Sunday, July 17, 2022

 శివోహం శివోహం పరమశివం

నీవంటే నాకు లేదు భేదభావం

శివోహం శివోహం మహాదేవం

అహం దహించెనా త్వమేవాహం


1.చిక్కులు నీకున్నవి తలలోనే

నా బ్రతుకంతా చిక్కుబడే వెతలలోనే

శివగంగ అలుగంగ ఇలన కరువుకాటకంగా

నా నయన అశ్రుగంగ జాలువారు అనవరతంగా

నీకు నాకు లేనే లేదు భేదభావం

భ్రమర కీటక భంగి శివోహం శివోహం


2.నుదుటి కంట మంట మండు నీకు

అశాంతితో మండు చుండు గుండె నాకు

నాగాభరణాలతో  మేనంతా నీకు

రోగాభరణాలతో కడుచింతే నాకు

నీకు నాకు లేనే లేదు భేదభావం

ఇనుమయస్కాంతమైనటుల శివోహం శివోహం






https://youtu.be/mD0T6rUYOBY

పరమ దయాళా

పరమేశ్వర పింగళా

భక్త వరద ధవళ పుద్గలా

పురహర వందే నీలగళా


1.విశాల  హృదయా

కాశీ విశాలాక్షీ ప్రియా

విశ్వేశ్వర గంగాతీరనిలయా

పశుమతిని నేను పశుపతి 

పరి పాలించవయా


2.తిన్నడి పాటి నే గానా

మార్కండేయుని బోలనా

కరి కర్కటి సాటి తూగనా

భోళాతనమున ఎంచగ 

నను పంచాననా


 నా వెన్నుదన్ను నీవే అన్నులమిన్నా

నా ఎదకు కన్ను నీవే

వన్నెల వదనా

నా ప్రతి విజయం వెనక నీవే

నా శ్రీమతి గీతా

అడుగడుగున తోడునీవే  సుందర హసితా

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


1.సరిగమలను ఒలికించే సంసార వరవీణవు

మధరిమలను చిలికించే నా మానస సదనవు

అనుకున్నది సాధించేలా విశ్వాసం నింపే ప్రేరణవు

తరచి తరచి తర్కించే నా జీవన విశ్లేషణవు

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు


2.ఉడికించేవు ఊరించేవు వారించేవు వారిజనేత్రి

మురిపించేవు నను మై మరపించేవు కోమల గాత్రి

సహనంలో సాటి నీకు రాగల దిలలో ఒకటే ధరిత్రి

శతమానం భవతి నా ప్రియసతీ

వీడనీకు మన జన్మల మైత్రి

అందుకో అందమా నీకివే నా శుభకామనలు

నీ పుట్టిన రోజిది గొనవే వేవేల దీవెనలు