Tuesday, December 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిద్రలేమి నీవల్లే ఎంతటి మోక్షగామికైనా

జాగృతమౌతాయి కాంక్షలు ముదిమి కైనా

వ్రతభంగమౌతుంది అస్కలిత బ్రహ్మచారికైనా

కోర్కె మేలుకుంంటుంది వింతగ సాటినారికైనా


1.పురివిప్పిన నినుగాంచి మబ్బునాట్యమాడుతుంది

నీ గాత్ర మధరిమ కోరి ఆమని అరుదెంచుతుంది

ఆపాదమస్తకం మదనరంగమే నీ అందాల అంగాంగం

వాత్సాయన శాస్త్ర రూపమై పొంగిపొరలె నీ శృంగారం


2.ప్రతి పుటలో ప్రస్ఫుటమే నీమేని గ్రంథాన రతికేళి విన్యాసం

వీణియలా వేణువులా తబలాలా ఎట మీటినా రస సంగీతం

తారాస్థాయిచేరుతుంది అనుభూతి సారమంతా సారవంతమై

తీరా తీరం చేరినంతనే తిరిగి మొదలౌతుంది పయనం పంతమై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సజీవంగ ఉండాలి మనిషెప్పుడు

చోటునార్జించాలి జనుల మదిలొ గుప్పెడు

కీర్తిని గడించాలి లోకోపకారియై

మన్నన పొందాలి మహనీయుడై

మహత్మా గాంధీలా మదర్ థెరిసాలా అబ్దుల్ కలాం లా


1.ప్రవర్తించాలి అనునిత్యం దయామయుడై

ఆచరించి చూపాలి నడత ఆదర్శప్రాయుడై

ఆదరించగలగాలి అందరిని స్నేహశీలుడై

అసామాన్యుడైనా మెలగాలి నిస్వార్థుడై

వివేకానందునిలా నెల్సన్ మండేలాల బిస్మిల్లా ఖాన్లా


2.అడుగులేయాలి సగటు మనిషి దిశగా

ఆవిష్కరించాలి సకల మానవ హితైషిగా

కొలువుండాలి గుండెల్లో బడుగుల ఆశగా

జాగృత పరచాలి జాతిని తను మార్గదర్శిగా

రతన్ టాటాలా ఐన్ స్టీన్ లా అంబేడ్కర్ లా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాటి మనిషి ఎదుగుదలను సైచలేని గుణం

నిలువెల్లా నిండినది మనుషుల్లో ఓర్వలేనితనం

తనకున్నా లేకున్నా ఒరుల ఎడల అసూయే

తలవంచుక చనలేక మాటలు చేతలు విషమాయే


1.గొడ్డలి కామాయే చెట్టుకు చేటాయే

తనజాతి వారెపుడు జనులకు కడు హానియే

పొందేదేది ఉండదు ఈర్ష్య వల్ల పైశాచికత్వం మినహా

కోల్పోయేదీ ఉండదు కుళ్ళుబోతు ఆంబోతు తరహా


2.అరిషడ్వర్గాలలో అయితేనేం అది ఆఖరిది

అర్థరహితమే అది వ్యర్థమైనది అనర్థమైనది

వ్యక్తిత్వానికి మానవత్వానికి మాయని మచ్చఅది

అకారణంగా విరోధాన్ని పెంచునది మత్సరమన్నది