Sunday, July 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జన్మనే వరమిచ్చిన మముగన్నతల్లీ

నీ జన్మదినము ఈనాడే మా కల్పవల్లి

సంబరమే చేసెదము మేము సంతసిల్లి

దీవెనలందెదము నీ పదముల ప్రణమిల్లి

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


1.నాన్నకు తగు ఇల్లాలిగ మన్నలే పొందావు

కన్న మా ఏడుగురిని కనుపాపగ సాకావు

అత్తింటికి పుట్టింటికి పెద్ద దిక్కువైనావు

చెల్లెళ్ళను కోడళ్ళను ఆదరణతొ చూసావు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


2.ఇంటికెవరు వచ్చినా కడుపునింపి పంపావు

కమ్మనైన రుచులతో తృప్తిదీర పెట్టావు

ఎవరికైనా సాయపడి రెక్కలరగ దీసావు

అన్నపూర్ణవై అతిథుల మతులలో నిలిచావు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


3.తీరలేని వెతలున్నా నవ్వెన్నడు చెరగలేదు

ఎంతకష్టమెదురైనా నీ ధైర్యం సడలలేదు

నిన్ను తలచుకుంటే నిరాశే దరికిరాదు

సవాళ్ళనే ఎదుర్కొనగ నీ తెగువకు సరిలేదు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీరెండలో మెరిసే అపరంజి గులాబీ

నా గుండె తహతహలాడే ఆరెంజి జిలేబీ

రోజూ చూడాలనిపించే రోజా పువ్వు నువ్వు

నోరూరించి మనసునుదోచే మడత  కాజానువ్వు


1.గాలి మోసుకొస్తుంది నీ మేని పరిమళం

మబ్బు చిలకరిస్తుంది నీ హృదయ మర్మం

నది కౌగిలిస్తుంది నీ ప్రతినిధిగా నా దేహం

చెట్టు సేదతీరుస్తుంది నీకు మారు అంగాంగం


2.వెలవెలబోతుంది సూర్యరశ్మి నీ ముందు

తళతళ విద్యుల్లత నిను గని వగచెందు

ఇంద్రధనసు కన్నా నీ వన్నెలె కనువిందు

నీ ఊహ మెదిలినంత మదికెంతో పసందు

 రచన,స్వరల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారమతి


హరి వేంకట నారాయణా

సిరివల్లభా కమలనాభా

కరుణాభరణా  దీనావనా

పరిపరి విధములుగా నిను నుతియింతును

మరిమరి నీ చరణములే నే శరణందును 


1. కరినైనా కానైతిని సరగున నను బ్రోవగా

బలినైనా అవకపోతిని నీపదమే తలనిడగా

రాయిగా పడివున్నా  తాకాలని నీ అడుగు

వెదురునై  ఒదిగున్నా చేరాలని నీ మోవి

పరిపరి విధములుగా నిను నే కోరెదను

త్వరపడి నీ పదములనే నేనిక చేరెదను


2.నీ గుడి గంటనై నిన్నంటెద సవ్వడిగా

అఖండ దీపమునై వెలిగెద గర్భగుడిన

తులసీదళ మాలనై అలరింతును నీ మెడన

చక్కెర పొంగళినేనై స్థిరపడెదను నీ కడుపున

పరిపరి విధములుగా చేసెద నీ సేవలు

నీ సన్నిధిలో మనుటకు ఎన్నెన్ని స్వామి త్రోవలు