Monday, July 20, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రలోభాలు ప్రలోభాలు ప్రలోభాలు
మనిషి బలహీనతపై స్వారిచేసె మత్తేభాలు
జ్వాలల మోజులో కాలిపోవు నెన్నో శలభాలు
వేటగాళ్ళ ఉచ్చులో చిక్కేను బేల శరభాలు

1.స్వేఛ్ఛను హరింపజేసే ఓట్ల బేరసారాలు
విచ్చలవిడిగా పంచేటి నోట్లు సారాలు
ఇఛ్ఛను భ్రమింపజేసే మతబోధ సారాలు
లౌకికతే భ్రష్టుబట్టు విషమయ కాసారాలు
తార్పిడులకు మార్పిడులకు తావా మన మానస వసారాలు

2.ఆత్మను అమ్ముకొనుటె తీసుకుంటె లంచం
డబ్బిస్తే నాకడమేనా  ప్రతివాడి ఎంగిలి కంచం
కష్టార్జితానికే విలువనీయగలదు ఈ ప్రపంచం
పరాన్నబుక్కులు దొంగల బ్రతుకే నీచాతినీచం
తలతెగితేనేం మనుషుమైతె మనం ఎవరికి తలవంచం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కళావతి

పొన్నచెట్టు పొదలమాటు
ఏకాంతమైన చోటు
కన్నయ్యకోసమే కాచుకుంది
అన్నులమిన్న వేచిఉంది
తమకం కమ్ముకున్న అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక

1.నల్లనయ్యకోసమని పిల్లనగ్రోవి గొని
వేణుగాన మాధురిలో పరవశమొందాలని
మువ్వలపట్టీలు కట్టి నాట్యమాడాలని
మువ్వగోపాలుని మురియగ జేయాలని
తహతహలాడుతోంది అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక

2.కలువల కళ్ళతోని   పూజించాలని
ఆధరసుధారసములనే నివేదించాలని
తనువు కర్పూరమవగ హారతి పట్టాలని
మనసు మనసు సంగమించ స్వర్గం ముట్టాలని
తరుణముకై తొందరించె అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శివరంజని

తల్లిగర్భములోని పిండానికి అండదండెవ్వరో
ఇహలోక బంధాలు అవలీలగా ముడివేయునెవ్వరో
పురిటిగుడ్డుకు రోదనలు నేర్పింది ఎవ్వరో
అమ్మరొమ్మును కుడువ బోధించెనెవ్వరో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం

1.ఆకలిదప్పులు అంగాంగ నొప్పులు శిశువుకెవ్వరు తీర్తురో
ఆహార లభ్యతను స్వీయ సంరక్షణను పశువుకెవ్వరు కూర్తురో
పక్షులకు చేపలకు ఎగరగా ఈదగా ఎవరు శిక్షణ నిత్తురో
క్రిమికీటకాదుల మనుగడకు ఏర్పాటు నెవరుకావింతురో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం

2.మనిషికీ మనిషికీ నిమిషనిమిషానికీ బుద్ధినెవ్వరు మార్తురో
బహువింతరోగాలు ఉన్నతులు దుర్గతులు ఎవరంటగడ్దురో
విపరీతపోకడల పైశాచ కృత్యాల పురికొల్పు దాతెవ్వరో
పంచభూతాల భీభత్సకాండతో లోకమే హరియించు నేతెవ్వరో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం