Thursday, August 20, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అలలై తేలివచ్చే దేవళపు మేలుకొలుపు
పావనమౌ సుప్రభాతం వీనులకే హాయిగొలుపు
కూటికొరకు గూడునొదిలే పక్షుల కువకువలు
గాలిలోన తేలివచ్చే మల్లిజాజి మధురిమలు
ప్రేమగా తట్టిలేపే అమ్మలాంటి చిరుపవనాలు
ఇది కదా అందరికీ శుభోదయం
ఇదే కదా లోకానికి ఉషోదయం

1.పంటచేలు కంటూసాగే ఎడ్ల మెడలొగంటల సడులు
మందగా మేతకు నడిచే పాడి పశువుల సందడులు
కళ్ళాపి చల్లుతుంటే ఇల్లాళ్ళ గాజుల సవ్వడులు
రంగవల్లి దిద్దే పడుచుల జడకుప్పెల విసవిసలు
దినచర్యకు ఆయత్తంగా పల్లె తల్లి పదనిసలు
ఇది కదా అందరికీ శుభోదయం
ఇదే కదా లోకానికి హసోదయం

2.మబ్బుననే లేచికునుకుతూ చదివే పిల్లల గొణుగుళ్ళు
కొత్తకోడళ్ళపైన పెత్తనాలతో అత్తల విసిగే సణుగుళ్ళు
దంతావధానాల పుకిలింతల వింతౌ చప్పుళ్ళు
బహిర్భూమికై కడుపులో ఏవో తెలియని గడిబిళ్ళు
ఉత్ప్రేరకమౌ కాఫీ టీలు వెంటనె అందక అరుచుళ్ళు
ఇది కదా అందరికీ శుభోదయం
ఇదే కదా లోకానికి రసోదయం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కీరవాణి

నిత్యమూ నా కవితకు స్ఫూర్తివి నీవే
నే పాడే పాటకు మొదటి శ్రోతవు నీవే
నా నుదుటన విధిరాసిన గీతవు నీవే
నేను కనే తీయనైన కలవు నీవే
నా కనుల ఎదటనూ కలవు నీవే

1.ప్రత్యూష వేళలో తొలికిరణం నీవే
తొలకరి గుభాళించు మంటి గంధంనీవే
కార్తీక పౌర్ణమిలో విరగ కాయు కౌముది నీవే
ఆమనిలో విరివిగా విరియు విరియూనీవే
నేను కనే తీయనైన కలవు నీవే
నా కనుల ఎదటనూ కలవు నీవే

2.ధ్వజస్తంభాన మ్రోగె మంజుల సడినీవే
గర్భగుడిలో కొడిగట్టని దీపకళిక నీవే
కోవెలలో నినదించే చతుర్వేదఘోష నీవె
స్వామి మెడను అలరించే తులసిమాలనీవే
నేను కనే తీయనైన కలవు నీవే
నా కనుల ఎదటనూ కలవు నీవే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సూర్య

రూపు సౌందర్యం-మాట మాధుర్యం
ఎదన ఔదార్యం-నడత చాతుర్యం
మొత్తంగా నీతో ప్రణయం నా ఆంతర్యం
ప్రాప్తమైతె చాలు చెలీ నీ సాహచర్యం

1.లేత తమలపాకు వంటి ఒంటి సౌకుమార్యం
తెలుగుదనం ఉట్టిపడే ఉగాదిలా ఆహార్యం
భారతీయ వనిత తెగువలా ఎనలేని శౌర్యం
అబలకాదు సబలనిపించే కడుమొండి ధైర్యం
ఇన్నియున్న ఇంతీనీవు ఇలలోనే ఆశ్చర్యం
ప్రాప్తమైతె చాలు చెలీ నీ సాహచర్యం

2.నిన్ను చూసిచూడగానే బుగ్గిపాలె బ్రహ్మ చర్యం
లాఘవంగ చేసావే నా మనోనిధిని చౌర్యం
నూరేళ్ళ జీవితమంతా సఖీ నీకు కైంకర్యం
నాతో సహజీవనం ఐఛ్చికమూ అనివార్యం
ప్రాప్తమైతె చాలు చెలీ నీ సాహచర్యం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మనిషికి మనిషికి మధ్యన ఎన్ని అగాథాలు
మనిషికి మనసుకు మధ్యన ఎన్ని అగడ్తలు
ఎరుకపరచకుంటె మానే ఏ పొగడ్తలు
కించపరచనేల ఎరుగకనే ఉచితానుచితాలు
సంస్కార హీనతే ఎంతదౌర్భాగ్యం
కన్నవారికైనా తప్పదు హీన సుతులతో దైన్యం

1.విర్రవీగుతారు ఏ మాత్రం విజ్ఞత లేక
పెట్రేగుతారు తమ స్థాయిని గమనించక
గౌరవం మర్యాద బ్రహ్మ పదార్థాలు
మితిమీరిన చేష్టలకు ఉండబోవు అర్థాలు
సంస్కార హీనతే ఎంతదౌర్భాగ్యం
కన్నవారికైనా తప్పదు హీన సుతులతో దైన్యం

2.అంతంత మాత్రపు చదువులు ఎంతటిచేటు
శీలము వినయాలకు మదిలోన ఉండదు చోటు
వ్యర్థంగా వాదిస్తూ ఒప్పుకోరు తమ పొరపాటు
విధివశాత్తు తాసరపడితే మనపాలిటి గ్రహపాటు
సంస్కార హీనతే ఎంతదౌర్భాగ్యం
కన్నవారికైనా తప్పదు హీన సుతులతో దైన్యం