Thursday, October 10, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చేజారి పోయాకె మణుల విలువ తెలిసేది
కనుమరుగై పోయాకె మనిషి వెలితి తెలిసేది
బంధాలు పలుచబడితె తలోదిక్కు కుటుంబం
బాధ్యతలను వదులుకుంటె అయోమయం జీవితం

1.కాసింత పట్టించుకొంటె చాలు ఇల్లాలిని
అవార్డులేం ఆశించదు ఏపూట అర్ధాంగి
పెత్తనమేనీదంటే ప్రాణం పెడుతుంది
గెలినట్టు మైమరచి తాను లొంగిపోతుంది
నిన్నే నమ్ముకొన్నది అన్నీ వదిలివచ్చి ఆలి
ఆరుతీరులా నిను అలరించును కోమలి

2.పిసరంత హత్తుకొంటే ఫిదా నీ పిల్లలు
ప్రేమకొరకు అంగలార్చు అందరున్న అనాథలు
వాస్తవలోకానికి దూరమౌతు ఉంటావు
అరచేతి మాయలో మునిగితేలుతుంటావు
పంచభూతాలతో మైత్రిని బలిచేయకు
పంచేంద్రియాల అనుభూతి నలిపేయకు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:నట భైరవి

నిట్టూర్పుగాను నీవె -ఓదార్చగాను నీవె
ఆవేదన లోనూ నీవే సాయీ
ఆనంద కారణమూ నీవే నోయీ
ఊపిరివే నీవైనావు జయజయ సాయీ
ఎద స్పందన నీవైనావు షిరిడీ సాయీ

1.తల్లివనీ తలపోస్తాము-తండ్రివినీవని ప్రేమిస్తాము
గురుడవు నీవనీ గురుతుంచుకొంటాము
హితుడవు నీవని నిన్ను నమ్ముకొంటాము
కులమతాతీడవు జయజయ సాయీ
ఏకైక దైవమీవే షిరిడీ సాయీ

2.ప్రతి పర్వము నీతోనే-ప్రతివారము నీముందే
అభిషేకము అర్చనలు నివేదనలు నీకే
పంచహారతులు పల్లకి సేవలు నీకే
మా మనుగడ నీకృపనే జయజయసాయీ
నువు వినా బ్రతుకులేదు షిరిడీ సాయీ
ఏ కన్ను ఊరుకుంటుంది-చూడకుండా
ఏ పెన్ను మిన్నకుంటుంది-రాయకుండా
చూపుల్లో సూదంటు రాయిలుంటే
 పెదవుల్లో కవ్వింపు నవ్వులుంటే

1.అలంకారమెరుగని అందచందాలు
అహంకార రహితమైన హావభావాలు
చూస్తూండిపోవచ్చు జీవితకాలం
అనుభూతిచెందకుంటె వృధా ఆ జన్మం

2.కళ్ళు తిప్పుకోలేని నిస్సహాయత
రెప్పలల్లార్చలేని నిశ్చేష్టత
సహజమైన సౌందర్యం కుంచెకు లొంగదు
వర్ణనాతీతమైన సోయగం కవితకు అందదు

అక్షరాలే వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు
అక్షరాలే అట్లతద్ది నోముకునే ముద్దగుమ్మలు
అక్షరాలు తెలుగింటి ఆడపడుచులూ
అక్షరాలే కుంచెను మురిపించే బాపు బొమ్మలు

చ1.గోరింటాకు సొగసులతో ఒక అక్షరం
సంక్రాంతి ముగ్గులతో ఒక అక్షరం
తలకునీళ్ళోసుకొని ఒక అక్షరం
తులసికోట చుట్టు తిరుగునొక అక్షరం
ఓరచూపు విసిరేస్తూ ఒక అక్షరం
కొంటెనవ్వు వలవేస్తూ ఒక అక్షరం

చ2.పట్టు పావడాతో ఒక అక్షరం
పరికిణీ ఓణీలతొ ఒక అక్షరం
పాపిటి బిళ్ళతో ఒక అక్షరం
పట్టీల పాదాలతొ ఒక అక్షరం
బుగ్గసొట్ట గాలమేస్తు ఒక అక్షరం
సిగ్గులొలకబోస్తూ ఒక అక్షరం