Wednesday, July 13, 2022

 ఎంత సన్నని గీత

చావుకు బ్రతుకుకు మధ్య

కన్నుమూసి తెరిచేలోగా

ఈ ప్రపంచమే ఒక మిథ్య

గట్టునుండి చూసేవారికి

చెప్పలేని ఉబలాటం

వరదలొ కొట్టుక పోయేవారికి

జీవన్మరణ పోరాటం


1.అప్పటిదాకా నవ్వుతు తుళ్ళుతు ఉన్న మనిషి

కుప్పకూలిపోతుంటే

కళ్ళప్పగించడమే తెలిసీ

దేశాధినేతలైతే ఏమి

రాజాధిరాజులైతే ఏమి

నిస్పక్షపాతమే మృత్యుదేవతకు


2.నేల నీరూ గాలి నిప్పు

ముంచుకొచ్చిందంటే ప్రతిదీ ముప్పు

రోగం నొప్పి ప్రమాదం ఏదో ఓ కారణం

అనివార్యం అనూహ్యం వరించెనా నిర్వాణం

అనాయాస మరణం ప్రసాదించగా పరమాత్మకు విన్నపం


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్

రాగం:శుభపంతువరాళి


కనులు చెలమెలాయే

కనుకొలుకుల వరదలాయే

కనని వినని వేదనయే కారణమాయే

కనుగొనలేరెవరూ ఎద బడబానలమాయే


1.కక్కలేని మ్రింగలేని గరళమే ఇది

అవిరళంగ పారుతోంది  దుఃఖ నది

ఏ సాంత్వన పొందనిది మందన్నది లేనేనిది

గుండె రాచపుండై కబళించే

దండి దమనకాండ ఇది


2.పైనేమో చిరు నగవు పటారం

లోనేమో తెగని తగువు వ్యవహారం

రాపిడిలో నుసిగా రాలుతూ మనసు నలిగె చక్రవ్యూహం

మరణమొకటె తీర్చేటి అంతులేని వింతదాహం


 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవిని నేను  జీవనదిని నేను

కవితనై అనవరతం ప్రవహిస్తాను

ఎందరు దాహం తీర్చుకున్నా

ఎవ్వరు కలుషిత పర్చుతున్నా

ఆగదు నా కవనం అనంతమే నా పయనం


1.ఒకరి పట్ల అనురాగం లేదు

ఎవరి ఎడల ఏ ద్వేషం లేదు

కొండలు కోనలు ఎదురైనా అధిగమించి

వాగులు వంకలతో దారంతా సంగమించి 

సాగుతాను చైతన్యంగా సాగర తీరందాక

అడ్డుకట్టలెన్నికట్టి ఆపజూచినా వెనుకంజవేయక


2.ఏ పుష్కర పురస్కారం ఆశించక

దరులలో హారతులకై తలవంచక

ఒకోసారి ఉదృతమై ఉప్పొంగే వరదగా

ఎల్లకాలం మానవాళి మనుగడకే వరదగా

కల్మషాలనే సమాజంలో సమూలంగా కడిగేస్తా

గలగలగా గంభీరంగా అలజడిగా సడిచేస్తా




 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉంటావేల స్వామీ కొండలపైన

ఉండలేవా ఏమీ మా గుండెలలోన

తిరుమలలో బదరీనాథ్ లొ వైష్ణవత్వంగా

శ్రీశైలంలో కేదార్ నాథ్ లొ శివతత్వంగా

వేలవేల భక్తులు లక్షలాది యాత్రికులు దర్శనార్థమై పడరానిపాట్లు

నీ గిరి కొస్తే నీ దరికొస్తే ఎందుకయా అగచాట్లు


1.అకాల వర్షాలు ఉధృతమైన వరదలు 

హఠాత్తుగా విరిగే కొండచరియలు

ఏ దారీ లేక దిక్కుతోచక అల్లాడుతు అలమటించు ఆపన్నులు

నమ్మికదా వచ్చినారు ఉంటాయని నీ వెన్నుదన్నులు


2.అడుగడుగున ఎదురయ్యే అవినీతికి బలియౌతూ

అక్రమాలు ఆగడాలు కనలేక కుదేలౌతూ

దూరాభారాలకోర్చి వ్యయప్రయాసలే భరించినా

కుటుంబాలు సభ్యులనే కోల్పోవుట నీకీర్తి పెంచునా