Tuesday, May 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉషస్సులో రవి బింబం

నిశీధిలో శశి బింబం

సుందరమేనీ ముఖారవిందం

తొలిచూపులోనే వేసింది బంధం

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


1.నీ వాల్జడలో పూలమాలను నేనై

నీ పాపిట మెరిసే సిందూరము నేనై

నుదుటన వెలిగే తిలకము నేనై

నీ చెవులకు ఊగేటి జూకాలు నేనై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


2.నీ సోగ కన్నులకు కాటుక నేనై

సంపంగినాసికకూ ముక్కుపుడకనై

నీ సొట్ట బుగ్గలకూ నునుసిగ్గు నేనై

మందార పెదవులకూ చిరునవ్వునై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


3.శంఖమంటి కంఠాన నే వజ్రహారమై

నిను హత్తుకోగా బిగుతు రవికనేనై

నిన్నల్లుకోగా నేనే చెంగావి చీరనై

నీ నడుము చుట్టకోగా వడ్డాణమునై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బ్రతుకు మీద ఆశపుట్టగలదు 

కాటికి కాళ్ళు జాపుకున్న వారికైనా

రతిపట్ల ధ్యాస మరలగలదు

ఎటువంటి ఘోటక బ్రహ్మచారికైనా

యతిరాజుకైనా మతితప్పునే

యువతి నీరీతి అందగత్తెవల్ల

నీ పాదాక్రాంతులవరన్నది ఒప్పనే

పురుషజాతి సాంతం పుడమెల్లా


1.ప్రతి కాంత సృష్టిలోనె ఒకవింత

కాంచినంతనే కలుగును కవ్వింత

చెంతచేర్చుకోవాలని నిరంతరం చింతననే

చేరువైతె పులకింతనే దూరమైతె పెనుచింతనే

సౌగంధీ  ఆనందీ పరిమళ భరితమే నీ సౌందర్యం

విశ్వమంత విస్తరించె  నీ సోయగ సమ్మోహన సౌరభం


2.సుమ కోమల స్నిగ్ధ లావణ్యము 

మాలతీ లతా ముగ్ధ సౌకుమార్యము

చకితమె నీసొగసు అతులితమే నీ హొయలు

మంజులమే నీ గాత్రము నా కల నువు కళత్రము

సొంతమైతివా జీవితమంతా అనంతమౌ సంతసము

బ్రాంతివైతివా బ్రతుకంతా అవధులే లేని పరితాపము