Tuesday, December 31, 2019

ఆంధ్ర వాఙ్మయభారతి జననీ
తెలుగు సాహితి అజరామరమవనీ
తెలంగాణ నేలపై కైత సింగిడై పొడవనీ
ఈ అవని ఉన్నంతకాలం అజేయమై మననీ
చే జోతలు నీకివే వీణాపాణీ
వినతులందుకొనవే విధాతరాణీ

1.ఎంతటి దయ ఉన్నదో చదువులమ్మా నాపై
నీ ప్రాపకమే పొందితిని కళామతల్లీ నీ దాపై
ఊపిరున్నంతవరకు కొనసాగనీ నా కలము
పాఠకాభిమానుల నలరించనీ నా కవనము
చే జోతలు నీకివే వీణాపాణీ
వినతులందుకొనవే విధాతరాణీ

2.కవిగాయక చిత్ర శిల్పకారులు యశమొందనీ
సంగీత సాహిత్య యుగముగ వర్ధిల్లనీ
కళలను ఇల జనులంతా సదా ఆదరించనీ
ప్రభుత పెద్దమనసుతోడ ఘనముగ సత్కరించనీ
చే జోతలు నీకివే వీణాపాణీ
వినతులందుకొనవే విధాతరాణీ

అనునిత్యం ఒక కొత్తదనం
నిన్నకు నేటికి వ్యక్తివికాసం
ఋతుచక్రపు భ్రమణం గతస్మృతుల స్మరణం
మనిషి మనుగడకు ఏదైతేనేం అవలోకనం
ప్రతి దినం తొలికిరణం పునశ్చరణం
హాప్పీ న్యూ ఇయర్!  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!

1.పుట్టిన నాడే పుడమిని చూడగ హ్యాప్పీ ఆరంభం
మెట్టినింటిలో కాలు మోపెడి కొత్త కోడలికి హ్యాప్పీ ఆరంభం
పండిన పంటల రైతుల కంటిలొ హ్యాప్పీ ఆరంభం
పరీక్ష నెగ్గగ బ్రతుకు తెరువుకై ఉద్యోగికి హ్యాప్పీ ఆరంభం
హాప్పీ న్యూ ఇయర్!  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!

2.మళయాలీలకు విషు నాడే వత్సరాది వైభోగం
మహరాష్ట్ర గుడిపాడ్వా తమిళనాట పుత్తాండు
సిక్కులందరికి వైశాఖీ బెంగాలీలకు పొయ్ లా బైశాఖీ
తెలుగువారికి కన్నడిగులకు ఉగాదియే సంవత్సరాది
హాప్పీ న్యూ ఇయర్!  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!


3.దురలవాట్లను దూరముంచెడి నిర్ణయాలకు ఆహ్వానం
మంచిని కూర్చే సంకల్పాలకు ఎప్పటికైనా స్వాగతం
మానవత్వపు తత్వం నేర్వగ జగానికే జాగృతి గీతం
ఆనందాలు వెల్లివిరియగా  మిత్రులకిదియే సుప్రభాతం
విష్ యూ హాప్పీ న్యూ ఇయర్!  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!






Monday, December 30, 2019

పెదాలపై ఆనందం
హృదయాలలో విషాదం
దాచుకున్న మర్మాలన్నీ చూపులే చెబుతాయి
గుండెచాటు గుట్టులన్నీ  కళ్ళు రట్టుచేస్తాయి

1.మాటకెంత చక్కెర పూసినా
కన్నీట ఉప్పు గాఢత తగ్గేనా
భావాలకెన్ని  ముసుగులేసినా
గొంతులోన పలుకు జీర తొలగేనా
వదనాన పున్నమి వెన్నెలే
ఎదలోన కటిక చీకటులే

2.పంటికింద నొక్కిపట్టిన వేదన
చెలియలి కట్టదాటు కడలిలా
అంతరాల భరించగ యాతన
మోవిపై పులుముకునే నవ్వులా
ఆటుపోటులల్లే బ్రతుకులే
ఆత్మచంపుకుంటూ నటనలే
రచన,స్వరకలఅపన&గానం:రాఖీ

ప్రేమా ప్రేమా నీవే ఒక శాపమా
ప్రేమాప్రేమా  తీరని పరితాపమా
నీ చెంత చేరాక చింతేలే బ్రతుకంతా
నీ వంత పాడాక వింతేలే భవితంతా

1.నీ మాయలోబడి నను నేనె కోల్పోయా
నీ మత్తుకు లోబడి వెర్రివాడినైపోయా
అనుభవజ్ఞులెంత చెప్పినా పెడచెవిన పెట్టినాను
కాకులై లోకులు కూసినా పిచ్చోళ్ళుగ జమకట్టాను
ప్రేమా ప్రేమా నీ పేరే మోసమా
ప్రేమా ప్రేమా నీ నైజం ద్వేషమా

2.ఆరిపోని గుండెమంటలే బహుమానాలా
ఇంకిపోని కంటిచెలమలే చెలిమికి ఫలితాలా
మరణమింతకంటే వేరుగా ఉంటుందా
నరకమింతకంటే ఘోరంగా ఉంటుందా
ప్రేమా ప్రేమా నీవే యమపాశమా
ప్రేమా ప్రేమా నీవే గ్రహదోషమా
మోము చూస్తే అమాయకం
మాటసైతం మకరందం
నమ్మరాదు నటనలెరిగిన నారీమణులను
వలపుపేరిట వలలు వేసే నెరజాణలను

1. లేడికన్నుల కదలికలు
వాడిచూపుల కవళికలు
క్రీగంటిబాసల చిలిపి లిపితో
పలుకుతారు స్వాగతాలు
పంటినొక్కుల వింతసైగతో
తెలుపుతారు మనోభావాలు
మత్తునే  చల్లుతారు కోమలాంగులు
మాయలో ముంచుతారు నీరజాక్షులు

2.లొంగినట్టే వాపోతారు
బేలగానే అగుపిస్తారు
మెల్లమెల్లగ అల్లుకుంటూ
హృదయమాక్రమిస్తారు
లాఘవంతొ కమ్ముకుంటూ
బ్రతుకు కొల్లగొడతారు
దృక్కులతో తృప్తిపడు ఓ నేస్తమా
దూరముండి హాయినొందు ఓ మిత్రమా

Saturday, December 28, 2019

రంగనాథుడు-మంజునాథుడు
జగన్నాథుడు-విశ్వనాథుడు
శ్రీనాథుడు-గౌరీనాథుడు
దైవమనే నాణానికీ
బొమ్మ ఒకరు బొరుసింకొకరు
అద్వైతమూర్తి తానైన హరిహరనాథుడు
కొలవరొ నరులారా నిత్యం శివకేశవ భేదం మరచి
తలవరొ జనులారా మాధవ మహాదేవ తత్వం తెలిసి

1.నిలువు బొట్టని కొందరు అడ్డంబొట్టని కొందరు
పీతాంబరమని కొందరు గజచర్మాంబరమని కొందరు
హరినే సతతం స్మరించు హరుడు
శివుడిని పూజించు సర్వదా గోవిందుడు
కొలవరొ నరులారా నిత్యం శివకేశవ భేదం మరచి
తలవరొ జనులారా మాధవ మహాదేవ తత్వం తెలిసి

2.హృదయాన  సతికే స్థానమిచ్చెను వైకుంఠపతి
దేహాన సగభాగము పార్వతికిచ్చెను పశుపతి
మోహిని ఎడల మోహమెంతో సదాశివునకు
కపర్ది పై అనురాగమే సదా పద్మనాభునకు
కొలవరొ నరులారా నిత్యం శివకేశవ భేదం మరచి
తలవరొ జనులారా మాధవ మహాదేవ తత్వం తెలిసి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

భారత భారతీ-బ్రతుకే హారతీ
దేశభక్తి భావనలో జాతీయతా యోచనలో
రాజ్యాంగం పరిధిలో త్రివర్ణ పతాక ఛాయలో
వందే మాతరం వందేమాతరం వందేమాతం వందేమాతరం

1.చట్టం ధర్మం న్యాయాలకు  నిబద్దులం
సంస్కృతీ సాంప్రదాయాలకు వారసులం
పరులసొమ్ముకై ఎన్నడైననూ ఆశపడం
ఇరుగుపొరుగు దోపిడికొస్తే ఊరుకొనం
వందే మాతరం వందేమాతరం వందేమాతం వందేమాతరం

2.పరమతసహనం తరతరాలుగా మానైజం
మతములమార్పిడి ధోరణులకు వ్యతిరేకం
భిన్నత్వంలో ఏకత్వం నాడూనేడూ మాతత్వం
దేశద్రోహపు వంచనను కలలోనైనా సహించం
వందే మాతరం వందేమాతరం వందేమాతం వందేమాతరం

Friday, December 27, 2019

మంజుల చరణా గరుడాధిరోహణా
రత్నఖచిత కాంచన కంకణధారణా
తిరువేంకట రమణా గోదా మనోహరణా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

1.భవతాప నివారణా భక్త పోషణా
ఆశ్రితజన సంరక్షణా ఆళ్వార్ సేవితా
ఆండాళ్ సతి కళ్యాణ పెరుమాళ్ సమ్మోహనా
దీనావనా దీనజనోధ్ధారణ దీక్షా విశేషణా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

2.బ్రహ్మీముహూర్త సుప్రభాత అర్చితా
పంచోపనిషత్ ఘోషిత  క్షీరాభిషేక పూజితా
కస్తూరీ శ్రీ చందన పరిమళభూషితా
తులసీదళమాలాలంకృత భాసితా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

3.కర్పూర తిరునామాంకిత సుందర వదనా
అరవింద నయనా ఆర్తత్రాణ పరాయణా
మాధురీ మందహాస  చంద్రికా వితరణా
అభయముద్రాన్విత చింత నివారణా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

Thursday, December 26, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వైరికి కొమ్ముకాచినంత కాలం
తల్లి రొమ్ముగుద్దుతున్నంత కాలం
ఇంటిదొంగలే వంచనతో దోపిడి సాగించినంతకాలం
పరాయివాడిని పంచన చేర్చుకున్నంత కాలం
భరతమాత అందరున్నా అనాథా
భరతజాతి ఇంకానా శాపగ్రస్తా

1.మంచితనం మన బలహీనతగా మారింది
గుంటనక్కజిత్తులకే తల్లడిల్లిపోయింది
ఆపన్నులనాదుకొనగ వెసులుబాటిచ్చింది
చొరబడి ఆక్రమించు ముష్కరుల మరిచింది
మనుగడకే ఎసరొచ్చే దాష్టీకం పెట్రేగింది
జాతీయ వ్యతిరేకుల దమనకాండ ప్రబలింది

2.తురుష్కులు మొగలులు విర్రవీగిపోయారు
ఆంగ్లేయపాలకులు సంస్కృతినే చెరిచారు
స్వాతంత్ర్య ఫలం కాకూడదు ఇకపై విఫలం
అంతర్గత సరిహద్దు భద్రతే మనకు బలం
విఛ్ఛిన్నకారుల నణాచాలి కడు నిర్దాక్షిణ్యంగా
స్వేఛ్ఛాగగనాన ఎగురుతూనె ఉండాలి భారతీయ తిరంగా

Wednesday, December 25, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:కానడ భైరవి

పిలిచి పిలిచి విసిగాను వినబడలేదా
అరచిఅరచి అలిసాను దయగనవేలా
షిరిడీ సాయిబాబా పండరీ పుర విఠోబా
కాకమ్మ కథలేనా నీ లీలలు
పుక్కిటి పురాణాలా నీ మహిమలు

1.ఆసక్తిలేదా సాయీ- నీపై- నాకు భక్తిలేదా
నా ఓర్పుకే పరీక్షా సాయీ-నా కింతటి శిక్షా
ఎదిరిచూపుకైనా కాలపరిమితేలేదా
ఓపికకంటూ ఒక హద్దులేనే లేదా
నిన్ను నమ్ముకోవడమే నే చేసిన పొరబాటా
ఇంతకఠినమైనదా  నిన్ను చేరుకొనుబాట

2.నీ పలుకులన్నీ ఒట్టి నీటి మూటలు
నీ బోధలన్నీ ఉత్త గాలిమాటలు
నిరాశనే దక్కుతుంది నిన్ను కోరుకుంటే
అడియాసె మిగులుతుంది నిన్ను వేడుకుంటే
నిరూపించుకోక తప్పదు నీ ఉనికి ఇలలోన
నన్నాదుకొనడం మినహా మరిలేదు ఇకపైన
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎదురు దెబ్బలెన్నితాకినా
ఎంతమంది ఈసడించినా
స్నేహం ముసుగులో పరాన్నబుక్కులు
వంచన పంచనజేరిన పరమ మూర్ఖులు
దేవుడైనా బాగుచేయలేడు ఇటువంటి నరులను
ఇచ్చిన మాటనిలుపుకోలేని ఈ మనుషులను

1.ప్రతిభ ఎంత ఉంటేమి నియతిని పాటించకుంటే
ఎంతనేర్పరైతేమి నిబద్ధతకు విలువీయకుంటే
అరచేతిలొ వైకుంఠం చూపుతామంటారు
చెప్పులరిగినా పనిపూర్తికి రేపుమాపంటారు
చేజేతులారా భవిత చంపుకొంటారు
తెలిసిమరీ ఊబిలోకి దిగుతుంటారు

2.మోసమంటే తమతత్వం కాదంటారు
ప్రతిసారీ కొత్తకథలు అల్లుతుంటారు
అందరినీ అన్నిసార్లు నమ్మించ బూనుతారు
బోల్తా కొట్టించబోయి బోల్తాపడుతుంటారు
జాలిపడుట వినా ఎవరేమి చేయగలరు
నొప్పింపక తానొవ్వక తప్పించుకతిరుగుతారు
మదికి హత్తుకుంటే ఒక మధురగీతం
గుండెకే గుచ్చుకుంటే అది విరహగీతం
ఎడదనొచ్చుకుంటే విషాద గీతం అభ్యుదయగీతం
మనసు మదనపడితేనో ఇక భక్తిగీతం ఒక తత్వగీతం

1.అందమైనా ఆనందమైనా
అనుభూతికి లోనైనప్పుడు
ప్రణయ భావన సౌందర్యోపాసన
కోరుకున్నది చెంతకు చేరుకోక
దొరకనిదైనా వదులుకోలేక
వేదనాగీతిక వెతలకది వేదిక

2.సమాజాన ప్రబలే రుగ్మతలు
దీనులపై జరిగే దాష్టీకాలు
పాలకుల కనువిప్పుకు గేయాలు
మానవీయ విలువలు సమసి
భ్రష్టత్వం జగతిన వ్యాపించ
 దైవానికి వినతులు ఆధ్యాత్మిక కీర్తనలు

Monday, December 23, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ముద్దబంతి పూవులాంటి ముగ్ధత్వం
ముద్దమందారమంటి మృదుత్వం
గులాబీరేకువంటి స్నిగ్ధత్వం
తంగేడు పూవులాంటి నిర్మలత్వం
ఎంతముద్దుగున్నావే మనవరాలా
ఎత్తుకొని ముద్దాడుదు మమతమీర

1.మీ అమ్మలోని సునిశితత్వం
అమ్మమ్మలోని అతులిత లౌక్యం
మీ నాన్నలోని ధీరత్వం
తాతయ్య లోని బోళాతత్వం
పుణికిపుచ్చుకున్నావే చిన్నారి
వృద్ధిలోకిరావాలి మాకోరిక నెరవేరి

2.ముక్కోటి దేవతలు దీవించగా
ఇలవేల్పు దయనీపై వర్షించగా
నువు ఆటపాటలతో అలరించగా
నీముద్దు మురిపాలు మురిపించగా
నిత్యసంతోషిణివై వర్ధిల్లవే
నిండునూరేళ్ళూ వెలుగొందవే
https://youtu.be/FjEGaDM--BA


పుట్టింది మట్టిలో కలిసేది మట్టిలో
మట్టిమనిషివంటారు నిను రైతన్నా
నీ జట్టుపట్టదంటారు వినరోరన్నా
హలం నీది కలం నాది మనిద్దరిదీ వ్యవసాయం
నీకు నేను నాకు నీవు మనకు మనమె సాయం
జోహారు నీకన్నా జేజేలు నీకన్నా

1.జిట్టెడంత పొట్టకొరకు పట్టెడంత పండించి
పూటగడుపనెంచవేల వెర్రెన్నా
కట్టమంత దారవోసి మట్టినే ధాన్యంచేసి
పుట్లకొద్ది పండించ పట్టునీకేల రైతన్నా
నిను పట్టించుకోని జనం సాపాటు కోసం
పాట్లు పడెదవేల అగచాట్లుపడెదవేల

2.ప్రభుత్వాలు మారినా ఏపార్టీ పాలించినా
నువు మోడుగ మారినా నీగోడు వినకుండె
కరువులుకాటకాలు వరదలు తుఫానులు
నిను కబళించగా దిక్కుతోచక నీగుండె మండె
దైవోపహతుడైనా  ధైర్యదాన కర్ణుడవే నీవు
ప్రకృతి పద్మవ్యూహాన అభినవ అభిమన్యుడవీవు

3.జీతబత్యాలులేవు  ఏ పింఛను లెరుగవు
బుద్దెరిగిన నాటినుండి శ్రమనె నమ్ముకొన్నావు
నేలనే తల్లినీకు పైరు పెంచిపోషించగ నీ తండ్రి నీరు
సమయాసమయాలూ లేవు పదవి విరమణలు
ప్రపంచం కడుపు నింపు అపర అన్నపూర్ణవు
ఒడుదుడుకుల వెరవని సమరయోధుడవు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జగమేలు శక్తివమ్మా
సుగుణాలరాశివమ్మా
దయగల్ల తల్లివమ్మా
ప్రియమార చూడవమ్మా
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

1.గతినీవెగాదె మాకు
మతినింక వీడబోకు
రుజకీవె మందుమాకు
చేయెపుడూ  వదలకు
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

2.ఎదనీకు కోవెలమ్మా
మా కన్నులె దివ్వెలమ్మా
చిరునవ్వులె పువ్వులమ్మా
ప్రాణజ్యోతులారతులమ్మా
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

Sunday, December 22, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తేట తెలుగులొ మాటలాడితె హాయి
తల్లి మమతను తలచుకొంటే హాయి
గోరుముద్దల రుచులు ఎంతటి హాయ
నాన్న ప్రేమే గురుతుకొస్తే హాయి

1.బాల్యమిత్రులు కలుసుకొంటే హాయి
సహాధ్యాయులు కీర్తికొస్తే హాయి
తొలినాటి ప్రేయసి పలకరిస్తే హాయి
తెలిసితెలియని చిలిపిచేష్టలె హాయి

2.కృషికి ఫలితం పొందినప్పుడు హాయి
గెలుపు తృప్తిని పంచుకొంటే హాయి
గుండెతడి పొంగి కనులే చెమరించ హాయి
ఆపన్నుల ఆర్తిదీర్చగ చేయూతనిస్తే హాయి

3. నవ్వుపువ్వుల తోట మనతోటిఉంటే హాయి
దుఃఖమెప్పుడు దాచుకొనక బావురంటే హాయి
తామరాకున నీటిబొట్టై మసలుకొంటే హాయి
రేపుచేదని నేటి మధువుని జుర్రుకుంటే హాయీ
బ్రహ్మ రసనా పరివేష్ఠినీం బాసరపుర నిజ వాసిని
మాతరం ప్రణమామ్యహం నిరంతరం భజామ్యహం

1.కవిగాయక వరదాయిని కామితార్థ దాయిని
భవభంజని నిరంజని విశ్వైకజనని పాహిమాం

2.జాడ్యాంతకీం జాగృత చిత్త సాధినీం మేధావినీం
అగణిత ప్రజ్ఞాం ప్రసాదినీ పరాదేవీం నమామ్యహం

3.రాఖీ లేఖనీ మయూఖ విద్యుల్లతా భాసిని
కవన మోహిని మనోరంజని పాలయమాం

Saturday, December 21, 2019

మహా విద్యా మహా మాయా
మహా జ్ఞాన సరస్వతీ
శృంగేరీపీఠవాసిని హే బాసర భారతీ
శరణు తవ దివ్య చరణం  భవతాప హరణం
స్మరణ మాత్రేన జన్మ పావనం
శ్రీ మాత్రే తవ నామ మననం

1.శుక పుస్తక హస్త శోభితం-స్వర్ణ కలశ కర ప్రభాసితం
రక్తవర్ణ చేలోపరి విరాజితం-హరితచోలి ప్రఛ్ఛాదితం
ధన్యోహం తవ భవ్య దర్శనం
వీక్షణ మాత్రేన జన్మ పావనం
శ్రీమాత్రే తవ రూప చింతనం

2.శంకరాచార్యార్చితం-వ్యాస వాల్మీకి సంసేవితం
నారదాది మునిజన వందితం-కాళిదాస కవి నుతం
భావయామి తవ పాద పంకజం
ధ్యానమాత్రేన జన్మ పావనం
శ్రీమాత్రే తవ గుణగాయనం


భావ వైరుధ్యమే భవా నీ తావు
జన్మ వైరులైనా మైత్రిగానే మనగలవు
భిన్నమైనతత్వాలే శివా నీ కొలువు
ఐక్యతగా సఖ్యతగా మసలుకోగలవు
మనుజుల మనసుల ద్వేషాన్ని హరించు
మానవతను మమతను విశ్వమంత విస్తరించు
శివానీ భవా నమోనమామి-భవానీ శివా సదాస్మరామి

1.నిప్పూ నీరూ ఒప్పనే ఒప్పవు
అట జటాఝూటము ఇట జ్వలిత నేత్రము
అమృతము గరళము పొసగనే పొసగవు
అట సుధాకర భూషణ  ఇట కాలకూటధారణ
మనుజుల మనసుల ద్వేషాన్ని హరించు
మానవతను మమతను విశ్వమంత విస్తరించు
శివానీ భవా నమోనమామి-భవానీ శివా సదాస్మరామి

2.భోళా శంకరుడవే మహంకాళీ సమేతుడవే
రౌద్ర వీరభద్రుడవే అన్నపూర్ణా సంస్థితుడవే
వృషభానికి మృగరాజుకి ఎలా కుదిరె స్నేహము
కైలాసము స్మశానము అదీ ఇదీ నీ గృహము
మనుజుల మనసుల ద్వేషాన్ని హరించు
మానవతను మమతను విశ్వమంత విస్తరించు
శివానీ భవా నమోనమామి-భవానీ శివా సదాస్మరామి


మరలిరాని గతమేదో బావురుమంది
మనసైన నెచ్చెలి చేరువయింది
అలనాటి అనుభూతుల్లో అలరించింది
నన్ను నేను మరిచేలాగా మదినాక్రమింది

1.పెచ్చులూడిన నా భవంతికి వెల్లెవేసింది
దుమ్ముబట్టిన నాముంగిలిలో రంగవల్లి తానయ్యింది
మసకబారిన ఆశాదీపపు మలినాలు కడిగింది
కొడిగట్టి ఆరే వత్తిని వెలిగేలా చేసింది

2.ఎడారైనా దారిలో వసంతమై ఎదురయ్యింది
ఏకాకి నా బ్రతుకులో కోయిలగా కూసింది
తడారే నా గొంతులో అమృతవర్షిణయ్యింది
తనువు మనసు అంకితమిచ్చి తానె నేనుగ మారింది
జ్ఞాపకాలన్నీ గుండె కెలుకుతున్నాయి
తీపిగురుతులన్నీ గొంతునులుముతున్నాయి
నువ్వెలా తట్టుకుంటున్నావో చెలీ
రోజులెలా నెట్టుకొస్తునావో ప్రియా
మరల మరల రానీ మరులుగొలుపు ఆ క్షణాలు
ఆ తరుణం జారకముందే రాలనీయి జీవితాలు

1సుఖాలన్ని రంగరించి సరసరసం అందించావు
హాయినంత మూటగట్టి నాకు ధారపోసావు
బొందితోనె స్వర్గమంటే నీ పొందే ప్రియతమా
అమృతాల విందంటే నీ చుంబనమే భామా
మరలమరల రానీ మరులుగొలుపు ఆక్షణాలు
ఆ తరుణం జారకముందే రాలనీయి జీవితాలు

2.వాత్సాయన సూత్రాలన్నీ మనవల్లనె వెలిసాయి
శృంగార భంగిమలెన్నొ అనంగుడికే తెలిసాయి
కామశాస్త్ర పాఠాలకూ మన కలయికే మూలం
ఖజురహో శిల్పులకూ మన రసికతె ఆధారం
మరల మరల రానీ మరులుగొలుపు ఆ క్షణాలు
ఆ తరుణం జారకముందే రాలనీయి జీవితాలు

Friday, December 20, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:కల్యాణి

నీ పదముల నా మది కొలిచేను
నా పదముల నీ కృతి మలిచేను
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ

1.అక్షర లక్షలు నీకర్పించెద
కవితల కోటి నీకందించెద
గీతమాలికల అలరించెద
కావ్యశతముల కానుకలిచ్చెద
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ

2.నిత్య నరకము ఈ నరలోకము
నీ సన్నిధియే భూతల నాకము
తొలగించర నా అవిరళ శోకము
కావించర  కర్మల పరిపాకము
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ
విచ్చుకోనీ విరిలా మోవి
విరజిమ్మనీ పలుకుల తావి

దైవాన్ని నమ్మితే మానవుడే మాధవుడు
మనిషినే నమ్మితే మనిషి దైవమౌతాడు

రాగానిదేముంది అనురాగం పంచితే
ఇష్టపదులు వింతకాదు కోయిలనే మించితే

సాగర వైశాల్యం ఎంతుంటే ఏమిటి
నావ  దరిని చేర్చదా ఆటుపోట్లు దాటి

కన్నెంత కార్చినా కన్నీరు దోసిట
గుండె చెలమె తోడితే ఒడవదు ఊట

చిమ్మచీకటైతెనేమి చిరుదివ్వెతొ తొలగదా
కఠిన హృదయమైతేమి రాఖీ చిరునవ్వుతొ కరుగదా
భావనంతా నీదే భాష మాత్రం  నాది
ఊహలన్నీ నీవే అక్షరాకృతి నాది
మనసు మనసుతొ మాటలాడితె
ఉప్పొంగవా మధురానుభూతులు
తత్వమొకటిగ సాగిపోతే
రవళించవా మన స్నేహగీతులు

1.కనురెప్ప మాటున ఒదిగిపోతా
నిదుర చాటున  కలగమారుతా
ఉదయింతునే పెదవిపై చంద్ర హాసమునై
అలరింతునే హృదయమ్మునే ఇంద్రచాపమునై
నేస్తమా నీ జ్ఞాపకాలే చెఱకు గడలు
ప్రియతమా నీతో క్షణాలే పాలమీగడలు

2.అభిరుచుల మాధురి ఒకటిచేసే
అభివ్యక్తులె అనుబంధమై పెనవేసే
ఇవ్వలేనిది ఏదిలేదు ప్రాణమే నీపరం చేసా
కోరగలిగిదేది లేదు నీ ప్రేమనే చవిచూసా
నేస్తమా నీ జ్ఞాపకాలే చెఱకు గడలు
ప్రియతమా నీతో క్షణాలే పాలమీగడలు

Thursday, December 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహనం

చిరునవ్వుకు చిరునామా
ప్రతిస్పందనకే తగు ధీమా
స్నేహానికి  నిలువెత్తు రూపం
మానవతకు తానొక ఊతం
మోహనమే సదా మురళీ రవం
మురళీ మోహనుడే మా వరం

1.వినతులు విను కడు సహనం
పదవిని తలవని ఆ వినయం
ఓపిక కలిగిన అనునయం
ఆదరించెటి దయాహృదయం
మోహనమే సదా మురళీ రవం
మురళీ మోహనుడే మా వరం

2.క్రమశిక్షణకే ఒక నిదర్శనం
నిజాయితీకే ఇల తార్కాణం
విద్యుక్త ధర్మ నిర్వహణం
మన్ననలందే అంకితభావం
మోహనమే సదా మురళీ రవం
మురళీ మోహనుడే మా వరం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కన్నులు కన్నులతో కలిపి
రాస్తున్నాయీ ప్రేమలిపి
చదివితె భావం ఎంతో చిలిపి
మిన్నకున్నాయేం మనసే తెలిపి

1.పెదవులకెందుకు మాటలు
వలపులు పాడితె పాటలు
బ్రతుకున పువ్వుల తోటలు
భవితన తేనెల తేటలు

2.ఫలించేనులే కలలన్ని
కురిపించునులే వెన్నెల్ని
వినిపించగా సరాగాల్ని
పెంచును అనురాగాల్ని

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జంట పావురాలే  కంటికింపుగా ఎగిరే
మనజంట కన్నుకుట్టి కంటగింపుగామారే
ఎదిరించుదాం లోకాన్ని-మళ్ళించుదాం కాలాన్ని
ఒకసారి ప్రియా రావేలా-వేచితినే అభిసారికలా

1.కలువనైతిని జాబిలి నీవని
కలువవైతివి నీవెందుకని
కలయిక కలకే పరిమితమా
కలతల నెలవే  జీవితమా
ఒకసారి ప్రియా రావేలా
వేచితినే అభిసారికలా

2.మనసారా నిను వరించితిని
రేయీపవలు కలవరించితిని
నే బ్రతికినట్టు కనిపించే మృతిని
నీవే లేక ఎన్నడు ఆరని చితిని
ఒకసారి ప్రియా రావేలా
వేచితినే అభిసారికలా

PIC COURTESY:P.AGACHARYA sir.

Wednesday, December 18, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆటలాడినా నీతోనే-పాట పాడినా నీతోనే
సయ్యాటలాడినా నీతోనే-సాపాటు చేసినా నీతోనే
నేస్తమా నా సమస్తమా-స్నేహమా తీరని దాహమా
పున్నమి నెప్పుడొ మరిచానే-నిత్యం వెన్నెల నీమేనే

1.ఎన్నో నా కలవరాలే-నిను చూడగ వరాలాయే
కల్లోల మహా సాగరాలే  -ప్రశాంత సరోవరాలాయే
దివ్యత్వం నీ మోములో-నవ్యత్వం నీ మోవిలో
వలపులు చిలికే చిలుకవో-తలపుల నిలిచే పలుకువో

2.నిజం చెప్పినా నమ్మవులే-ముదములొ చిప్పిలు చెమ్మవులే
మోహనాంగి ముద్దుగమ్మవులే-మిఠాయిదాగిన చిటారు కొమ్మవులే
ప్రేమ తత్వం నీలోలోలోలో-రాగబంధం ఊగిసలాడే ఉయ్యాలో
మౌన వీణను నేనే మీటాలో-స్నేహమొలకను నేనే నాటాలో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మస్తుగున్నవె పోరీ-జబర్దస్తుగున్నవీసారీ
సూపుల్తోనే కాపేస్తూ-నవ్వుల్తోనే కైపిస్తూ
మాయేదో చేస్తూ-మదినేదోచేస్తూ-మరిమరి మురిపిస్తూ

1. బుంగమూతి నంగనాచి-సింగిరాలు పోనేల
రంగురంగు పెదాలలో-వలపు రంగరించనేల
అంతలోనె నీవే భద్రకాళి-వింతగా నా ఎదలో కాలి
లేదో ఇసుమంత జాలి-చెలీనువు లేక బ్రతుకే ఖాళి

2.కాటుక కళ్ళరూపు-నాటుకుంది వాడి తూపు
అట్టాఅసలు నవ్వబాకు-గుచ్చుతోంది సోకు బాకు
నిన్నుగన్నతల్లి కోదండం-నువే నా యమగండం
సంకకైన ఎక్కవు ఎక్కీ దించనీవు-వంకలేవొ సెప్పవు సాధించుతావు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మనసు మయూర మౌతుంది నీవు పలకరిస్తే
స్వరము పికమై పాడుతుంది ప్రేమ చిలకరిస్తే
హరివిల్లు దిగివస్తుంది నీవలంకరిస్తే
వయసు పసిగమారుతుంది నన్ను స్వీకరిస్తే..
ఆత్రంగా నీ కరమిస్తే నేస్తంగా అంగీకరిస్తే

1.మలయమారుతాలే నీవు సమీపిస్తే
మార్గమంతా నందనవనమే నీతో నడిస్తే
అష్టావధానమే నీతో స్పష్టంగా వాదిస్తే
ఇష్టానుసారమే కాలం కర్మం సహకరిస్తే
అనుభూతులెన్నో జీవితాన్ని ఆస్వాదిస్తే

2.నాతప్పుకాదు  బంధం మామూలుగ తోస్తే
బోధపడిపోతుంది లోతుగా ఆలోచిస్తే
హృదయాంతరాలలో కనగలవు చూస్తే
కలలన్ని నిజమౌతాయా జన్మలెన్నొ దాటొస్తే
కవి'తలలోనైనా మనగలవు విధి కరుణిస్తే
నీ సేవలో ననుతరించనీయీ సాయీ
నీ ప్రేమలో పరవశించనీయవోయీ
నీ ధ్యానములో తన్మయ మొందనీయీ
నీ సన్నధిలో నను కడతేరనీయ వోయి
సాయీ సాయీ షిరిడీ సాయీ సాయీసాయీ దయగనవోయీ

1.గురువారం ఉపవసించ పూనేరు శరణార్థులు
నీ మందిరాన్ని శుద్ధిచేయ తపించేరు సేవకులు
నీ దర్శన భాగ్యానికి బారులు తీరేరెందరో దీనులు
సాయిరామా పాలతొ నిన్నభిషేకించేరు పూజారులు
పూజలు సేయగా హారతులీయగా ధన్యతనొందేరు జనులు

పంచహారతులీయగా ఆనందమొందేరు అర్చకులు
పల్యంకిక మోయగా ఆరాట పడెదరు ఔత్సాహికులు
షిరిడీశా నీకు జేజేలు పలికేరు వందిమాగధులు
నిను కీర్తించగా గొంతెత్తుతాడు గాయకుడు
బాబా నిను భజించగా వంతపాడుతారు నీ భక్తులు

Tuesday, December 17, 2019

నీవుంటె పాటల తోటే సరి
నీ వెంట తేనెల తోటే మరి
నీ ఊసులన్ని కమ్మని బాసలె
నీ ఊహలన్నీ రమ్మను పిలుపులె

1.నీ భావనలో మధురిమలెన్నో
నీ చెలిమిలోనా సరిగమలెన్నో
ప్రతి కలయిక యిక ఒక గీతమాలిక
శ్రుతిలయ తప్పని రసరాగ గీతిక

 2.కాలమె ఆగి విస్తుపోతుంది
ప్రకృతియే  ఆసక్తిగ చూస్తుంది
కనివిని ఎరుగని వింత బంధం
కవిగాయకుల మధుర సుగంధం
సంపదా  యశస్సూ  ఒకలాంటివె నిజానికి
శ్రమకోర్చుకోక తప్పదు అవి పొందడానికి
ఓపిక నేర్పు కావాలి పెంచిపోషించడానికి
సంకల్పబలం కావాలి సాధించడానికి

1.అడ్డంకులు ఎన్నెన్నో దారిపొడుగునా
దొడ్డమనసు కావాలీ అడుగు అడుగునా
వనరులు ఎన్నో చుట్టూ పరికించి చూడు
ఇసుక నుండి తైలం తీసే నిపుణత వాడు

2.పరుగెత్తి ఎన్నడు పాలకొరకు యత్నించకు
ఉన్న చెమట సైతం ఉరుకులాడి కోల్పోకు
సూక్ష్మం లో మోక్షంలా తెలివిగా వ్యవహరించు
లక్ష్యం ఏదైనా జడవక అలవోకగ ఛేదించు

Monday, December 16, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:కానడ

నీ తలపే తొలగించును ఆటంకం
నీ స్మరణే దాటించును సంకటం
సిద్ది వినాయకా అన్ననీ ఏకైక నామం
చేర్చగలదు భక్తులనూ ముక్తిధామం
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా

1.ఊపిరి పీల్చినా నిట్టూర్చినా
హృదయ స్పందనలో నాడీకణములలో
తనువులో మనసులో నాలోని అణువణువులొ
సిద్దివినాయకా నీ ధ్యానమే మెలకువలో నిద్దురలో
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా

2.నా క్షేమము నీ బాధ్యత నా తండ్రీ వినాయకా
నా మనుగడ నీ చలవే నా స్వామీ వినాయకా
ఏ జన్మలోనైనా నీ పాదం విడనీయకు వినాయకా
జన్మరాహిత్యమొసగి నీ సన్నధి దయసేయి వినాయకా
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హాయి అంటె తెలిసింది చెలీనీ వల్లనే
అనురాగపు జాడలన్నీ నీ ఎదలోనే
నీ జ్ఞాపకాలన్నీ మధురానుభూతులే
నీ సన్నిధిలో క్షణాలు ఆహ్లాద హేతువులే

1.కవితలేల జవరాలా కావ్యాలు రాయనా
నువునడిచే దారిలోనా పూబాట వేయనా
పున్నమికై ప్రతీక్ష ఏల నీ కన్నుల కనుగొననా
మల్లెలకై వెతకగ నేల నీ నవ్వుల ఏరుకొననా

2.ఏనాడు కలిసావో అదియే సుముహూర్తము
ఏ చోట ఎదురైనావో అది పవిత్ర ధామము
మనసులే వేసుకున్నాయీ విడివడని మూడు ముళ్ళు
చినుకులే రాలి అయినాయి మనకు తలంబ్రాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువు పాడే ఒకే రాగం అనురాగం
నువు చేసే ఒకే లాస్యం పారవశ్యం
నీ ప్రతి పలుకూ త్యాగరాజ కీర్తనం
నీ ప్రతి కదలిక  కూచిపూడి నర్తనం
కోమలీ కోయిల తుల గాయనీ శ్రవణానందినీ
భామినీ కేసరి సరి గామినీ నయనవినోదినీ

1.సామాన్యులు సైతం నిన్ను చూసి కవులౌతారు
గీతనైన గీయనివారు చిత్రకారులౌతారు
సృష్టిలోని  అద్భుతమంటే నీవే నంటాను
రెప్పవేయలేని మిషతో నే అనిమేషుడనౌతాను
నభూతోన భవిష్యతి నీకు సాటి తరుణీ నీలవేణీ
సుందరనారీ వివిధవర్ణ విరి మంజరీ రసరాగిణీ

2.ఎక్కడ మొదలెట్టాలో నీ అందాలు వర్ణించగా
ఏ రంగులొ ముంచాలో కుంచె నిను దించగా
ప్రకృతికే ప్రతిరూపం ఆరాధకుల కపురూపం
రసిక ఎదల పరితాపం నీ తనువే ఇంద్రచాపం
అంగరంగవైభోగం లలనా నీ సహయోగం
ఓ పగ క్షణమైనా యుగం మనలేను నీ వియోగం

Sunday, December 15, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సదా నీ లోకం అదేదో మైకం
నీ సావాసం నిత్యం మధుమాసం
నీగాత్రం ఓ పికమాత్రం-నాకాత్రం లేదోపికమాత్రం
వినిపించవే అభినవ కోయిలా
వికసించ నా మది పున్నమి రేయిలా

1.నా దారి మారింది నువే లేక ఎడారిగా
ఎద తోడు కోరింది దప్పిక తీర్చే సరస్సునీవుగా
ఎడతెగని నిశీధికీ నీవే ఒక ఉషస్సుగా
ఎలమావి తోటలో  కిసలయ రుచులు గ్రోలగా
వినిపించవే అభినవ కోయిలా
వికసించ నా మది పున్నమి రేయిలా

2.నీ గానామృతమే జలపాతమై తడిపేయగా
నీ ప్రణయ గంగలో నే మునకలు వేయగా
కడతేరనీ జన్మజన్మలు నీ కమ్మని ఒడిలో
నను తరించనీ యుగయుగాలూ ఇదే ఒరవడిలో
వినిపించవే అభినవ కోయిలా
వికసించ నా మది పున్నమి రేయిలా

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మా పొదరింటికినీవే సింహద్వారం
మా మనసులకీవే అపూర్వ మణిహారం
ఎన్నటికీ చెరగని చిరుదరహాసం
ఆరారు ఋతువులకూ నీవే మధుమాసం
మా కన్నుల జాబిలీ సిద్దీశ్ గొల్లపెల్లీ
అందిస్తున్నా జన్మదిన దీవెనలు పాటగ అల్లీ
హాప్పీబర్త్ డే టూ యూ సిద్దికన్నా
విష్యూ హాప్పీబర్త్ డే టూ యూ

1.అమ్మానాన్నల అనురాగం రాగమై
చిన్నారి తమ్ముని అభిమానం గానమై
బంధుమిత్రులందరీ శుభకామనల బృందగానమై
నీ పుట్టినరోజే జగతికి అపురూపమై
వర్ధిల్లు వెయ్యేళ్ళు ఆయురారోగ్యాలతో
విలసిల్లు అసమాన కీర్తి ప్రభలతో
హాప్పీబర్త్ డే టూ యూ సిద్దికన్నా
విష్యూ హాప్పీబర్త్ డే టూ యూ

2.కొలవలేని ఓపికే వ్యక్తిత్వ దీపికగా
ఎనలేని ప్రతిభయే నీ ప్రగతికి సూచికగా
పదిమందిసాయపడే మానవతా వాదిగా
వంశానికె వన్నె తెచ్చు  పరసువేదిగా
వర్ధిల్లు వెయ్యేళ్ళు వినాయకుని కరుణతో
విలసిల్లు కొండగట్టు హనుమంతుని అండతో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:షణ్ముఖ ప్రియ

మూఢ భక్తి నీకెంత ఇష్టమో- భోళా శంకరా
గాఢ భక్తి అది ఎంత స్పష్టమో-భక్తవ శంకరా
నెలవంక దాల్చిన జంగమదేవరా గంగాధరా
నా వంక నీవేల రావేలరా  గౌరీవరా అనంగాహరా

1.నాగమణులు రాళ్ళనుకొను ఏనుగు
పత్రి పుష్పాలే చెత్తాచెదారమనే నాగు
దారాల అల్లికతో నీడకూర్తునను సాలెపురుగు
నీపై నిశ్చల భక్తివినా మరి యేమి ఎరుగు
కరుణించవేరా శ్రీ కాళహస్తీశ్వరా
నేనూ పరమ మూఢుణ్ణి గమనించరా

2.గజచర్మాంబరధారిగ గజాసురుని బ్రోచావు
చిరంజీవిగా మార్కండేయుని దీవించావు
కన్నప్పను గుణనిధినీ విధిగా కృపజూచావు
సిరియాళుని వరమొసగగ పరీక్షించినావు
దయజూడవేలరా వేములాడ రాయేశుడ
నేనూ వెర్రిబాగులోడనే పరికించి చూడ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

విరబోసిన నీలికురుల కృష్ణఝరిని కానా
అరవిరిసిన విరజాజిగ నీ జడను చేరిపోనా
ముగ్ధమోహనం నీ వదనం
మకరంద సాగరం నీ అధరం
బొట్టునై వెలగనా నుదుటన
పుట్టమచ్చనై మెరవనా పెదవంచునా

1.సోయగాల నల్లకలువలే నీకళ్ళు
మిసమిసలొలికే రోజాలే చెక్కిళ్ళు
శంఖమంటె ఏమిటో తెలిపే నీ కంఠము
పసిడివన్నె పరిఢవిల్లు నీసుందర దేహము
ఏ జన్మలోను చెలికానిగాను నను మనని
ఈసారికైనా ఆలకించవే నీ దాసుని మనవిని


2.ఊరించే చూపులు ఉడికించే నవ్వులు
తెలిపేను ఎదలోని ఎన్నెన్నో మర్మాలు
నీ మౌన గానాలు కుదిపే నా పంచప్రాణాలు
గుచ్చుకున్నాయెన్నో గుండెకు విరుల బాణాలు
అలరించవే చెలీ ననుచేరి ఆమని భామినిగా
మన జీవనమే పరిణమించగా బృందావనిగా

Saturday, December 14, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:శివరంజని

నీదీనాదీ ఒకటే దేశం
మనలో మనకూ ఎందుకు ద్వేషం
వేరనడానికీ నెపములెన్నెన్నో
మనమొకటని భావించగా-కారణమొకటైన దొరకదా
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

1.నేను నా కుటుంబం నా వీథి నాఊరు
నా జిల్లా నా రాష్ట్రం అంటూ విడివడతారు
నా శాఖ నా కులము నా మతమే శ్రేష్ఠము
 నా యాస నా భాష నా ప్రాంతమె నా కిష్టము
పెంచుకోర సోదరా హృదయ వైశాల్యము
కలుపుకుంటె నీదిరా సువిశాల భారతం
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

2.జాతీయస్ఫూర్తియే భరతావనికి పెట్టని కోట
ఐకమత్య లౌకికతే ఇంటా బయట భద్రతకు బాసట
ఘనములకు ఝరులకు జలధికి అనుబంధం
ఒకే దేశ ప్రజాస్వామ్య వారసులం మనకెందుకు భేదం
చేయి చేయి కలుపరా  ప్రగతి బాట పట్టరా
ఎదను ఎదుటను ఎదురౌవైరులను తరిమితరిమి కొట్టరా
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహన

ముక్కోటి దేవతలకు ఒక్కనాడె దర్శనము
వైకుంఠ ఏకాదశి దర్శనము
ఉత్తర ద్వారాన దర్శనము
కోట్లమంది భక్తులకు దివ్య దర్శనం
ప్రభో అను నిత్య దర్శనం
స్వామీ సామీప్య దర్శనం
చిద్విలాసా హే శ్రీనివాసా
అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా

1.మునులకు ఋషులకైన దుర్లభమే నీదర్శనం
ఇంద్రాది సురులకైన పరిమితమే నీప్రాపకం
ప్రహ్లాద నారదాది భక్తులకూ పరమ విశేషం
సామాన్య మనుజులకు సర్వ దర్శనం భవ్య దర్శనం
ప్రభో అను నిత్య దర్శనంస్వామీ సామీప్య దర్శనం
చిద్విలాసా హే శ్రీనివాసా -అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా

2.సుప్రభాత సేవ దర్శనం సుఖదాయకం
అభిషేక సేవలో  నిజరూప దర్శనం
తోమాల సేవ దర్శనం నయనానందకారకం
నిత్యకల్యాణ దర్శనం లోక కల్యాణార్థము
సడలింపు పూలంగి తిరుప్పావడ ఏకాంత సేవలు
పూర్వ జన్మసుకృతాన సులభసాధ్యము
చిద్విలాసా హే శ్రీనివాసా -అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రేవతి

“ మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం!! ”

ఎలా కలుపుతాడో భగవంతుడు
భిన్నమైన ధృవాలను
ఎందుకు ముడిపెడతాడో పరమేశ్వరుడు
విభిన్నమైన మనస్తత్వాలను
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

1.దాంపత్య మంటేనే ఆధిపత్య రాహిత్యం
నవరసాలు నిండిఉన్న అద్భుత సాహిత్యం
అభిప్రాయభేదాలకు తగ్గదు సాన్నిధ్యం
నిత్యం వాదనల నడుమ చెదరదు బాంధవ్యం
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

2.భారతీయ వైవాహిక వ్యవస్థ ఘనతనో ఇది
వేదమంత్రాలలోని మహిమాన్విత ఫలితమో ఇది
ఒకరిపట్ల ఒకరికున్న విశ్వసనీయతనో ఈ గుఱి
కాపురాల కాలాంతర అనురాగ మర్మమో మరి
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

Thursday, December 12, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:విహాగ్

నలిగిపోతున్నాడు నేటి కవి
అలిగి మిన్నకున్నాడు భావాల పీకనులిమి
నిరంకుశా కవయః నిన్నటి మాట
ఆచితూచిఅడుగులదీ ఈనాటి బాట

1.విస్తృతమై వరలుతోంది ప్రకటనా మాధ్యమం
అంతర్జాలవేదికయే నడుపుతోంది ఉద్యమం
అన్నీ ఉన్నా గాని అల్లుడి కేల్నాటి శని
నవ్వలేని ఏడ్వలేని త్రిశంకు స్వర్గమిది
గణణీయమై గుణహీనమై కబంధహస్తాల బలహీనమై
కవుల భవిత ఎంతో వేదనగా ఆదరణే కరువైన అనాధగా

2.ప్రశ్నించే యధార్థవాది విప్లవాల ప్రబోధిగా
తాన అంటే తందాన అనగ అస్మదీయులుగా
సభ్యసమాజానికే కవి జవాబు దారుడిగా
రాజకీయ పార్టీలకు కంటగింపు వాడిగా
రాసే భావాలకు కత్తిరింపు వేసి ఎగసే ఆవేశం అణచివేసి
కనిపించని ఉక్కు సంకెళ్ళతో తానుగా మనసనే చెఱసాలలో

Wednesday, December 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:భైరవి

జాబిలి నవ్వింది ఆమని పూసింది
ఆనందం జల్లుగా అవనిపైన కురిసింది
మౌనమే ధ్యానమై నా మనసు మురిసింది

1.ఆటుపోటులన్నిటిని తట్టుకొంది తీరము
కంటిలోని సంద్రానికి వేయలేము యాతము
ఎగసిపడే ఎదమంటకు ఏల వగపు ఆజ్యము
నివురుగప్పుకొంటె నిప్పుకెప్పటికీ సౌఖ్యము

2.నరికి వేయు నరులకూ చెట్లు చేటు చేయవు
మురికి చేయు మనుజులకూ నదులు విషమునీయవు
పంచలేమ నలుగురికీ  ఖర్చులేని నవ్వులను
ప్రకటించలేమ పదిమందికి ప్రేమానురాగాలను
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కల్యాణి

నా చిత్తపు వ్యవహారము-నీ చిత్తానుసారమే
నా సాహితి వ్యవసాయము-నీ ఆనతి మేరకే
మేధావిని వేదాగ్రణి వాణీ పారాయణీ
నమోస్తుతే సరస్వతి హే భారతి కల్యాణీ

1.అక్షరములు రుచించనీ భావ పథములై
నా పదములు గమించనీ పరమ పదముకై
నవరసములు రంజింపనీ పాఠక హృద్యములై
నా కవన గీతములే నీకు నైవేద్యములై
కదిలించవె నాకలమును అనితర సాధ్యముగా
దీవించవె నారచనలు అజరామరమవగా

2.మనోధర్మ సంగీతము జన మనోహరముగా
తన్మయమౌ రాగతాళ స్వరకల్పన వరముగా
గాయకులే పరవశించి పాడుకొనే గేయముగా
శ్రుతి లయ గతితప్పని అపురూప కీర్తనగా
పలికించవె నా గళమును పదికాలాలు
ఒలికించవే నా పాటలొ  మకరందాలు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:హంసానంది

ఫకీరుగా నిన్ను భావింతురు కొందరు
పరమాత్మగానూ ఎంచెదరింకొందరు
కులమతాలకతీతమౌ నాదమే  నీవు
బైబిల్ ఖురాన్ గీతామృతమౌ  వేదమే నీవు
మానవతకు నిలువెత్తు రూపానివి నీవు
సాయిరాముడవీవు సాయి బాబా నీవు

1.సంకుచితమగు మా బుద్ధికి అందదు నీ తత్వము
గిరిగీసికొని బ్రతికే మాకు బోధపడదు విశాలత్వము
 సద్గురువుగా  నిన్ను స్వీకరించమైతిమి
మహనీయమూర్తిగా అనుసరించమైతిమి
నీ మహిమ నెరుగలేనీ మూర్ఖులమే మేము
నీ లీల లేవీ కనలేని  మూఢులము

2.అభిమతాల కనుగుణంగా మతమునంటగడతాము
నచ్చిన రూపాలలోనే నిన్ను పిలుచుకుంటాము
అవధులలో కుదించలేని అవధూతవీవు
అల్లా జీసస్ కృష్ణులా అవతారమే నీవు
నీ జ్ఞాన జ్యోతిని వెలిగించు మా లోన
సౌహార్ద్ర సౌరభాన్ని వెదజల్లు మా పైన

Tuesday, December 10, 2019

అమ్మా అమ్మా దేవతవే నీవమ్మా
అమ్మా అమ్మా నా బ్రతుకే నీదమ్మా
నేనడిచే సన్మార్గం నీ చలవేనమ్మా
నా పాలిటి ఇల స్వర్గం నీవే నమ్మా
నీ గోరు ముద్దరుచినే నా మనసు మరువకుంది
నీలాలి పాట ఇంకా నన్ను నిదుర పుచ్చుతోంది

1.వ్యక్త పరచలేనమ్మా నీపైని నా ప్రేమని
బదులు ఇవ్వలేనమ్మా నువు చూపెడి ఆ మమతని
దూరాలు పెరిగాయి నీ దరి మనలేక
పలుకరించనైతి నా వెతను తెలుపలేక
మన్నించవమ్మా నిను మన్నన సేయనైతి
కినుకేలనమ్మా నా తలపులనిను నిలిపితి
నీ చేతి వంట తినగ వస్తానమ్మా
నీ పలుకుల పంచదార తింటానమ్మా

2. తట్టుకోనైతిని నువు మోసేబాధ చూసి
సాయపడకపోతిని మిషతో నే దాటవేసి
కష్టాలకు చిరునవ్వే మందని నేర్పావు
కన్నీళ్ళకు తావీయని దృఢ హృదయము నిచ్చావు
ప్రతి జన్మలోనూ నీ కడుపున ననుమోయి
అమితమైన అనురాగం నా కందగజేయి
మళ్ళీపుట్టినపుడు నిను మాడ్వనమ్మా
విధి ఎంతగ వేధించినా నేనేడ్వనమ్మా


Monday, December 9, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సిత్రమే కవి బతుకు శివుడా
ఆత్రమేలా తనకు భావాలు కక్కంగ భవుడా
పట్టమంటే కప్ప ఒప్పుకోదాయే
విడవమంటే పాము తప్పుకోదాయే
కత్తిమీదిసాము తీరాయే కలమునకు
స్వేఛ్ఛలేకా రాయు కవితలవి ఎందులకు

1.అనుభూతి చెందికద చేయాలి రచనలు
శబ్దరస స్పర్శరూపగంధాలె స్పందనలు
నవరసాలొలికించ తగినదే గద సాహితి
రవిగాంచడేమొగాని కవికేది పరిమితి
కట్టడితోపుట్టునా కమనీయ కావ్యాలు
ఆంక్షలతో అక్షరాలు తీర్చునా లక్ష్యాలు

2.శృంగారం నిశిద్ధమే సభ్యసమాజానికి
అభ్యుదయం కంటగింపు ప్రతి ప్రభుత్వానికి
కరుణరసం పెడసరం నిత్యానందులకు
భీభత్సం భయానకం రౌద్రాలు ఎందులకు
శాంత హాస్య అద్భుతాలు తయారే విందులకు
దశమరసం మౌనాన్ని వహించాలి సుఖానికి

Saturday, December 7, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం :శహనా

ఎదురుచూచు వేళలో అభిసారికవో
ఎదను పరచుసమయాన అపర రాధికవో
వలపుకుమ్మరించగా వరూధినీ ప్రతీకవో
అలకబూను తరుణాన ఆభినవ సత్యభామవో
ఓ చంద్రముఖీ నా ప్రాణ సఖీ
నీవులేక నిలువలేను నిమిషమైనా
నినువినా మనలేను ఓక్షణమైనా

1.మైనాను మరిపించును నీ పలుకులు
కలహంసను తలపించును నీ కులుకులు
మయూరమే తయారగును గురువుగ నినుగొనుటకు
చకోరమే దరిచేరును నీకౌముది గ్రోలగనూ
ఓ చంద్రముఖీ నా ప్రాణ సఖీ
నీవులేక నిలువలేను నిమిషమైనా
నినువినా మనలేను ఓక్షణమైనా

2.ముంగిలియే తపించునీ రంగవల్లి కోసమూ
లోగిలిలో తులసికోట ఆశించును సావాసము
గృహమంతా శోభించునీ ఆలన పాలనలో
నా మనసే సేదదీరు నీ ఒడిలో కౌగిలిలో
ఓ చంద్రముఖీ నా ప్రాణ సఖీ
నీవులేక నిలువలేను నిమిషమైనా
నినువినా మనలేను ఓక్షణమైనా

Friday, December 6, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అవతారమెత్తుతాడు చక్రధారి
అవనీతలానా దనుజవైరి  శ్రీహరి
దుర్జనులను నిర్జించగ-దుష్కృతాలు హరియించగ
వినతులు వింటాడు-వెంటనే ఆదుకొంటాడు
కొలువుదీరి ఉంటాడు-కలియుగవైకుంఠమైన
వేంకటాద్రి శిఖరానా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా

1.నదులవరదగొనితెచ్చి-పాపుల ముంచేయును
సుడిగాలిఒడిజేర్చి-కౄరుల పరిమార్చును
అగ్నిశిఖల పడద్రోసి-దూర్తుల దహియించును
పంచభూత ప్రళయాలతో-పతితుల పరిమార్చును

1.పిడుగుపాటు కలుగజేసి-నిహతులవగజేస్తాడు నికృష్టులను
భూకంపాల భీభత్సాన-మట్టుబెట్టి మట్టికప్పు త్రాష్టులను
ఏమానవుడిగానో ఉసురుదీసి-మసిజేయును కామోన్మాదులను
పంచభూత ప్రళయాలతో-పతితుల పరిమార్చును

Thursday, December 5, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాయం కోరితి షిరిడీ సాయి నిన్నూ
భరోసా ఇమ్మని బతిమాలితిని బాబా నిన్నూ
ఎవరినడిగినా గాని నీగొప్పలు చెబుతారు
నీ లీలల అనుభవాలనూ ఏకరువెడతారు
నమ్మశక్యమౌతుందా అనుభూతి చెందేవరకు
మా ఇడుములు బాపక తప్పదు నీ ఉనికి కొరకు
శరణంశరణం సాయీ శరణం షిరిడీసాయీ॥

1.నీ నామం జపియించినంతనె- మనఃశ్శాంతి దొరికునందురు
గురువారం ఉపవసించగా-కోరికలీడేరునందురు
షిరిడీలో నీదర్శనమ్ముతో-చిత్త భ్రమలు తొలగునందురు
విభూతిని నుదుట ధరించిన-భయములు మటుమాయమందురు
నమ్మశక్యమౌతుందా అనుభూతి చెందేవరకు
మా ఇడుములు బాపక తప్పదు నీ ఉనికి కొరకు
శరణంశరణం సాయీ శరణం షిరిడీసాయీ॥

2.మా దృష్టి నీపై ఉంటే  బాధ్యతగా మము కాతువందురు
నీ చరిత్ర పారాయణతో-చిక్కులన్నీ తీరునందురు
దానగుణము కలిగుంటే సంపదలు తులతూగునందురు
నిన్ను శరణుపొందితే వ్యాధులన్ని నయమౌనందురు
నమ్మశక్యమౌతుందా అనుభూతి చెందేవరకు
మా ఇడుములు బాపక తప్పదు నీ ఉనికి కొరకు
శరణంశరణం సాయీ శరణం షిరిడీసాయీ॥
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:కాంభోజి

దేహం నువ్వైతే ప్రాణం నేనౌతా
రాగం నువ్వైతే-గీతం నేనౌతా
దవనం నువ్వైతే మధురిమ నేనౌతా
ప్రణయం నీదైతే నే పరవశమైపోతా

1.నీ కనుబొమల కనుమల్లో ఉదయ సింధూరమౌతా
నీ పెదవుల సింగారానికి అరుణ మందారమౌతా
నీమానస సరోవరంలో కలహంసనై నేవిహరిస్తా
నీపదముల మంజీరము నేనై కదలికల రవళిస్తా
దేవత నీవైతే కోవెల నేనౌతా
నీజీవిత పల్లకీ బోయీని నేనౌతా

2.సాధారణ కృత్యాల్లోనూ మధరానుభూతినౌతా
నిస్తేజ సమయంలోనూ ఉత్సాహం నేనైపోతా
ఎదలోని భావాలను రంజింల్లు కవితగ రాస్తా
నీ ఊహలచిరునావను స్వప్నదీవి నేచేరుస్తా
అమ్మవు నీవైతే అక్కునజేరుతా
పాపవు నీవైతే నా కనుపాపగ సాకుతా

Tuesday, December 3, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా గానమా నా ప్రాణమా
నా జీవమా నా సర్వమా
నా మౌనమా నా ధ్యానమా
నా లోకమేనీవెగా నాసర్వస్వమా

1.గుండెలు రెండు లయ ఒక్కటిగా
కన్నులు నాలుగు ఒకటే చూపుగా
దేహాలు వేరైనా భావాలు ఒక్కటిగా
యుగళద్వయ పాదాలైనా-నడుచు మార్గమొక్కటిగా
పెనవేసుకొంది బంధం యుగాలు దాటి
సాగుతోంది మన పయనం గ్రహాలు మీటి

2.నీలో చీకటి తొలగించే రవినే నేనౌతూ
నీపై వెన్నెల కురిపించే శశినే నేనౌతూ
నదులు సంగమించి కడలైనట్టుగా
మరులుగొన్న విరితావుల్లో మకరందమైనట్లుగా
నేనూ నీవూ  కోల్పోయి మనమై పోయాము
పరస్పరం ఐక్యమై ఒకరిగ మారాము

Monday, December 2, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అలంకారప్రాయమేనా నీ ఆయుధాలన్నీ
పటాటోప భయంకరమేనా నీ విలయనర్తనలన్నీ
రుద్రుడవూ వీరభద్రుడవనునవి నేతి బీరనామాలేనా
మూసుకున్న మూడోకన్ను మదనుని పాలేనా
తలుచుకుంటే శివా జరుగదా ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి  అయోమయం

1.కుముదాన్ని ఊదితే అవని వణికి ఊగదా
ఢమరునాదమొక్కటే గుండెలదరజేయదా
త్రిశూలాన్ని వాడితే పశుప్రవృత్తి మాయాదా
అనాలంబి మీటితే అనురాగం విరియదా
తలుచుకుంటే శివా జరుగదా  ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి అయోమయం

2.బుసలుకొట్టు కామాన్ని బూదిచేయవేమయా
గరళకంఠ మద్యమింక ఇల హరించవేమయా
జనులకొకటె మత్తుకలుగ భక్తి ననుగ్రహించవయా
పడతులంత పార్వతీ మాతగ తలపించవేమయా
తలుచుకుంటేశివా జరుగదా ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి అయోమయం
దిగబడింది గునపమల్లె
గుండెలోతుల్లో గులాబీముల్లు
మరులుగొంటి భ్రమరమల్లె
మధుర సుధలుగ్రోలు కాంక్షమీర
పూవూ తుమ్మెద బంధమేనాటిదో
రెంటి ప్రణయ బంధమే పాటిదో

1.సీతాకోకా చిలుకలతో పోటీ
తేనేటీగలా ధాటిని దాటీ
నల్లనైన తన ఆకృతి తోటి
ఝంకార సరాగాలె మీటి
ఆకట్టుకోవాలి అందాలవిరులను
రసపట్టు పట్టాలి మకరంద ఝరులను

2పంకజాల జాలం మత్తు మందే
పడమటి పొద్దు వాలకముందే
వదిలి వెళ్ళి తీరాలి కౌగిలి పొందే
తృటిపాటి జాప్యమైతె బ్రతుకుఖైదే
నొప్పింపకతానొవ్వక తప్పుకోవాలి
ఏగాయ మవకుండా ఎగరాలి సుమాలవాలి

కన్నీటిని సిరాగా  నింపిన కలంతో
రాస్తే ఏం కనబడుతుంది గుండె కోత కవితగా
కత్తి దింపి స్రవించిన రక్తంలోనో
కాల్చేసిన మసికల్గిన ద్రావకంలోనో
ముంచి లిఖించు ప్రపంచం కాంచకమానదు
ప్రతి రచనను శిరోధార్యంగా ఎంచక మానదు

1.మితిమీరుతున్నది నానాటికీ నాతి అభద్రత
గతితప్పుతున్నది సమాజంలో వ్యక్తి బాధ్యత
తప్పులను కప్పిపుచ్చు కప్పదాటు చట్టాలు
కౄరనేరస్తులనూ సమర్థించు న్యాయపరిధి లొసుగులు
దోషులపాలిటి యమపాశలయ్యేలా తక్షణ తీర్పులు
పెట్రేగే అంగాలను ఖండించే రీతి కఠినాతి కఠిన శిక్షలు

2.పునరావృతమౌతుంటే నిర్భయ దుర్ఘటనలు
ఓట్లు రాల్చగలవా కులమత రాజకీయ నటనలు
స్త్రీజాతికి ఎంతటి దుర్గతి భరతమాత లోగిలిలో
దారుణ మారణ మూలాలు పెకలించగ ఏలమీనమేషాలో
రతనాలు అంగళ్ళలోనాడు మద్యం మాదక ద్రవ్యాలు నేడూ
విద్య వైద్యం విపణిలోనేడు  విచ్చలవిడి విలువల దిగజారుడూ

అందరు నిదురోయాక-మేలుకొంటానేను
కవితలద్వారా జగతికి-మేలుకోరుతాను
ఎప్పుడూ కనుమూయని కవినే నేను
అర్దరాతిరైనా వెలిగే రవినే నేను

1.కడుపులొ ఒకటి బయటకు ఒకటి ఎరుగనివాడను
పర్యవసానం ఏదైనా కుండ బ్రద్దలుకొడతాను
ఇతరులు చూడని కోణంలో వెతలను చూస్తాను
విషయం ఏదైన ఎదలకు హత్తుకునేలా చేస్తాను
చైతన్యం జ్వలించే మిత్రుడనేను
అనునిత్యం సత్యం వచించే పవిత్రుడనేను

2.ఎడారి బ్రతుకుల ఎప్పుడు నిలిచే వసంతం నేను
మాటపెగలని మనుషుల తరఫున సమర శంఖం నేను
చిరుస్పర్శకే పులకించిపోయే చిగురాకునే నేను
ప్రశంసకే పొంగిపోయే పసి హృదయం నేను
అర్థంకానివారికి పిచ్చి మాలోకం నేను
పరమార్థం గ్రహించువారికి హాయిగొలిపే మైకం నేను