Thursday, September 3, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శరణు శరణు ధర తిరుమలవాసుడా
ఇందీవరశ్యామ మందహాస వదనుడా
సుందరాకారా శ్రీకరా శ్రీనివాసుడా
మనిజన వందిత భవబంధ మోచకుడా
గోవిందా ముకుందా నమో చిన్మయానందా

1.ఆపాద మస్తకం నీ రూపుని వర్ణించితి
సుప్రభాతాది పవళింపు సేవల నుడివితి
నీ అవతార కారణ గాథను వివరించితి
తిరుపతి క్షేత్ర ఘనత సాంతము తెలిపితిని
ఇంకేమని రాయను ఇభరాజ వరదా
గోవిందా ముకుందా నమో చిన్మయానందా

2.మహితమైన నీ మహిమలు నే కొనియాడితి
నీ భక్తవరులు కీర్తించిన తీరును వెలయించితి
సతులిరువురితొ నీ సఖ్యత నాఖ్యానించితి
నీ దయాపరత్వము హృద్యముగా విరచించితి
ఇంకేమని పాడను ఇంద్రాది సురసేవితా
గోవిందా ముకుందా నమో చిన్మయానందా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నను రాయనీ
నీ హృదయ పత్రం పై ప్రేమ లేఖనీ
నను గీయనీ
నా మనోఫలకంపై నీ రూపాన్నీ
చెలీ పెనవేయనీ మన అనుబంధాన్నీ
ప్రియా ముడిపడనీయనీ మనజీవితాలని

1.అర్థిస్తే కలుగదు అనురాగం
ప్రాధేయపడితె ఇచ్చేది ప్రేమ అనం
వ్యక్తిత్వపు గుర్తింపుకు బహుమతి ప్రేమ
స్వచ్ఛమైన మనసే ప్రేమకు చిరునామా
చెలీ పెనవేయనీ మన అనుబంధాన్నీ
ప్రియా ముడిపడనీయనీ మనజీవితాలని

2.ప్రేమకు ఎప్పుడూ ప్రారంభమే
చరితలు తిరగేస్తె ప్రేమ అజరామరమే
ప్రేమ కెపుడు ఉండదు విఫలమన్నది
మరువకు  ప్రేమించే హక్కు నీకున్నది
చెలీ పెనవేయనీ మన అనుబంధాన్నీ
ప్రియా ముడిపడనీయనీ మనజీవితాలని
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కవితలు మారవు అనుభూతులు వీడవు
కన్నీటి ధారాపాతానా గుండెమంటలారవు
పదాలూ తప్పవు పెదాలూ నవ్వవు
జ్ఞాపకాల గోదావరిలో అలజడులు ఆగవు

1.వదులుకోలేని వాక్యాల గోల
కలచివేసేటి అనుభవాల కీల
ఒడవని పురాణమే మన ప్రేమాయణం
రావణకాష్ఠమే మన విషాద కథనం

2.ఎక్కడ మొదలైనా ఒకటే మలుపు
తప్పుఎవరిదైనా కారణం మన వలపు
కరువైపోయింది ప్రేమగొలుపు నీపిలుపు
కడహీనమయ్యింది దినదినం నా బ్రతుకు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పాలకడలి చిలికినపుడు పుట్టావో
పరమశివుడి ఆనతితో నా జత కట్టావో
స్రష్టసృష్టి ఎరుగని సౌందర్యం నీవో
జగన్మోహిని  దివ్య అవతారానివో
దివిజగంగ పావన సలిలం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

1.గరళం మ్రింగినందుకు ప్రతిగా
నిను పొందె భవుడు వేల్పుల బహుమతిగా
ఇరువురి ఇంతులతోనే వేగని ఈశ్వరుడు
నా మీది ప్రేమతో నిను ముడిపెట్టాడు
చంద్ర కిరణ శీతల అనిలం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

2.కాలకూట విషం మినహా
క్షీరాంబుధి జనిత అద్భుతాల సహా
కలబోసి కూర్చిన అతిలోక సుందరి నువ్వు
నభూతోనభవిష్యతి నీ చిరునవ్వు
నవపారిజాత పరిమళం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఏ పుణ్యము చేసుకుందొ  వేణువు
మాధవు పెదవుల మధువులు గ్రోలగా
ఏ వ్రతము నోచుకుందొ పింఛము
గోవిందుని శిఖన జేరి మెరవగా
ఎంతటి తపమాచరించెనో తులసీదళము
వాసిగ వాసుదేవునే సరితూచగా
ఏ విధి సేవించెనో కాళీయ పన్నగము
బాలుని పదముద్రలు ఫణమున బడయగా
వందే కృష్ణం యదునందనం
వందే యశోదా ప్రియ సూనం

1.చెఱసాలకు సైతం విలువ హెచ్చెగా
 దేవకి గర్భాన హరియే జన్మించగా
ఖరముకైన కాసింత స్థలము దొరికెగా
భాగవత పుటలయందు స్థిరపడిపోవగా
రేపల్లే గోకులము గోపకులు గోపికలు
నిరంతరం తరించగా మధుర మధురమాయెగా
ఆద్యంతం లీలలతో జన హృద్యమాయెగా
అబ్బురపడి పోవగా అంతా కృష్ణమాయేగా

2.కబళింపగ జూసిన కర్కశ రక్కసులను
మట్టుబెట్టె జెగజ్జెట్టి మన్మోహన బాలుడిగా
కుబ్జను కుచేలుడిని కుంతీ మాద్రి సంతతిని
కృష్ణను కాచాడు ఆపద్బాంధవుడిగా
రాజకీయ చతురతతో రాయభారమొనరించి
కురుక్షేత్రాసమరం నడిపాడు సారథిగా
మానవాళికంతటికీ మార్గదర్శనం చేసే
గీతా మకరందం పంచాడు జగద్గురువుగా