Sunday, May 16, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను చూడాలని నాకెంతో తహతహ

ఒక్కసారి కనిపిస్తే యమహో యమహ

అపూర్వమౌ నీ అందం దేవకన్య తరహా

ఆ అందం అందినంత బ్రతుకంతా ఆహాఁ


1.ఎత్తగలను ఎన్ని జన్మలైనా  

నీ అధరామృతమునేనందగ

మరణించగలను ఈక్షణమైనా

ఒకే ఒక సారి నీ పొందుపొందగ

ననుబ్రతికించుట నీచేతిలోనే 

బుగ్గల నునుసిగ్గు చాటు భామా

ఇంతకన్న ఎలాతెలుపగలను 

చాటుమాటు నాఘాటు ప్రేమా


2.ప్రతి నిమిషం నీజపమే నామది

వరమిచ్చే వరకు నిను వదలనంటిని

నా మనోనివేదనే నమ్మవే ఇది 

అనుకోకు చెలీ నాదొక గాలి పాటని

ఒక్కసారి తెలుపవే నీ ప్రేమని

ఐపోతా బ్రతుకంతా నీ బానిసని

సుందరీ నా ఎదురుగ నీవుంటే

కవితలు వెల్లువెత్తు నినుకంటే

 

https://youtu.be/Vo8sDPJ5O20?si=HhFWV2Y55VhmPPHG

(విశ్వకవి రవీంద్రుని కవిత ఆధార నా స్వేఛ్ఛాగీతిక)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇప్పుడే తెలుపు నేస్తం నా మరణ సంతాపం

వెంటనే వెళగ్రక్కు నేస్తం నా వెలితి పరితాపం

బ్రతికుండగా నే ఎరగాలి  నీ ఎద విలాపం

నీ కనుకొలుకుల నుండి నువు చేసే అశ్రుతర్పణం


1.పోయినోళ్ళందరూ మంచివాళ్ళే అనుకుంటే

నా గురించి చెప్పు భాయి నాల్గు మంచిముక్కలు

నేను లేనిలోటును అనుభూతి చెందుతుంటే

ఈ క్షణం తేల్చుకోవోయి జమాఖర్చు లెక్కలు


2.తదనంతరమిచ్చేటి బిరుదులేవొ ఉటంకించు

ఫోటోకు ఎందుకు దండ నా మెడకే తగిలించు

ఎవరెవరు పొగిడేరో ఎంతగా నా వెనక తెగడేరో

నాముందే వక్కాణించక పాడెముందు పాడేరో


3.పోయాక రానేరాదు నీకు నాకు అవకాశం

మనసువిప్పి కుప్పవేద్దాం మన భావావేశం

శ్రద్దాంజలి నాఎదుటే ఘటించనీ సమావేశం

చేజారక ముందే  విలువనెంచమని నా సందేశం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ మాటలన్నీ నీటిమూటలే

నీ బాసలన్నీ గాలిపాటలే

నమ్మితే వంచించే నయవంచకివి

నట్టేట ననుముంచే ఘరానా హంతకివి


1.బూటకాల నీప్రేమకు నేనే దొరికానా

నాటకాలు ఆడుకునుటకు నేనో బకరానా

వన్నెలెన్నొ కుమ్మరించి ఎరగా వేసావు

అన్నెంపున్నె మెరుగని నన్ను తేరగా దోచావు


2.వెలుగుకై ఆశపడితే శలభమై కాలాను

నీ ప్రేమలొ మునిగిపోయి శవంలాగ తేలాను

అగ్గిపాలు చేసావే పండంటి బ్రతుకును

బుగ్గిచేసి వేసావే నా బంగరు భవితను