Friday, December 24, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనుల కురిసేను చంద్రికాపాతాలు

అధరాల ఒలికేను సుధామధురాలు

నీ మాయలో బడని మనిషేడి మహిలోన

నినుగని అనిమేషులమే వీక్షించిన తక్షణాన


1.ఉదయించును నీ నుదుట ప్రత్యూష భానుడు

ప్రభవించును ముక్కెరగా పంచమితిథి చంద్రుడు

కృష్ణవేణి నదీ ప్రవాహం నీ నీలి కురుల సమూహం

రేగేను పరమేశునికి నీ చెంతన మరులు అహరహం


2.నీ ప్రతి రూపమే ఇలలో ప్రతి స్త్రీ మూర్తి

సౌందర్యలహరివి నీవే తీర్చవేల మా ఆర్తి

అడుగడుగున మామనుగడకు నీవేగా స్ఫూర్తి

నీ సన్నిధి చేరినపుడే నా మనసుకు సంతృప్తి

……………………………………… జన్మలకిక పరిపూర్తి

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఆది అంతము లేనివాడు

చావు పుట్టుక లేనివాడు

నీలోను నాలోను కొలువైనవాడు

లోకములనేలేటి లోకేశుడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ


1.అక్షిత్రయముతో అలరారు వాడు

కుక్షిలో విశ్వాన్ని కూర్చుకొన్నాడు

పక్షివైరుల ఒడలంత దాల్చువాడు

దక్షిణామూర్తిగా ప్రథమ గురువైన వాడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ


2.భిక్షమెత్తును గాని ఐశ్వర్యమిస్తాడు

పరీక్షించితేనేమి మోక్షమే ఇస్తాడు

ప్రతిఫలాపేక్ష లేకుండ పనిచేయమంటాడు

దక్షాధ్వరధ్వంసి జగతికి ఏకైక లక్ష్యమేవాడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ

 

https://youtu.be/Md4If263fAs?si=uxRSvKNmbA1u65fq

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ధనుర్మాసమంటేనే గోదా రంగనాథులకు ప్రీతి

మాసానం మార్గశీర్షోహం అని కదా గీతన ప్రతీతి

భక్తులకు వైష్ణవానురక్తులకు హరిపదమే శరణాగతి

బ్రహ్మీ ముహూర్తాననే స్వామికి అభిషేకార్చన హారతి


1.గజగజ వణికే వేకువ ఝామున  జాగృతమొంది

గజరాజ వరదుని నిజ మనమున ఆరాధించి

తులసీదళ మాలల గోవిందుని గళమున వైచి

తిరునామాలు తిరువాభణాలు అలంకరించి

తరించెదము ఇహపరముల నరహరి కనుగాంచి


2.శేషశయనుడు పద్మనాభుడు సిరి వల్లభుడు

క్షీరాబ్ది నిలయుడు భక్తసులభుడు ఆండాళ్ విభుడు

వైకుంఠ వాసుడు  వైజయంతి మాలాలంకృతుడు

శంఖచక్ర కర ధరుడు కౌస్తుభమణి వక్షాంకితుడు

గరుడ గమన సంచరుడు సాక్షాన్మోక్ష ప్రదాయకుడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఊహల మంజరిని ఇస్తున్నా కానుకగా

మానస మంజూషను అర్పించా బహుమతిగా

ఎన్నెన్ని జన్మలెత్తినా నీవే నా శ్రీమతిగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా


1.బలమైన తరుణం లో పరిచయమైనావుగా

అలవోకగ నను బుట్టలో వేసుకున్నావుగా

ఆత్మీయ మైత్రితో నేస్తమై  అలరిస్తున్నావుగా

అపూర్వమై అపురూప బంధమై పెనవేసినావుగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా


2.అనుక్షణం పరితపించి నను తలిచే నెచ్చెలిగా

ప్రణయంలో ముంచెత్తే నా ప్రియురాలిగా

నాతో కలిసి కడదాకా అడుగులేయు ఇల్లాలిగా

నన్నల్లుకపోయావే అభేదమై సిరిమల్లి వల్లిగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా