Wednesday, August 19, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఉండేది తెలియదు పోయేది తెలియదు
ఎంతకాలం మనగలమొ తెలియదు
మూడునాళ్ళ ముచ్చటాయే బ్రతుకు సాయీ
ఇప్పుడైనా ఉన్న సమయం నిను వెతుకనీయీ

1.అహము మోహము వదలవాయే
కామనలు నను వీడవాయే
ఆగ్రహమ్మే అదను చూసుక ఉబుకునాయే
నిగ్రహపు ఆచూకియే ఆనదాయే
ఎందుకొచ్చిన భేషజాలివి సాయీ
నీ దివ్యపదమున చోటీయవోయీ

2.నిన్ను గానక కన్నులె తలనెక్కెనోయీ
నిన్ను తలవక నాలుకే బిరుసెక్కెనోయీ
నీదు లీలలు ఆలకించక చెవులు దిమ్మెక్కెనోయీ
నీదు సన్నధి చనకనే కాళ్ళు రేగళ్ళాయెనోయీ
కాస్త దయతో నన్నిక పట్టించుకోవోయీ
నీ దివ్య పథమున చేయిపట్టీ నడిపించవోయీ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కళ్ళతోనే జుర్రుకుంటా-మకరందమేలే నీ అందము
చూపుతోనే గ్రోలుతుంటా-అమరసుధయే నీ అధరము
ఎలానిన్ను సృష్టించాడో బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు

1.జాబిలిని మాయచేసి నీ మోమున అద్దాడు
రవిబింబం వాలినప్పుడే నీ నుదుటన దిద్దాడు
నీలిమేఘమాలను తెచ్చి నీ కురులుగ మార్చాడు
పలురకాల విరులను గుచ్చి నీ మేనున కూర్చాడు
ఇలానిన్ను సృష్టించాడే బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు

2.ముందేమో వింధ్యామలలే ఎదన పేర్చాడు
వెనకాల మేరుగిరులనే నితంబాలు చేసాడు
రోదసీకుహరాలు పొంకాలుగ అమరించాడు
కృష్ణబిలాలేవో పొందికగా నిర్మించాడు
విశ్వరచన చేసాడు నీలో బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పెద్దగా బ్రతకాలనేం లేదు
అర్ధాంతరంగా చావాలనీ లేదు
ప్రతిక్షణం చస్తూ బ్రతకాలని లేదు
ఆత్మను బలిచేస్తూ చావాలని లేదు
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా

1.ఉన్ననాల్గు నాళ్ళైనా నవ్వుతూ బ్రతికేయాలి
చనిపోయే సమయంలోను పెదాలపై నవ్వుండాలి
సునాయాసంగ బ్రతకాలి బ్రతుకంతా
అనాయాసంగ చావాలి చావు వొచ్చినంత
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా

2.ఎన్నేళ్ళు బ్రతికితె ఏమి జీవశ్చవాలమై 
మూణ్ణాళ్ళుఉన్నాచాలు ఘనకీర్తిశేషులమై
జన్మ ఎత్తినందుకు సార్థకం కావాలి
మంచిపనులనొనరించి చరితార్థం కావాలి
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా