Sunday, May 3, 2020

మాతృదేవోభవ అన్నది అక్షర సత్యం
అమ్మ అనురాగం అనుభవైక వేద్యం
ఎంత పేద తల్లికైన కొడుకే యువరాజు
కొడుకు కడుపు నిండితేనె తనకు నిదుర రోజు

1.ఢిల్లీకి రాజైనా  తల్లికి ప్రణమిల్లేను
కొడుకు ఎంత దుడుకైనా అమ్మ ఆదరించేను
జగన్మిథ్య అమ్మ సత్యం తత్వమిదియేను
ముదిమివయసున అమ్మసేవయె తృప్తినొసగేను

2.పులకరించు అమ్మహృదయం పలకరిస్తేనూ
కనులనిండును బాష్పకణములు ఎదుటకొస్తేను
కన్నప్రేగు కాంక్షించును కొడుకు కుశలము
అమ్మ ఎదలయ పలవరించు కొడుకు విజయము
మొదటి కంటి చూపుతానె అమ్మా
మొట్టమొదటి నేస్తమే అమ్మా
        మొదట నేర్చుకున్న మాట అమ్మా
ఆ అమ్మఋణం తీర్చుకొనగ సరిపోదు జన్మ
ఈజన్మ మరియే జన్మ||

ఊయలగా మార్చింది ఒడినే
సవారికై నిలిపింది తన మెడనే
అంటనీయలేదునా కాలికి తడినే
ఇంటికే తెచ్చింది   తొలి గురువై బడినే-నేర్పింది బ్రతుకు   ఒరవడినే

లాలిపాటలోని హాయి అమ్మా
గోరుముద్ద కమ్మదనం అమ్మా
ముద్దాడే తీయదనం అమ్మా
కనిపెంచే అనురాగం అమ్మా-కనిపించే ఆ దైవం అమ్మా

అ అంటే అమ్మతో విద్యకు శ్రీ కారం
ఏచిన్ననొప్పైనా అమ్మా అని పలవరం
ఎంతవారికైనా అమ్మే ఒక వరం
కలవరించినా అమ్మ కలవరం-నా బాగే అమ్మకో కల-వరం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

( చి॥ ఏ. మనోజ్ఞకు అంకితం)
రాగం:షణ్ముఖ ప్రియ

నటరాజ పుత్రీ అభినవ అభినయ అభినేత్రీ
నీ పదము కదలాడ మురిసెను జనని ధరిత్రీ
ఆంగిక వాచిక భావోద్వేగాల నటనా వైచిత్రీ
భరతముని వరమునుగొని వరలెడి చంచలగాత్రీ

1.తాళము చెవిబడిన తాళదు నీతనువు
జతులకు గతులకు వెలయు ఇంద్రధనువు
మనోజ్ఞమౌ నీ నాట్య భంగిమ నయన మనోహరము
రసజ్ఞులౌ ప్రేక్షక జనులకు హృదయానందకరము

2.నృత్యరీతులేవైననూ దాసోహములే నీకు
లాస్యమన్నది పాదాక్రాంతమే నీ ఆకాంక్షకు
హరిణేక్షణలే నృత్తము నందున నీ నేత్రాలు
మయూరములే నేర్చుకొనును నీకడ పాఠాలు