Tuesday, November 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:అమృత వర్షిణి

వెన్నెలే ఘనీభవించి
మోవిలో ద్రవీకరించి
కన్నుల్లో ఆసాంతం కురిపించి
చేసాడు సాయమెంతొ నిను నాకందించి
బ్రహ్మకెపుడు అందుకే వందనమందు శిరసువంచి

1.కమలాలే నయనాలుగ రూపొందించి
అమృతాన్ని అధరాల్లో కూర్చిఉంచి
కపోలాల రోజాలవన్నెలుపంచి
తీర్చిదిద్దాడు నిన్నెంతో నన్ను కనికరించి
అందుకే నాకెపుడు ప్రియదైవమె విరించి

2.గోదావరి నే నీ ఎదగా మలిచి
కృష్ణవేణి వడ్డాణంగ నడుమున బిగించి
హిమనగములు మేరుగిరులు ఇరుదెసల పొదిగించి
సృష్టించి వరమొసగెను విధాత
అందుకే ఆస్వామికి నా చేజోత
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:కానడ

తాళను నేనిక బాలా,వరాల జవరాలా
ఈవేళనూ నీ రూపుగనిన ఏ వేళనూ
మనజాలను నువువినా విరహసెగలను

1.నీ అంగాంగం మదనకేళీ లీలా విలాసం
నీ మేను ఏడాది పొడుగూ మధుమాసం
నీ తనువు బృందావన యమునావిహారం
నీ దేహమే ఇహపర సుఖకర కైవల్య సారం

2.ముట్టుకుంటె పట్టులాంటిది నీ స్పర్శ
ముద్దెట్టుకుంటే మధువుతీరే ఆ నషా
ముద్దవనీ తడిసి నీ చెమటల వర్షానా
మునిగిపోనీ నను అగాధ జలధులలోనా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాయామాళవ గౌళ

పురుష పుంగవులం
పేరుకే పురుషోత్తములం
పెళ్ళాడే వరకు తల్లిచాటు పిల్లలం
మూడుముళ్ళు మగువ కేసి
సంకెళ్ళు వేసుకునే మగలం
మృగతృష్ణకు వగచే బాటసారులం
భార్యా బాధితులం

1.శాంతి గురించి ఎరుగని వాళ్ళం
ఏ జ్యోతి వెలగని బ్రతుకులం
వెన్నెల కోసం చూసే చకోరులం
సూర్యకాంతమంటి అయస్కాంతానికే-
బంధీలం జీవిత ఖైదీలం.

2.కొడుకుగా తండ్రిగా సోదరునిగా
చీచా మావా బావా లైన బహురూపిగా
మేకపోతు గాంభీర్యం ఆహార్యంగా
యుగాలుగా దగాపడిన మగజాతికే
వారసులం నామమాత్రపు సరసులం