉషాదేవినే సోదరిగా బడసియున్నారు

హిరణ్యావర్తారద విహారమొనరించెదరు

సంధ్యాసమయమందు వ్యాహళికేగుదురు

మంచిని తలచడమే వాంఛించియున్నారు

సద్భావననే సర్వదా స్మరించమన్నారు


2.ఆయుర్వేదానికే అధిష్ఠాన దేవతలు

వ్యాధిపీడితుల పాలిటి జీవన వరదాతలు

సాధువర్తనులు మీరు దయాహృదయ సంపన్నులు

ఆపన్నుల ఆర్తితీర్చు కరుణా సముద్రులు

నా కుమరుని నయము జేయ ప్రాధేయ పడుచుంటిని

అన్యధానాస్తి తమేవ శరణమని విన్నవించుచుంటిని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెనెంతొ కెలికెనే కలికీ నీ కులుకులు

ఉండబట్టకుంటినే నీతో కలుప పలుకులు

మరణమేకాస్త మేలు నిను పొందనినాడు

స్వర్గమేనేల వాలు నీవుంటె తోడు నీతోడు


1.ఆగమంటె ఆగలేను మరుజన్మదాకా

అరక్షణమూ వేగలేను నిన్ను చూడకా

 చేరరావు నిను చూస్తుంటే ఆకలీదప్పికా

నిదురపారిపోతుంది రెప్పైనా వాలకా


2.ఇల కాంతలెవరు తూగరు నీకాలిగోటికి

గంధర్వకన్యలైన రారు నీతో పోటీకి

అప్సరసలు దిగదుడుపే నీసాటి పాటనకి

నా పుట్టి ముంచావే అందంగా పుట్టి నీ పాటికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేంకట నారాయణా నమో

దివ్యాలంకార భూషణా ప్రభో

శంఖచక్రగదాపద్మ చతుర్భుజ ధారణ

ఆశ్రితజన సంరక్షణ మునిజనవందిత చరణ


1.కుతూహలమున్నది నిను వర్ణించగా

తాహత్తు తగకున్నది నీ భక్తకవిగా

రాసేదెవరైనా రాయించుకొనుట నీ పని

అక్షరాలనావహించ నే నిమిత్తమాత్రుణ్ణి


2. నీవె నిండినావు నా మానసమంతా

పదములు పునీతమాయె నీ పదముల చెంత

నీదే ఇక భారమంటి నా కేలస్వామీ చింత

అనంతపద్మనాభా కనికరించు రవ్వంత