Wednesday, January 6, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్ర కౌఁస్


రమ్మంటే రావేలా పడకటింటికి

గంధర్వకాంతలా కనిపిస్తూ నా కంటికి

తలనిండా మల్లెదండ తహతహ పెంచ

న్యాయమా అర్ధాంగీ నన్నుడికించ


1.ఎప్పుడొస్తానా అని ఎదిరిచూపు నా కొరకు

అభిసారికవై  సాయంత్రం నేనిల్లు చేరే వరకు

వచ్చీరాగానే జాప్యానికి హెచ్చిన అలకలై

ఉవ్విళ్ళూరే యవ్వనమే ఉసూరనగ కలై

తెల్లచీర ఉల్లమందు ఉద్విగ్న పరచ

ధర్మమా శ్రీమతి నా మదిని దోచ


2.సత్యభామ పదములొత్తు కృష్ణుడకానా

మోహినినే బ్రతిమాలెడి శివుడనేనైపోనా

కట్టుకున్ననాడె నీ దాసుడనై పోయానే

బెట్టేజేయ తగదు సఖీ నీ ప్రియపతినికానే

ఓరచూపు మూతివిరుపు నీకందమే

ప్రేయసీ ఊర్వశీ ఇకనైనా అందవే

https://youtu.be/W__mGEV-4ng?si=ovWZzG2s2eMl7_em

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:ద్విజావంతి, కాపి

ఎవరిని అడిగి చేరావు షిరిడి
ఏమాశించి పంచావు ప్రేమని
తొలగించావు తీవ్రమైన బాధలని
ప్రవచించావు ఉచితమైన బోధలని
సాయిబాబా దత్తావదూత నమస్సులివే
నీపద పుష్పాలుగ మా మనస్సులివే

1.అందరినీ ఆదరించు ఆత్మబంధువైనావు
 అంతెరుగని అనురాగ సింధువైనావు
దీర్ఘకాల వ్యాధులకు నీవే మందువైనావు
దివ్య దర్శనమ్మీయగ కను విందువైనావు
సాయిబాబా దత్తావదూత నమస్సులివే
నీపద పుష్పాలుగ మా మనస్సులివే

2.చెబితేనే చూస్తావా మా శ్రేయస్సు
కోరితేనె ఇస్తావా మాకు జ్ఞాన రుచస్సు
దశదిశలా వ్యాపించె నీ లీలల యశస్సు
పొందిన ప్రతి ఉన్నతి నీవొసగిన ఆశీస్సు
సాయిబాబా దత్తావదూత నమస్సులివే
నీపద పుష్పాలుగ మా మనస్సులివే


 

https://youtu.be/bqpnYy-SZXY?si=SFyaX3GIM1fQPxxF

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అభావమయ్యింది మనసెందుకో 

కలతచెందింది కలమెందుకో

కవితకొరకు వస్తువులేకా

ఏ ఘటనకైనా ఎద చలించకా

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


1.తాదాత్మ్యత లోపించింది ఆధ్యాత్మికతన

సర్వస్యశరణాగతిలేదు భక్తితత్వాన

ఢాంభికాలు ప్రదర్శనలు అట్టహాసాలు

ఆత్మలోకి అవలోకించక పరమత పరిహాసాలు

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


2.పూలుపళ్ళు పోలికతో వనితల ఒళ్ళు

ప్రేమా ప్రణయం అనురాగం శృంగారాలు

విరహాన వేగిపోయే ప్రేమికుల వేదనలు

అనుభవైక వేద్యమైన అను నిత్య భావనలు

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


3.కంఠశోష మినహాయించి మంచిమార్పు సాధ్యమా

పుర్రెకో బుద్ది తరహా వైవిధ్య ప్రపంచమా

ప్రవక్తలు సంస్కర్తలస్వప్నం ఈ సమాజమా

భ్రష్టుపట్టి పోతున్న  మానవ భవితవ్యమా

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం