Wednesday, March 2, 2022

 

https://youtu.be/BCH_j6tuIbs?feature=shared

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(08/03/20


స్వావలంబన చేకొనుమా మహిళామణి

సాధికారత సాధించు నీవే నీవే మహారాణి

ఆర్థిక స్వేఛ్ఛ లేకపోవుటే నీకు వెనకబాటు

ఆకాశంలో సగంగ ఎదుగు వద్దంటూ వెసులుబాటు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


1.నిక్కచ్చిగా చదువుకొని చదువుల తల్లిగ భాసించు

తల్లి చదివితే తరతరాలు ప్రగతే యని నిరూపించు

ఉద్యోగాలూ చేయాలి ఊళ్ళను సైతం ఏలాలి

అన్ని రంగాల్లొ అభ్యున్నతినే అవలీలగ పొందాలి

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


2.సిరిసందలకు స్త్రీయే మూలం దర్జాగా ఆర్జించు

 ఆకతాయిల ఆటలు కట్టగ వీరనారిగా విజృంభించు

ఆత్మన్యూనతను అధిగమిస్తూ నీలో ప్రతిభను దీపించు

ప్రపంచ మహిళా దినోత్సవాన మహిలో మహిళగ గర్వించు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు

 

https://youtu.be/braTYeKZhlk


"కాలవలయం"

కాలచక్రం గిర్రున తిరిగింది

కళ్ళముందుకు మళ్ళీవచ్చింది

ప్రతి ఉగాదికంటే ఎంతో విశేషమైనదిది

అమ్మకడుపున అంకురమై నాడు నే వెలిసినది

శుభములు కూర్చుతుంది శుభకృతు ఉగాది

అరవై ఏళ్ళక్రితం ఇదే ఇదే నా ఉనికికి నాంది


1.అగ్రహారం నదీతీరం  చక్కని వాతావరణం

పచ్చని పైరులు చుట్టూ గిరులు చెక్కుచెదరని పర్యావరణం

నిర్బంధమె లేని విద్యావిధానం వీథి వాడా క్రీడా మైదానం

అమూల్యమైన బాల్యమే ఆటపాటల సన్నిధానం

సంస్కృతి సభ్యత సహితంగా సాగింది అభ్యసనం

శుభములు కూర్చింది నాడు జగతికి శుభకృతు 

శోభను మోసుకొచ్చింది ఆవెనుకే వచ్చిన శోభకృతు


2. మహానగరం గరం గరం అశాంతి వాతావరణం

వాయు శబ్ద కాలుష్యాలతొ విషతుల్య పర్యావరణం

చిత్తడి చిత్తడిగా తీవ్ర వత్తిడితో చిత్తవుతూ చిత్రంగా చిత్తం

లేనిదిలేదు మోదం మినహా యాంత్రికంగా కృతక జీవనం

కవనం గానం ఊపిరిగా మనుగడ సాగును ఆసాంతం

శుభములు తేవాలని ఉంది బ్రతుకున ఈ శుభకృతు

శోభను కలిగించాలని ఉంది వచ్చే ఏటికి శోభకృతు



https://youtu.be/m8SmhdL_XpU?si=FPxGzws0aoVk0pjs

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏకాదశి ఉపవాసమెన్నడుండగనైతి

శివరాత్రి జాగరణ నియతి చేయగనైతి

నడిచి దండిగ నీకొండ నెక్కగానైతిని

పట్టెడైనను అన్నార్తికిని పెట్టనైతిని

ఐనను నను ఆదుకో  అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో  చంద్రమౌళీశ్వరా


1.గోదారి గంగలో మేను ముంచకపోతి

దోసెడు జలమైన లింగాన పోయనైతి

పత్తిరి దళమైన శ్రద్ధగా నీ తలనపెట్టనైతి

భక్తిమీరగ హరహరా యని మ్రొక్కనైతి

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా


2.ననుగన్న నాన్నగను చనువుగనుంటిని

అనురాగమింకను ఆశించుచుంటిని

తప్పులు నావంతు తప్పించమంటిని

గార్వము నీఎడల దూరమోర్వకుంటిని

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా

 కలుసుకున్నాయి హృదయాలు గుంభనంగా

అల్లుకున్నాయి బంధాలు లతల చందంగా

నదివి నీవు కడలి నేను ఏకమైనాము సంగమంగా

పూవు నీవు తావి నేను వనమునకు మనమే అందంగా


1.నా ఉనికి కోల్పోయాను నీలోన లీనమైపోయి

మనుగడను సాగిస్తున్నాను నీకు ఆలంబననేనై

రుచీ గతి వదిలేసాను నేను నీవుగ మారిపోయి

పరిపూర్ణగ తరించినాను నీకు జతగ చేరిపోయి


2.నా పుట్టుక కొండలు గుట్టలు తోబుట్టులు ఇరుగట్టులు

మెట్టింట అడుగెట్టినాను నీ తరగలు సంఘట్టనలు

లావణ్యం సౌందర్యం వరములు నా  సహజాతాలు

నీవు నా తోడైనప్పుడు గుప్పుమనెను గుభాళింపులు