Monday, September 9, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రేవతి

కీర్తన నాది నర్తన నీది
సాగనీ నటరాజా-కళామతల్లి పూజ
చెలరేగనీ చిదంబరేశ-నా హృదయ ఘోష

1.భూ నభోంతరాలు దద్దరిల్లగా
పదునాల్గు భువనాలు పిక్కటిల్లగా
సప్తసముద్రాలు ఉవ్వెత్తున ఎగసిపడగ
ప్రకృతి సమస్తం ప్రకంపించునట్లుగా
సాగనీ నటరాజా నీ తాండవ లీల
ప్రకటించనీ చిందంబరేశ  నా ఆత్మ భాష

2.జలపాతాలే తంబూరాలై సుశ్రుతీయగా
ఎదనాదాలే మృదంగ జతులై లయకూర్చగా
సెలయేటి అలలే జలతరంగిణులై మ్రోగగా
ఆకుల గలగలలే సంతూర్ ధ్వనులై రవళించగా
సాగనీ నటరాజా నీ నాట్య కేళీ
పాడనీ చిదంబరేశ నా జీవన సరళీ

3.పంచభూతాలే ప్రేక్షకులవగా
పంచప్రాణాలే సమీక్షకులవగా
పంచాననా ప్రపంచ పరిరక్షకా
నీ పంచన చేరితిరా నను పెంచిపోషించగ
సాగనీ నటరాజ ఆనంద నృత్య హేల
చల్లారనీ చిదంబరేశ నా బ్రతుకున వెతలకీల

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఉత్తీర్ణత కలుగుటకు కృషి ఒకటేనా
విజయం సాధించుటకు రాచబాటేనా
నరాలు తెంచుకున్నా మిగిలేది కంఠ శోషే
అస్మదీయుడైతె సరి వడ్డించేవాడికెపుడు మనధ్యాసే

1.బలి దానాలతో కలనెరవేరింది
శోకాలే కాకులకు,గ్రద్దలకే ముద్ద దక్కింది
రంగులగొడుగుంటె చాలు ఏ ఎండైనా సమ్మతమే
సమీకరణ రణాల్లో పక్షమేదైనా పక్షపాతమే

2.స్వార్థమనే యజ్ఞానికి సామాన్యులె సమిధలు
రాజకీయ రంగంలో  ప్రజలేగా వంచితులు
అధికారం నేతలకు అనివార్యమైనదేగ
అంధకారం పౌరులకు  అలవాటైనదేగ

3.ఏకఛత్రాధి పత్యమే పాలన ఏలికలకు
గతమెంత వెతికినా దొరకదు పోలికలకు
కనీవినీ ఎరుగని అవకాశం నాయకత్వాలకు
జనసంక్షేమం మరవొద్దు జారిచేయు ఫత్వాలకు

రచన.స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:అఠాణా

గణనాథుడు త్రిగుణాతీతుడు
అగణిత గుణగణ మహిమాన్వితుడు
కరుణాభరణుడు శరణాగత వత్సలుడు
సరగున బ్రోచెడి ప్రథమ పూజితుడు

1. కరిముఖవిలసితుడు కారణ జన్ముడు
కిన్నర కింపురుషాది దేవగణ సేవితుడు
కీర్తన మోహితుడు కుడుముల కూరిమివాడు
కృష్ణదేహ శోభితుడు కౄరకర్మ నాశకుడు
సరగున బ్రోచెడి ప్రథమ పూజితుడు

2.కెడయాడగ మూషిక వాహనుడు
కేలుమోడ్చి వేడగ అడిగినదొసగువాడు
కైలాసవాసుడు కొండంతఅండవాడు
మందార కోడిగనే మది కోరెడివాడు
కౌముదీపతివైరి కంకణకర వరదుడు


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాయామాళవ గౌళ

వెళ్ళిరావయ్యా గణపయ్యా నేటికి
మళ్ళిరావయ్యా మరుసటి ఏటికి
మరలిరావయ్యా మండపాల చోటికి
తరలిరావయ్యా ముమ్మాటికి

వీడోకోలు నీకిదే ఈ ఏటికి
సాగనంపేము నిన్ను పొలిమేర ఏటికి
నేటికి కోనేటికి నీటికి గంగాతటికి
 చేసెదమిదె నిమజ్జనం  ఎదనీకు నీరాజనం

1.కన్నుమూసి తెరిచేంతలొ గడవనీ ఏడాది
నిలువుమయ్య నిరతము కదలక మామది
నిందలు రానీకు మోముని చూసినా చందమామది
వందనాలు నీకివే వక్రతుండ విఘ్నపతి
 చేసెదమిదె నిమజ్జనం  ఎదనీకు నీరాజనం

2.తెలిసో తెలియకో చేసేము తప్పులెన్నో
 ఆడుతు పాడుతూ దాటేము గీతలెన్నొ
గుంజీలు దీసేము ఏకదంత పరితపించి
మన్నింప వేడెదము మా చెంపలువేసుకొని
  చేసెదమిదె నిమజ్జనం  ఎదనీకు నీరాజనం
వెన్నెలే ఎంతో వేడి అమ్మ చూపు కన్నా
తేనియే కడు చేదు అమ్మ పిలుపు కన్నా
కన్నా అని పిలిచినంత కడుపునిండి పోవులే
నానీ అని తలనిమిరిన మనసుకెంతొ హాయిలే

1.కమ్మనైన రుచి ఏది అమ్మగోరుముద్ద కన్న
మధురమైన గీతమేది అమ్మజోల పాటకన్న
అనురాగం అమృతము కలుపుతు కుడిపిస్తుంది
అరిచేతిలొ పాదముంచి నను నడిపిస్తుంది

2.నీరెండ కన్నా వెచ్చనిది అమ్మ ఒడి
మోదానికి ఖేదానికి నా కోసమే అమ్మ కంటతడి
చాదస్తం  అమ్మదంటూ అశ్రద్ధనే నే చేసినా
సర్వస్వం నేనేనంటు అమ్మకు ఆరాటమే ఎపుడు చూసినా

3.అన్నమయ్య రాసాడు వెంకన్నను కీర్తిస్తూ
అతులితమౌ పదాలు ముప్పది రెండు వేలు
ఏ కవీ రాయలేడు అమ్మప్రేగు బంధాన్ని వివరిస్తూ
అలతి అలతి పదాలలోనైనా బ్రతికినన్నాళ్ళూ