Monday, July 15, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా జీవితమొకవైపు
నా తనయుడి మనుగడ ఒకవైపు
బదులుగా ఏదైనా నానుండి తీసుకో
నా సుతుని భారమింక నువు చూసుకో
ఓ విశ్వకవి మిత్రుడా ఓ విచిత్ర చిత్రకారుడా

1.జన్మలే దాటివచ్చే కర్మలను పరిమార్చు
ఈజన్మలొ చేసినట్టి దోషాల తెగటార్చు
అనుభవించితీరాలంటే ఖాతాను నాకు మార్చు
శిక్షనే ఖరారు చేస్తే అది నాకే జతకూర్చు
ఓ న్యాయమూర్తీ విశ్వచక్రవర్తీ

2.ఇంద్రియాలు నీవశమై ఇకనైనా సాగనీ
నీ ఇంద్రజాలాలు మాపైన ఆగనీ
ఆడిఆడిమేమెంతో అలసిపోయనాము స్వామీ
విసుగూ విరామమే నాకథలో లేదా ఏమీ
నటన సూత్రధారీ ఓ ధర్మాధికారీ

3.దారి తప్పువేళలో నీదరికి మము జేర్చు
మాచీకటి బ్రతుకుల్లో వెలుగుపూలు పూయించు
మానవతా విలువలను మనిషిమనిషిలోన పెంచు
ప్రేమానురాగాలు మాకింక బోధించు
ఓ సద్గురునాథా జగద్గురుదేవా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

బ్రతుకు భారమై-ముదిమి నేరమై
చేయిసాచలేక-ప్రేమనోచలేక
ఆత్మాభిమానమే ఆభరణమై
దినం దినం అనుక్షణం  రణమై

1.రెక్కల కష్టాన్నే నమ్ముకొని
చిక్కులనెన్నో దాటుకొని
బాధ్యతలన్నీ నెరవేర్చుకొని
చరమాంకానా విశ్రాంతి కోరుకొని
బడుగుజీవి మనుగడ తృణమై

2.ఎండావానలకు ఓర్చుకొని
గుండెను బండగా మార్చుకొని
బంధాల గుణపాఠం నేర్చుకొని
చేసిన పొదుపూ చేజార్చుకొని
జీవితాంతం సాంతం మరణమై
అది తెలుసు ఇది తెలుసు
అది ఇది ఏలా అన్నీ తెలుసు
ఉన్నది తెలుసు లేనిది తెలుసు
ఉండీలేనిది ఏదో తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు

1.మనసొకటుందని మరిమరి తెలుసు
మనిషీ మనసూ  వేరని తెలుసు
మనసులేని మనుషులు తెలుసు
మనిషిలేక మనలేక ఏమనలేక
మనసు దుర్గతి తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు

2.ప్రేమ సంగతి పూర్తిగ తెలుసు
ప్రేమ అంటెనే ఆర్తిగ తెలుసు
ఆకర్షించే అయస్కాంతం ప్రేమని తెలుసు
త్యాగం భోగం మధ్యన ఊగే
లోలకం ప్రేమని తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు

3.దైవం ఏమిటోతెలుసు
నమ్మిక అంటేను తెలుసు
నమ్మితేనే దైవమని తెలుసు
దైవం దర్పణమని తెలుసు
ఆత్మసమర్పణే ఆతత్వమని తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు