Saturday, March 16, 2019

రంజింపజేయమందురె
రసికజనులెందరో
నా గాత్ర మాధుర్యములో
పరవశింపగా
నను కోరుచుందురే
అభిమానులందరూ
నా గానలాహిరిలో
ఓలలాడగా

కోయిలే నాకు గురువు గొంతెత్తి పాడగా
సెలయేరె ఆదరువు
నా పాటగతులు సాగగా
తోటలోని ప్రతితరువు
నాకు శ్రోతకాగా
అనుదినము నాకచ్చేరి ఆనందవర్షితగా

రాగాలనెరుగనైతి త్యాగరాజులాగా
పదములు పలికించనైతి
అన్నమయ్యలాగ
మనోధర్మ సంగీతం నాకు ఊతము
హృదయజన్య నిజభావం నా గీతము

"నేటి నిజం"

వలువలు జారవిడిచి రాజకీయం
విలువలు కోల్పోయి రాజకీయం
రాజకీయమంటేనే మాయోపాయం
రాజకీయ మంటల్లో భారతీయం-నేటి భారతీయం

అధికారమొక్కటే ప్రధాన లక్ష్యం
పదవి పీఠమెక్కుటే ఏకైక ధ్యేయం
అడ్డమైన గడ్డిమెక్కుటే పక్షాల ఆశయం
అడ్డగాడిద కాళ్ళైన మొక్కుటే నేతల దైన్యం
రాజకీయమంటేనే మాయోపాయం
నేటిరాజనీతి చూడ కౌటిల్యుడె అయోమయం

వక్ర మార్గాలే ఈనాటి ప్రతి పార్టీ ట్రిక్స్
అక్రమాలతోనే ఇప్పటి డర్టీ పాలిటిక్స్
చక్రం తిప్పుతూ చేస్తారు జిమ్నాస్టిక్స్
విక్రమార్కులై నెగ్గుతారు దిగజార్చి ఎథిక్స్
రాజకీయమంటేనే మాయోపాయం
జంపింగ్ జిలానీల వైఖరే అయోమయం

సీటుకొరకు డబ్బెంతో వెదజల్లుతారు
ఓటుకొరకు ఏదైనా ప్రలోభపెడతారు
నీటి మూటనే ప్రజాసేవ అన్నమాట
దోచుకునే దొంగాటనె రాజకీయమంతటా
రాజకీయ మంటేనే మాయోపాయం
ఓటరు తీర్పుతోనె జరుగుతుంది తగున్యాయం

Saturday, March 9, 2019

నమ్మినవారికి నడిచే దేవుడవు
నాస్తికులకి సైతం ఆదర్శ ప్రాయుడవు
అనాథగా అవతరించి ఆత్మబంధువైనావు
షిర్డీలో వసియించి ఎదఎదలో వెలిశావు
కులమతాతీతంగా మనిషిని ప్రేమించావు
జీవకారుణ్యతా మానవతలు పంచావు
దైవంమానుష రూపేణా నీవేలే సాయి
మనిషే దైవమనగ నీవేగా బాబా
బాబా సాయిబాబా- బాబా షిర్డీ బాబా

1.మహిమల దాపున ఆకర్షణ ఉన్నది
లీలల వెనుక నీ ఆదరణ ఉన్నది
బూడిద నొసగుటలో పరమ తత్వమున్నది
నీ మాటల మాటున వేదాంత మున్నది
దైవంమానుష రూపేణా నీవేలే సాయి
మనిషే దైవమనగ నీవేగా బాబా
బాబా సాయిబాబా- బాబా షిర్డీ బాబా

2.నీ జీవిత మర్మమే గురు గ్రంథము
నీ బోధలసారమే గీతా మకరందము
నీకరుణా దృక్కుల్లో కనిపించును క్రైస్తవము
నీ దరహాసములో వికసించును ఇస్లాము
దైవంమానుష రూపేణా నీవేలే సాయి
మనిషే దైవమనగ నీవేగా బాబా
బాబా సాయిబాబా- బాబా షిర్డీ బాబా

Saturday, March 2, 2019

తెలుసుకో నరుడా శివరాతిరి అంతరార్థం
మసలుకొ పామరుడా ఎరిగి లింగార్చన పరమార్థం
శివుడొక్కడే విశ్వనాథుడు-భవుడొక్కడే ఆత్మరూపుడు
శివోహం సదాశివోహం-దాసోహం సదా సోహం

1.పంచభూతాత్మకుడు-పంచానన రూపుడు
పంచప్రాణాధీశుడు- పంచామృత ప్రియుడు
సలిలధారతోనే సంతుష్టుడు
మారేడు దళమిడితే పరవశుడు

2.అహరహరం హరధ్యానము-శివరాతిరి మర్మము
నవవిధభక్తి యుతము శివదీక్షా విధానము
నదీ స్నానం ఉపవాసం పాపహారకం
జాగరణ నామ స్మరణ ముక్తి కారకం

3.ప్రకృతియే పార్వతి-కాలాత్ముడే రుద్రుడు
భక్తవశంకరుడు అభయంకరుడు
అర్ధనారీశ్వరమే సకల సృష్టికి మూలం
అంబా శివ కళ్యాణమె ఆనంద దాయం